2019 ప్రపంచ కప్ భారత్ అందుకే ఓడిపోయింది: టామ్ మూడీ

ABN , First Publish Date - 2020-07-12T00:28:30+05:30 IST

2019 ప్రపంచ కప్‌లో భారత్ కప్ చేజిక్కించుకోలేకపోవడంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, భారత మాజీ కోచ్ టామ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టోర్నీ ఆసాంతం భారత్ ఆటగాళ్ల...

2019 ప్రపంచ కప్ భారత్ అందుకే ఓడిపోయింది: టామ్ మూడీ

కాన్‌బెర్రా: 2019 ప్రపంచ కప్‌లో భారత్ కప్ చేజిక్కించుకోలేకపోవడంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, భారత మాజీ కోచ్ టామ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టోర్నీ ఆసాంతం భారత్ ఆటగాళ్ల బ్యాటింగ్ స్థానాల్లో మార్పులు చేస్తూ వచ్చిందని, ఆటగాళ్లను కూడా మార్చిందని, ఇవి జట్టు పటిష్ఠతను దెబ్బతీశాయని మూడీ అన్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మూడీ భారత జట్టు వైఫల్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ పటిష్ఠమైన జట్టనడంలో ఎటువంటి సందేహం లేదని, అయితే వారి ప్రతిభపై ఉన్న అంచనాలే వారికి మోయలేని భారంగా మారుతున్నాయని చెప్పారు. ‘వరల్డ్ కప్ లాంటి ప్రతిష్ఠాత్మకమైన టోర్నీలలో ఆడుతున్నప్పుడు ఆటగాళ్ల ప్రతిభతో పాటు వారి స్థానాలు కూడా స్థిరంగా ఉండాలి. అప్పుడే వారు రాణించగలుగుతారు. అలా జరగని సమయంలో ఆటగాళ్లు గందరగోళానికి గురవుతారు. దానివల్ల సరిగా ఆడలేకపోయే అవకాశం ఉంది. దీని కారణంగానే భారత్ వెనుదిరగాల్సి వచ్చింది.


ముఖ్యంగా 4వ స్థానంలో సరైన ఆటగాడిని ఎంపిక చేయడంలో భారత్ విఫలమైంది. దాంతో టోర్నీలోనే ఆ స్థానంపై ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. దీనివల్ల జట్టు సమతౌల్యం దెబ్బతింది. దీనికి తోడు జట్టుపై ఉన్న అంచనాలు ఆటగాళ్లపై మరింత ఒత్తిడి పెంచాయి. ఈ కారణాలన్నీ కలిసి భారత్ ఓటమికి బాటలు వేశాయ’ని మూడీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ కప్ ఓటమి తర్వాత కెప్టెన్ కోహ్లీతో పాటు కోచ్ రవిశాస్త్రిలు టీ20 ప్రపంచ కప్‌పై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. టీ 20 టోర్నీలో కచ్చితంగా సత్తా చాటుతామని ప్రకటించారు. అయితే కరోనా కారణంగా ఆ టోర్నీ నిర్వహణే అనుమానంగా మారింది.

Updated Date - 2020-07-12T00:28:30+05:30 IST