తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు మళ్ళీ వాయిదా

ABN , First Publish Date - 2021-09-04T23:12:58+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటును వచ్చే వారానికి వాయిదా

తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు మళ్ళీ వాయిదా

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటును వచ్చే వారానికి వాయిదా వేసినట్లు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ శనివారం చెప్పారు. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరదర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడవచ్చునని, దీనికి సంబందించిన ప్రకటన శనివారం వెలువడవచ్చునని అందరూ భావించిన సంగతి తెలిసిందే. 


తాలిబన్లు చెప్తున్నదాని ప్రకారం, అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యంగా, అందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటి ప్రభుత్వానికి ఓ రూపం ఇవ్వడంలో ఆలస్యమవుతోంది. 


తాలిబన్లు ఆగస్టు 15న ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటును వాయిదా వేసుకోవడం ఇది రెండోసారి. తాలిబన్ అధికార ప్రతినిధి ముజాహిద్ శనివారం మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ సభ్యుల గురించి ప్రకటనను వచ్చే వారానికి వాయిదా వేసినట్లు తెలిపారు. ఇతర వివరాలను ఆయన వెల్లడించలేదు. 


నూతన ప్రభుత్వ ఏర్పాటుపై వివిధ వర్గాలతో చర్చించేందుకు తాలిబన్లు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యుడు ఖలీల్ హక్కానీ మాట్లాడుతూ, ప్రపంచానికి ఆమోదయోగ్యమైన, విస్తృత స్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నామని, అందువల్ల జాప్యం జరుగుతోందని చెప్పారు. తాలిబన్లు తమంతట తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరని, అయితే అది ప్రపంచానికి ఆమోదయోగ్యం కాదని చెప్పారు. అన్నిపార్టీలు, గ్రూపులు, సమాజంలోని అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఉండేవిధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో ఆఫ్ఘన్ మాజీ ప్రధాని, జమాతే ఇస్లామీ ఆఫ్ఘనిస్థాన్ చీఫ్ గుల్బుద్దీన్ హెక్మత్యార్‌కు స్థానం దక్కుతుందన్నారు. ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సోదరుడు తాలిబన్లకు మద్దతు ప్రకటించారని, ఆయనకు కూడా నూతన ప్రభుత్వంలో తగిన ప్రాతినిధ్యం లభిస్తుందని తెలిపారు. ఇతర వర్గాల మద్దతు కూడగట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 


ఇదిలావుండగా, భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఇటీవల మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్ గడ్డను భారత దేశంపై ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు వాడుకోకుండా చూడటంపైనే తాము దృష్టి పెట్టామని చెప్పారు. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడం గురించి మాట్లాడటం చాలా త్వరపడటం అవుతుందన్నారు. 


Updated Date - 2021-09-04T23:12:58+05:30 IST