దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 9.5 శాతం : మాజీ సీఈఏ

ABN , First Publish Date - 2022-01-11T20:54:27+05:30 IST

భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం రేటుతో

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 9.5 శాతం : మాజీ సీఈఏ

న్యూఢిల్లీ : భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం రేటుతో వృద్ధి చెందే అవకాశం ఉందని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ విర్మానీ చెప్పారు. ప్రభుత్వ వ్యయం, ఎగుమతులు పెరిగినట్లు తెలిపారు. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రైవేటు వినియోగ రంగం ఇంకా కోలుకోలేదని తెలిపారు. భారత దేశ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు ప్రస్తుతం సానుకూలంగా ఉందన్నారు. ఉద్యోగాల వృద్ధి రేటు వెనుకంజలో ఉందని తెలిపారు.


సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ)లు సమ్మిళిత వృద్ధికి చాలా ముఖ్యమని చెప్పారు. ఆధునిక ఎంఎస్ఎంఈలు కార్పొరేట్ రంగంతో పోటీ పడటానికి సంపూర్ణ అవకాశాలు ఉండాలని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అధికంగా ఉంటుందని, సుమారు 9.5 శాతం వరకు ఉండవచ్చునని చెప్పారు. ఈ దశాబ్దం (FY21-FY30) సగటు వృద్ధి సుమారు 7.5 శాతం (+/- 0.5 శాతం) ఉండవచ్చునని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై పడిందన్నారు. పన్నుల సంస్కరణలు రావాలని తెలిపారు. పారిశ్రామిక రంగ సంస్థ PHDCCI నిర్వహించిన వర్చువల్ సమావేశంలో అరవింద్ మంగళవారం మాట్లాడారు. 


ఇదిలావుండగా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 9.2 శాతం ఉండవచ్చునని అంచనా. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.3 శాతం అనే విషయం తెలిసిందే. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును 9.5 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) 2021లో భారత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 9.5 శాతం అని తెలిపింది. అదేవిధంగా వచ్చే ఏడాది ఈ  వృద్ధి రేటు 8.5 శాతం అని అంచనా వేసింది. 


Updated Date - 2022-01-11T20:54:27+05:30 IST