ఇదేం తిరకాసు!

ABN , First Publish Date - 2022-01-27T06:47:26+05:30 IST

కొత్త జిల్లా ఏర్పాటులో సహేతుకత లేదు.. పేరు పెట్టడంలో ఔచిత్యం పాటించలేదు..

ఇదేం తిరకాసు!

విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లా

మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా

కొత్త జిల్లాల ఏర్పాటు ముసాయిదా విడుదల

పార్లమెంటు నియోజకవర్గాలే ప్రామాణికం

విజయవాడ చెంతనే గన్నవరం, పెనమలూరు

ఆ రెండూ మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే జిల్లాలోకి

నూజివీడు, కైకలూరు ఏలూరు జిల్లాలోకి

ఎన్టీఆర్‌ స్వగ్రామం కొత్త కృష్ణాజిల్లాలో..

ఆయన పేరు విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు 

కొత్త జిల్లాల పేర్లపై విమర్శలు

కొత్తగా నందిగామ, తిరువూరు రెవెన్యూ డివిజన్లు


కొత్త జిల్లా ఏర్పాటులో సహేతుకత లేదు.. పేరు పెట్టడంలో ఔచిత్యం పాటించలేదు.. పార్లమెంటు నియోజకవర్గాలనే ప్రామాణికంగా తీసుకుని జిల్లాల ఏర్పాటుకు ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీంతో ప్రజలకు పాలనను చేరువ చేయాల్సిన కొత్త జిల్లాల ప్రతిపాదన వారికి అయోమయాన్ని మిగిల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ చెంతనే ఉన్న గన్నవరం, పెనమలూరులను మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే కొత్త జిల్లాలో కలుపుతూ ప్రతిపాదించడం.. నిమ్మకూరు నివాసి ఎన్టీఆర్‌ పేరును విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో ప్రస్తుతం రెండు పార్లమెంటు నియోజకవర్గాలు, 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు పార్లమెంటు నియోజకవర్గాలను ప్రామాణికంగా తీసుకున్నారు. దీంతో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మచిలీపట్నం, పెడన, గుడివాడ, అవనిగడ్డ, పామర్రు, గన్నవరం, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో మచిలీపట్నం కేంద్రంగా కృష్ణాజిల్లాను ఏర్పాటు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ ఇచ్చారు. అలాగే విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లాను ఏర్పాటు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏలూరు నియోజకవర్గంలో ఉన్నందున వీటిని కొత్తగా ఏర్పడే ఏలూరు జిల్లాలో కలపనున్నారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాలతో జిల్లావాసులకు అనుబంధం పూర్తిగా తెగిపోనుంది. విజయవాడ చెంతనే ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే కృష్ణా జిల్లాలో కలపడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టడం సరికాదన్న వాదన ఉంది. 


ప్రధాన అభ్యంతరాలు ఇవీ..

మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ప్రస్తుతం మచిలీపట్నం, పెడన, గుడివాడ, అవనిగడ్డ, పామర్రు, గన్నవరం, పెనమలూరు ఉన్నాయి. ఇవన్నీ కొత్తగా మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే కృష్ణా జిల్లాలో భాగం కానున్నాయి. అయితే గన్నవరం, పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు మచిలీపట్నంతో కంటే విజయవాడతోనే అనుబంధం ఎక్కువ. భౌగోళికంగానూ ఈ రెండు నియోజకవర్గాలు విజయవాడకు చేరువలో ఉంటాయి. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గవాసులకు విజయవాడకు రవాణా సౌకర్యాలు అనుకూలంగా ఉంటాయి. పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాలో కలపడమే సముచితం. 


విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లాగా నామకరణం చేశారు. వాస్తవానికి ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరు పామర్రు నియోజకవర్గంలో ఉంది. ఇది మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే కృష్ణాజిల్లాలో ఉంది. ఎన్టీఆర్‌ పేరు ఈ జిల్లాకు పెడితే సముచితంగా ఉంటుంది. కానీ విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు పెట్టడంలో ఔచిత్యం లేదనే వాదనను ఆయన అభిమానులు లేవనెత్తుతున్నారు. 


కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు

ప్రస్తుతం జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. వీటిలో నూజివీడు డివిజన్‌ కనుమరుగుకానుంది. కొత్తగా నందిగామ, తిరువూరు డివిజన్లు ఏర్పడనున్నాయి. దీంతో విజయవాడ కేంద్రంగా ఏర్పడే ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రస్తుతం ఉన్న విజయవాడ రెవెన్యూ డివిజన్‌కు తోడు నందిగామ, తిరువూరు డివిజన్లు రానున్నాయి. మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే కృష్ణాజిల్లాలో మచిలీపట్నం, గుడివాడ రెవెన్యూ డివిజన్లు కొనసాగనున్నాయి. కొత్తగా ఏర్పడనున్న నందిగామ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని ఏడు మండలాలు చేరనున్నాయి. ప్రస్తుతం ఇవి విజయవాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్నాయి. ఇప్పటి వరకు విజయవాడ, నూజివీడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్న మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లోని మండలాలు తిరువూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి చేరనున్నాయి.

Updated Date - 2022-01-27T06:47:26+05:30 IST