నేడే రాష్ట్రావతరణ దినోత్సవం

ABN , First Publish Date - 2022-06-02T08:14:03+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిదేళ్లు పూర్తయి.. తొమ్మిదో ఏట అడుగు పెడుతుతోంది. గురువారం రాష్ట్రావతరణ దినోత్సవాన్ని ఘనంగా

నేడే రాష్ట్రావతరణ దినోత్సవం

పబ్లిక్‌గార్డెన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న కేసీఆర్‌

అమర వీరులకు నివాళి

ప్రజలకు గవర్నర్‌, సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిదేళ్లు పూర్తయి.. తొమ్మిదో ఏట అడుగు పెడుతుతోంది. గురువారం రాష్ట్రావతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్‌ ముస్తాబైంది. కరోనా వల్ల రెండేళ్ల పాటు ఈ వేడుకలు తక్కువ మంది అతిథులతో ప్రగతి భవన్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ సారి ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో పబ్లిక్‌గార్డెన్‌లో ఏర్పాట్లను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ బుధవారం పరిశీలించారు. గురువారం ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అంతకు ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం పబ్లిక్‌ గార్డెన్‌లో పోలీస్‌ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. పతాకావిష్కరణ అనంతరం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. సాయంత్రం రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మంత్రులు కూడా జిల్లాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తారు. కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఢిల్లీలో రాష్ట్రావతరణ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనుంది. ఉత్సవాలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.  

ప్రజల కలలు సాకారం: గవర్నర్‌

కష్టపడి పనిచేసే ప్రజలు, ఉద్యోగులు, నాయకులు, విధాన నిర్ణేతలు కలలుగన్న తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ, వనరుల్లో న్యాయమైన వాటా, అవకాశాలు తెలంగాణ రాష్ట్ర సాధనతో సాకారమయ్యాయని భావిస్తున్నట్లు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.  కాగా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం ఓ చారిత్రకఘట్టమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

ముఖ్యమంత్రి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజానీకానికి  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకున్నామని చెప్పారు.  కాగా, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ చొరవతో ఎనిమిదేళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-06-02T08:14:03+05:30 IST