మహమ్మారిని మరిచి..

ABN , First Publish Date - 2021-05-06T04:42:06+05:30 IST

జాతరను తలపించేలా బుధవారం ఉదయం జిల్లాలో మార్కెట్‌లు, వ్యాపార సముదాయాలు జనంతో కిక్కిరిసిపోయాయి. బస్సులు, ఆటోల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ విధించడంతో ఉదయమంతా రద్దీ నెలకొంది

మహమ్మారిని మరిచి..
కర్ఫ్యూముందు మూడు లాంతర్ల నుంచి కోటకు వచ్చే రోడ్డులో జనం, వాహనాల కిటకిట

3 గంటల పాటు కిటకిటలాడిన మార్కెట్‌

విజయనగరం (ఆంధ్రజ్యోతి) మే 5 : జాతరను తలపించేలా బుధవారం ఉదయం జిల్లాలో మార్కెట్‌లు, వ్యాపార సముదాయాలు జనంతో కిక్కిరిసిపోయాయి. బస్సులు, ఆటోల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.  కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి  కర్ఫ్యూ విధించడంతో ఉదయమంతా రద్దీ నెలకొంది. ప్రజలంతా తమకు కావాల్సిన వస్తువులు, సరుకులు కొనుక్కునేందుకు అధిక సంఖ్యలో మార్కెట్‌కు చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే బారులుతీరారు.  ఎక్కడ చూసినాజనం తండోపతండాలుగా దుకాణాల వద్ద కనిపించారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ మార్కెట్‌, ఉల్లివీధి, చిన్న, పెద్దమార్కెట్‌, పీడబ్ల్యూ మార్కెట్‌, ఎంజీరోడ్డు, గంటస్తంభం రోడ్డు తదితర ముఖ్యకూడళ్లలో ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ నెలలో పెళ్లిళ్లు ఉండడంతో అందుకు అవసరమైన సరంజామా కోసం చాలా మంది బంగారం, వస్త్ర దుకాణాలకు రావడం కనిపించింది. 12గంటల తరువాత వాహనాలు తిరగవని భావించి బస్సులు, ఆటోల్లో జనం కిక్కిరిసి తిరుగుముఖం పట్టారు. మద్యం, మాంసం దుకాణాల వద్ద ఇదే పరిస్థితి ప్రస్ఫుటమైంది. పోలీసులు, వైద్యశాఖ అధికారులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నా ప్రజలు పట్టించుకోకపోవటం ఆందోళన కలిగిస్తోంది. 


Updated Date - 2021-05-06T04:42:06+05:30 IST