ఆస్పత్రిలో కోల్డ్ స్టోరేజీని శుభ్రం చేసేందుకు వెళ్తే కనిపించిన దృశ్యం చూసి సిబ్బంది షాక్.. 15 నెలల తర్వాత బయటపడ్డ కరోనా `శవాలు`

ABN , First Publish Date - 2021-11-30T21:49:36+05:30 IST

ప్రపంచంతో పాటు భారత్‌ను కూడా కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది.

ఆస్పత్రిలో కోల్డ్ స్టోరేజీని శుభ్రం చేసేందుకు వెళ్తే కనిపించిన దృశ్యం చూసి సిబ్బంది షాక్.. 15 నెలల తర్వాత బయటపడ్డ కరోనా `శవాలు`

ప్రపంచంతో పాటు భారత్‌ను కూడా కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఆస్పత్రుల్లో బెడ్‌లు, ఆక్సిజన్లు లేక అల్లాడడం, స్మశానాల ముందు క్యూలు కట్టాల్సి రావడం వంటి ఎన్నో హృదయ విదారక దృశ్యాలను కళ్ల ముందు నిలిపింది. అయినవాళ్లకు అంత్యక్రియలు చేసేందుకు కూడా వీలు లేకుండా చేసింది. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా ప్రభుత్వమే ఖననం చేసింది. అయితే, బెంగళూరులోని ఓ హాస్పిటల్‌లో ఖననం చేయకుండా ఉండిపోయిన రెండు కరోనా శవాలు తాజాగా బయటపడ్డాయి. 


బెంగళూరులోని ఈఎస్‌ఐ ఆస్పత్రి మార్చురీలో దాదాపు 15 నెలల నుంచి రెండు శవాలు మగ్గుతున్నాయి. ఆస్పత్రిలో కోల్డ్ స్టోరేజీని శుభ్రం చేసేందుకు వెళ్లిన వారికి తాజాగా ఆ రెండు మృతదేహాలు కనిపించాయి. గతేడాది జూన్‌లో 40 ఏళ్ల మహిళకు, 50 ఏళ్ల పురుషుడికి కరోనా సోకింది. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ వారిద్దరూ మరణించారు. వారి గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది ఆ మృతదేహాలను మార్చురీకి తరలించారు. కరోనా శవాలను ఖననం చేసిన సిబ్బంది ఈ మృతదేహాల గురించి మర్చిపోయారు. 


దాంతో అవి అస్పత్రి కోల్డ్ స్టోరేజీలోనే ఉండిపోయాయి. తాజాగా కోల్డ్ స్టోరేజ్‌ను శుభ్రం చేయడానికి వెళ్లిన పని వారికి కనిపించాయి. కుళ్లిన దశలో ఉన్న ఆ మృతదేహాలను చూసి షాకైన సిబ్బంది యాజమాన్యానికి ఈ విషయం తెలియజేశారు. ఈ ఘటనపై బీజేపీ రాజాజీ నగర్ ఎమ్మెల్యే సురేష్ విచారం వ్యక్తం చేశారు. ఈఎస్‌ఐ సిబ్బంది అత్యంత బాధ్యతారాహిత్యంగా, అమానవీయంగా వ్యవహరించారని విమర్శించారు.   

Updated Date - 2021-11-30T21:49:36+05:30 IST