Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 28 Jan 2022 23:04:16 IST

మొక్కుబడి సర్వే

twitter-iconwatsapp-iconfb-icon
మొక్కుబడి సర్వే

పట్టణాల్లో అంతంత మాత్రమే

సిద్దిపేటలోనూ పలు వార్డులను పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది

ఫీవర్‌ కిట్‌లు అందక జనం అవస్థలు

జ్వరాలతో ప్రైవేటుకు పరుగులు


సిద్దిపేట టౌన్‌, జనవరి 28: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే తూతూమంత్రంగా సాగుతున్నది. ఈ నెల 21న అట్టహసంగా ప్రారంభమైన ఫీవర్‌ సర్వే నియమం ప్రకారం సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇంట్లో ఎవరెవరికి జ్వరం వచ్చిందో, ఏమేం లక్షణాలు ఉన్నాయో కనుక్కుని నమోదు చేసుకుని, వారికి టాబ్లెట్ల కిట్‌ అందజేయాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలి. కానీ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆరోగ్యమంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలోనే ఈ సర్వే సజావుగా సాగకపోవడం విచిత్రంగా ఉన్నది. సర్వే చేయాల్సిన సిబ్బంది పలువార్డుల్లో ప్రధాన రహదారులలోని ఇళ్లకే పరిమితమవుతున్నారు. చాలా వరకు ఇంటింటికి వెళ్లకుండా స్థానిక వార్డునాయకుల నుంచే వివరాలు సేకరిస్తున్నారు. రెండుమూడంతస్తుల ఇళ్లలో కేవలం గ్రౌండ్‌ఫ్లోర్‌లో మాత్రమే వివరాలడిగి వెళ్లిపోతున్నారు. తద్వారా మొదటి, రెండో అంతస్థుల్లో ఎవరికి జ్వరం వచ్చిందనేది సర్వే సిబ్బంది తెలుసుకోవడం లేదు. ఇక అపార్ట్‌మెంట్లకు అస్సలు వెళ్లడం లేదు. దీంతో ప్రభుత్వ అసలు లక్ష్యం నెరవేరడం లేదు.


మా ఇంటికి ఎవరూ రాలేదు!

సిబ్బంది సంగతలా ఉంటే.. సర్వే అంటూ ఊదరగొడుతున్నారే తప్ప తమ ఇంటికి ఎవరూ రాలేదని సిద్దిపేట పట్టణంలోని పలువురు వాపోయారు. తమకు జ్వరం వచ్చిందన్న సంగతి చెప్పి మందులు తీసుకుందామంటే ఎదురుచూపులే దిక్కవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే పరిస్థితిపై ఆరా తీసేందుకు రంగంలోకి దిగిన ‘ఆంధ్రజ్యోతి’ బృందానికి స్థానిక శ్రీనగర్‌లో ఉండే శ్రీధర్‌, నాసర్‌పురా నివాసి లక్ష్మి, భారత్‌నగర్‌ వాసి శ్రీనివాస్‌, కోటిలింగాలవద్ద మెయిన్‌రోడ్డులోనే ఉండే వృద్ధురాలు మణెమ్మ పరిస్థితి వివరించారు. డిగ్రీ కళాశాల వెనుక ప్రాంతంలోని పలు కాలనీలతో పాటు అనేక వార్డుల నుంచి ఇలాంటి సమాధానమే వచ్చింది. 


మిగతా పట్టణాల్లోనూ అభాసుపాలు

శుక్రవారం నాటికి సిద్దిపేట జిల్లావ్యాప్తంగా 2,70,484 ఇళ్లను సందర్శించి జ్వర సర్వే చేశామని అధికారులు చెబుతున్నారు. వీరిలో 5,042 మందికి జ్వర లక్షణాలుండడంతో మెడికల్‌ కిట్లను అందజేశామని వివరించారు. కానీ నిజానికి ప్రతి పది ఇళ్లను లెక్కలోకి తీసుకుంటే కనీసం మూడిళ్లలోనైనా జ్వర బాధితులున్నారు. కొన్ని కుటుంబాల్లోనైతే దాదాపు అందరు సభ్యులు జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పితో బాధపడుతున్నారు. మెడికల్‌ షాపుల్లో అజిత్రోమైసిన్‌, పారాసిటమాల్‌, మల్టీవిటమిన్‌ టాబ్లెట్ల విక్రయాలను పరిశీలిస్తే ఏ మెడికల్‌ ఆఫీసర్‌కైనా ఈ విషయం సులువుగానే అవగతమవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే జిల్లాలోని రెండు లక్షల డెబ్బై వేల ఇళ్లలో కనీసం ఎంతలేదన్నా లక్ష మంది జ్వరపీడితులుంటారన్నది అంచనా. కానీ, వైద్యసిబ్బంది ఇప్పటి వరకు కేవలం 5,042 మందికే మెడికల్‌ కిట్‌లు అందజేశారంటే సర్వే ఎంత నిజాయతీగా సాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. 


మేమే జ్వరంతో బాధపడుతున్నాం...

మరోవైపు ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలన్న నిబంధనతో వైద్య సిబ్బంది జంకుతున్నారు. కనీసం రెండిళ్లలో ఒకరికైనా కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చి ఉండవచ్చని, పలువురు జ్వరంతో బాధపడుతున్నారని వారు వాపోతున్నారు. తమకెక్కడ కరోనా సోకుతుందోనన్న భయంతో సిబ్బంది కనీసం వీధుల్లో తలుపు తట్టకుండానే ఇంటినంబర్‌ రాసుకుని ఏమీ అడక్కుండానే వెళ్లిపోతున్నారు. కాలనీల్లో తమకు అనువుగా ఉన్న చోట కూర్చుని, తమ వద్దకు వచ్చిన వారికి మాత్రమే మందులు ఇచ్చి పంపిస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే చాలామంది వైద్యసిబ్బంది కొవిడ్‌ లక్షణాలతో హోం క్వారంటైన్‌ అయినట్టు తెలుస్తున్నది. ప్రజల ఆరోగ్యం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టలేమని కొందరు సిబ్బంది బాహాటంగానే కామెంట్‌ చేస్తున్నారు. కాగా, శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 181 బృందాలు 2,078 ఇళ్లను సందర్శించి జ్వర సర్వే చేసినట్టు అధికారులు తెలిపారు. 72 మందికి జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి ఉన్నట్టు గుర్తించి మెడికల్‌ కిట్లను అందజేశారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.