నెల్లూరు కోర్టులో.. మంత్రి కాకాణి ‘ఫోర్జరీ’ ఫైల్స్‌ చోరీ..!

ABN , First Publish Date - 2022-04-15T08:13:47+05:30 IST

నెల్లూరు నాలుగో ఏడీఎం కోర్టులో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని కీలక రికార్డులను.. సీజ్‌ చేసిన నాలుగు మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను ఎత్తుకెళ్లిపోయారు. వాటిలో కొన్ని డాక్యుమెంట్లను కోర్టు..

నెల్లూరు కోర్టులో.. మంత్రి కాకాణి ‘ఫోర్జరీ’ ఫైల్స్‌ చోరీ..!

ఆయనవి నకిలీ పత్రాలని గతంలో ధ్రువీకరించిన పోలీసులు

సోమిరెడ్డి పెట్టిన కేసులో చార్జిషీటు కూడా దాఖలు

తాజా చోరీలో కీలక డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్‌, 4 మొబైల్‌ ఫోన్లు మాయం

కొన్నిటిని ప్రాంగణంలోనే పడేసిన దొంగలు


నెల్లూరు, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు నాలుగో ఏడీఎం కోర్టులో బుధవారం రాత్రి చోరీ జరిగింది.  గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని కీలక రికార్డులను.. సీజ్‌ చేసిన నాలుగు మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను ఎత్తుకెళ్లిపోయారు. వాటిలో కొన్ని డాక్యుమెంట్లను కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. అవి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గతంలో పెట్టిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలుగా గుర్తించారు. దీంతో ఈ దొంగతనం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి సోమిరెడ్డికి విదేశాల్లో రూ.వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి 2017 డిసెంబరులో ఆరోపించారు. ఆ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లంటూ కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చేశారు. అయితే కాకాణి నకిలీ పత్రాలు సృష్టించి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్‌ స్టేషన్‌లో సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు.


దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు.. కాకాణి విడుదల చేసినవి నకిలీ పత్రాలుగా ధ్రువీకరించి చార్జిషీటు దాఖలుచేశారు. ఆయన్ను ఏ-1 నిందితుడిగా పేర్కొన్నారు. నకిలీ పత్రాలు సృష్టించిన పసుపులేటి చిరంజీవి అలియాస్‌ మణిమోహన్‌ (ఏ-2), మరో ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఇది నెల్లూరు నాలుగో ఏడీఎం కోర్టులో విచారణ దశలో ఉంది. బుధవారం రాత్రి ఈ కోర్టులో దొంగలు పడ్డారు. కొన్ని డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్‌, సాక్ష్యాధారాలుగా సీజ్‌ చేసి భద్రపరచి ఉన్న నాలుగు మొబైల్‌ ఫోన్లను దోచుకెళ్లారు. చోరీ జరిగిన విషయాన్ని కోర్టు సిబ్బంది గురువారం జిల్లా న్యాయమూర్తి యామినికి తెలియజేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. ప్రాంగణంలో చిందరవందరగా పడేసి ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కాకాణిపై సోమిరెడ్డి పెట్టిన కేసుకు సంబంధించిన కొన్ని పత్రాలు, ఏ-2 నిందితుడి నకిలీ పాస్‌పోర్టు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి నెల్లూరు వన్‌ టౌన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-04-15T08:13:47+05:30 IST