- చిత్తూరు, కడపల్లో ప్రజాసంఘాల నిరసనలు
- పునర్వ్యవస్థీకరణ నిర్ణయంపై అభ్యంతరాలు
- జిల్లా కేంద్రం కాకుంటే కర్ణాటకలో కలపండి
- మదనపల్లె జిల్లా సాధన సమితి డిమాండ్
- కాక రేపిన అన్నమయ్య జిల్లా కేంద్రం
- రాజంపేటలో ర్యాలీ, నల్లబ్యాడ్జీలతో నిరసన
- ఆమరణ దీక్షలకు దిగుతామని నేతల హెచ్చరిక
- ‘రాయచోటి’ జిల్లాపై తాళ్లపాక వాసుల ఆగ్రహం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా రాజకీయ కోణంలోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టారని ఆరోపిస్తూ చిత్తూరు, కడప జిల్లాల్లో నేతలు ఆందోళన బాట పట్టారు. మదనపల్లె జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం మదనపల్లెలో బుధవారం తిరంగా యాత్రను ప్రారంభించారు.
రాజంపేట జిల్లాకు మదనపల్లెను కేంద్రంగా ప్రకటించాలని కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో ప్రజాసంఘాలు ఉద్యమిస్తున్నాయి. పాలనా కేంద్రంగా మదనపల్లెకు బ్రిటిష్ కాలం నుంచీ ఉన్న నేపథ్యం, భవన వసతి, విద్య, వైద్య సంస్థలు అందుబాటులో ఉండటం వంటి సానుకూలతలతో ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తుందన్న ఆశాభావం ఇక్కడ ప్రజల్లో ఉండేది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. తిరంగా యాత్ర ఈ సందర్భంగా సాధన సమితి కన్వీనర్ పీటీఎం శివప్రసాద్ మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం కోసం జిల్లాల పెంపు ప్రకియ్ర చేపట్టినట్లు ప్రభుత్వం చెప్పిన మాటలకు, ప్రకటనకు ఏమాత్రం పొంతన లేదని ఆరోపించారు. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించకుంటే కర్ణాటకలో కలిపేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో మదనపల్లెకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీన్ని ఈ ప్రాంత ప్రజలు సహించబోరని స్పష్టం చేశారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుంచి బీటీ కళాశాల వరకూ తిరంగా యాత్ర చేపట్టారు. మదనపల్లెను జిల్లాకేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే రెండు విడతలుగా 596 రోజులు ఉద్యమాన్ని చేపట్టగా, బుధవారం 597వ రోజున మూడోవిడత ఉద్యమాన్ని ప్రారంభించినట్లు సాధన సమితి ప్రతినిధులు ప్రకటించారు. కాగా, ఎంతో చరిత్ర కలిగిన మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి.
ఈ బాధ్యతలను రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకోవాలని నేతలు కోరారు. బుధవారం మదనపల్లెలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్‌బాషా, దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ మదనపల్లెను జిల్లా చేయకుంటే ఇక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ యమలా సుదర్శనం, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్ర, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆమరణ దీక్షలకు దిగుతాం
రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై అన్నమయ్య ప్రాంతీయులైన రాజంపేట నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులను అవమానించే రీతిలో ఆయన జన్మించిన గడ్డను జిల్లా కేంద్రం చేయకుండా ఎక్కడో ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం ఏమిటని అన్ని పార్టీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. టీడీపీ పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి చెన్నూరు సుధాకర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు రాజంపేటలో అన్నమయ్య విగ్రహం వరకు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీ నిర్వహించి విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. అన్నమయ్య పుట్టిన గడ్డనే జిల్లా కేంద్రం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు దిగి ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్నమయ్య పేరుతో రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎలా ప్రకటిస్తారంటూ తాళ్లపాక గ్రామస్థులు బుధవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. ఆ గ్రామ వైసీపీ నాయకుడు, మాజీ మార్కెట్‌యార్డ్ చైర్మన్ యోగీశ్వర్‌రెడ్డి, వైసీపీకి చెందిన సర్పంచ్ గౌరీశంకర్, ఎంపీటీసీ మధుసూధనవర్మ తదితరులు నిరసనల్లో పాల్గొన్నారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోతే మూకుమ్మడిగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. రాజంపేట వైసీపీ ప్రధాన నేతల చేతగానితనంవల్లే ఈ దుస్థితి దాపురించిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్‌నాయుడు విమర్శించారు.