జోగుళాంబా మన్నించు

ABN , First Publish Date - 2021-10-07T04:49:29+05:30 IST

ఐదో శక్తి పీఠం అలంపూర్‌ జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో సిబ్బంది మధ్య అవినీతి ఆరోపణలతో అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రచారం విస్మరించారు.

జోగుళాంబా మన్నించు
జోగుళాంబ ఆలయం

ఐదోశక్తి పీఠం పాలక మండలిలో ముదిరిన వర్గ పోరు

నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రచారాన్ని మరిచిన సభ్యులు

పరస్పర ఆరోపణలకే పరిమితం

నేటి నుంచి 15 వరకు అమ్మవారి ఉత్సవాలు


 ఐదో శక్తి పీఠం అలంపూర్‌ జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో సిబ్బంది మధ్య అవినీతి ఆరోపణలతో అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రచారం విస్మరించారు. ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన పాలక మండలి, పరిపాలన సిబ్బంది, ఆలయ అర్చకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరికి వారు చేయాల్సిన పనులు చేయకపోగా, మీరు తప్పు చేస్తున్నారని ఒకరంటే, మీరు అవినీతికి పాల్పడుతున్నారని మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఫలితంగా ఆలయ అభివృద్ధి పడకేసింది.

- అలంపూర్‌ 


దసరా పండుగను పురస్కరించుకొని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారి వార్షికోత్సవాలను ఏటా ఘనంగా నిర్వహించటం ఆనవాయితీ. అయితే ప్రచార లోపంతో ఉత్సవాలు అలంపూర్‌కే పరిమితమయ్యే పరిస్థితులు దాపురించాయి. పాలక మండలి ఏర్పాటైనప్పటి నుంచి నేటి దాకా చైర్మన్‌తో పాటు కేవలం ఇద్దరు ధర్మకర్తలు మాత్రమే అంతా తామై నడిపిస్తుండటంతో మిగిలిన ధర్మకర్తలు మూడు వర్గాలుగా విడిపోయారు.  పాలక మండలి సభ్యుల్లో ఒకరైన నరసింహారెడ్డి గత ఏడాది అలంపూర్‌ చౌరస్తాలో స్కై బెలూన్‌ను ఎగిరవేసి గట్టి ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం ఆ సభ్యుడు కూడా దూరంగా ఉండటంతో వర్గపోరుకు అద్దం పడుతోంది. రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠమైన జోగుళాంబ అమ్మవారి ఉత్సవాల ప్రచారాన్ని రాష్ట్రంలోని 33 జిల్లాల్లో విస్తృతంగా చేయాల్సి ఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లాలోని 12 మండలాల్లో కూడా చేయలేక పోయారు. దీంతో అటు అధికారులు ఇటు పాలక మండలి వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏటా జాతీయ రహదారి పొడవునా పెద్ద హోర్డింగ్స్‌ ఏర్పాటు చేసేవారు. ఈ సారి ఎలాంటి ఏర్పాట్లూ చేయక పోవటంతో ప్రజలు, భక్తులు మండిపడుతున్నారు. కేవలం ఎమ్మెల్యే, ఎంపీలు మంత్రులను కలుస్తూ ఆలయ ప్రచారాన్ని వ్యక్తిగత ప్రచారంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పాలక మండలి, అర్చక ఉద్యోగ సిబ్బంది వారం రోజులుగా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు ప్రచారాన్ని పట్టించుకోవడం లేదని, వారితో పాటు అధికారులపైనా బదిలీ వేటు వేస్తే తప్ప అమ్మవారి ఆలయ ప్రక్షాళన జరగదని భక్తులు, ప్రజలు భావిస్తున్నారు.


అవినీతికి అడ్డుకట్ట పడేనా?

జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో జరుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. పాలక మండలి సభ్యులు వివిధ రూపాల్లో బిల్లులు చూపించి ఆలయ ఖజనాకు గండికొడుతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుత పాలక మండలి సభ్యుడొకరు ఇటీవల ఎలాంటి టెండర్లు లేకండా అన్నదాన సత్రానికి సరుకులు పంపిణీ చేశారు. తక్కువ ధరలను ఎక్కువ చూయించి, దాదాపు రూ.3 లక్షలు కాజేసినట్లు వెలుగు చూసింది. మరొక సభ్యుడు అన్నదాన సత్రంలో భోజనంతో పాటు ఖాజు ఉండాలని హకుం జారీ చేయటం వారి పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. భక్తులు వివిధ రూపాల్లో సమర్పించిన కానుకలను పరిపాలన సిబ్బంది కాజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొంతకాలం కిందట ఓ భక్తుడు అమ్మవారికి కానుకగా బంగారు నగను అందించగా, అది ఖజానాకు ఇంకా చేరలేదని సమాచారం. మూడు రోజుల అనంతరం విషయం బయటపడటంతో ఆ గొలుసును తిరిగి ఖజానాకు అప్పగించడం గమనార్హం. ఇంకా కనిపించని అవినీతి అఽధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయానికి వచ్చే అధికారులు, రాజకీయ నాయకులు, ధనవంతులైన భక్తులను పరిచయం చేసుకొని వారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వారికి తమ వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌లు ఇచ్చి, ఎటువంటి పూజలు చేయాలన్నా చేస్తామని, రుసుం చెల్లిస్తే చాలని చెబుతున్నారని సమాచారం.


బ్రహ్మోత్సవాల వివరాలు..

నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 7 గురువారం నుంచి ప్రారంభమై 15వ తేదీ విజయ దశమి వరకు కొనసాగుతాయి. 7న ఉదయం 8.30 గంటలకు స్వామివారి ఆనతి స్వీకరణ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యహవచనం, రుత్విక్‌ వరణం,  మహాకలశ స్థాపన, అగ్నిముఖం, సాయంత్రం 6 గంటలకు అంకురారోపణ పూజలు నిర్వహిస్తారు. అమ్మవారు ప్రతి రోజు సాయంత్రం వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజు 7న శైలపుత్రీదేవిగా దర్శనమిస్తారు. 8న బ్రహ్మచారిణిదేవిగా, 9న చంద్రఘంటాదేవిగా, 10న కూష్మాండదేవిగా, 11న స్కందమాతదేవిగా, 11న కాత్యాయనీ దేవిగా, 12న కాళరాత్రి దేవిగా, 13న మహాగౌరిదేవిగా, 14న సిద్దిధాత్రిదేవిగా దర్శనమిస్తారు. 15న విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఉదయం 8 గంటల నుంచి మహాపూర్ణహుతి, సాయంత్రం 4 గంటల నుంచి శమీ పూజ, 6.30 గంటలకు నదీ హారతి, 7 గంటలకు తెప్పోత్సవం, ధ్వజారోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.


ఏర్పాట్లు పూర్తి

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు రానున్నారని, వారి సౌకర్యార్థం అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్‌ రవిప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు. నవబ్రహ్మ ఆలయాలు, జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించామని చెప్పారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా 30 కేవీ జనరేటర్‌ను ఏర్పాటు చేశామని ఈవో మట్టం వీరేశం తెలిపారు. ఆలయాల్లో ఆచార వ్యవహారాలు ఎవరైనా పాటించాల్సిందేనని, నవరాత్రులలో వచ్చే భక్తులకు అర్చకులు 24 గంటలు పూజలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్‌ శర్మ చెప్పారు.

Updated Date - 2021-10-07T04:49:29+05:30 IST