చింతగుప్పలో పోడుదాడి

ABN , First Publish Date - 2021-04-13T05:38:35+05:30 IST

వివాదాస్పద పోడు భూము లను స్వాధీనం చేసుకొని హరితహారం కోసం సిద్ధం చేసు ్తన్న అటవీ సిబ్బందిపై సోమవారం దుమ్ముగూడెం అటవీ రేంజ్‌ పరిధి డికొత్తూరు బీటు చింతగుప్ప వద్ద స్థానిక ఆదివాసీ మహిళలు దాడి చేశారు. అటవీ సిబ్బందిలో ఒకరిని తాడుతో చెట్టుకు కట్టేసి మరీ కర్రలతో కొట్టారు.

చింతగుప్పలో పోడుదాడి
రాజేష్‌ను చెట్టుకు బంధించి కొడుతున్న మహిళలు

అటవీ సిబ్బందిని కొట్టిన ఆదివాసీ మహిళలు 

 ఓ ఉద్యోగిని చెట్టుకు కట్టేసి కొట్టిన వైనం

 దుమ్ముగూడెం రేంజ్‌లో ఘటన 

దుమ్ముగూడెం, ఏప్రిల్‌ 12: వివాదాస్పద పోడు భూము లను స్వాధీనం చేసుకొని హరితహారం కోసం సిద్ధం చేసు ్తన్న అటవీ సిబ్బందిపై సోమవారం దుమ్ముగూడెం అటవీ రేంజ్‌ పరిధి డికొత్తూరు బీటు చింతగుప్ప వద్ద స్థానిక ఆదివాసీ మహిళలు దాడి చేశారు. అటవీ సిబ్బందిలో ఒకరిని తాడుతో చెట్టుకు కట్టేసి మరీ కర్రలతో కొట్టారు. మరో ఇద్దరిపై కూడా కర్రలతోదాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు అటవీ సిబ్బందితోపాటు, ఒక ట్రాక్టరు డ్రైవర్‌, ఒక ప్రైవేట్‌ సహాయకుడు గాయాలపాలయ్యారు. వీరిలో ఒక మహిళా సిబ్బంది సైతం ఉన్నారు. తమ భూములు దక్కనివ్వట్లేదన్న ఆగ్రహంతోనే మహిళలు ఈదాడి చేసినట్టు తెలుస్తోంది. 

అసలు అక్కడేం జరిగింది 

చింతగుప్ప వద్ద 27 హెక్టార్ల వివాదాస్పద పోడు భూ ములను హరితహారం కోసం నెలన్నర రోజులుగా చదును చేస్తున్నారు. డీఎఫ్‌వో రంజిత్‌నాయక్‌ సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించాల్సి ఉండగా డీఎఫ్‌వో వాహనం అక్కడకు చేరుకునేందుకు వీలుగా డోజర్‌ ట్రాక్టర్‌తో రహదారిని చదును చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న ఆదివాసీ మహిళలు ట్రాక్టర్‌ డ్రైవర్‌ కణితి కోటేశ్వరావుతోపాటు, మరో ప్రైవేటు సహాయకుడు రమేష్‌ పై దాడి చేశారు. విషయం తెలుసుకున్న డికొత్తూరు ఎఫ్‌ బీవో రాజేష్‌, సుజ్ఞానపురం ఎఫ్‌బీవో విజయ మరో ఎఫ్‌బీవో హుస్సేన్‌తో కలిసి అక్కడకు వెళ్లి వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుండగా ఆ ముగ్గురు ఎఫ్‌బీవోలపై ఆదివాసీ మహిళలు పచ్చి మోదుగు చెట్టు కర్రలతో దాడి చేశారు. వీరిలో రాజేష్‌ను ఒక చెట్టుకు కట్టేసి మరీ కర్రలతో కొట్టారు. డీఎఫ్‌వో కోసం ఏర్పాటు చేసిన కుర్చీలను సైతం మహిళలు విరగ్గొట్టారు. 20నిముషాల దాడి అనంతరం, అటవీ సిబ్బంది బతిమిలాడుకోవడం, సర్పంచ్‌ కృష్ణ ఆదివాసీలకు నచ్చజెప్పడంతో వారు ఎఫ్‌బీవోరాజేష్‌ను వదిలేశారు. ఈ దాడిలో ఎఫ్‌బీవోలు హుస్సేన్‌, విజయ, రాజేష్‌కు గాయాలవగా.. సీఎఫ్‌వో భీమా, డీఎఫ్‌వో రంజిత్‌నాయక్‌ బాధిత సిబ్బందితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. డీఎఫ్‌వో రంజిత్‌నాయక్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దుమ్ముగూడెం పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అనంతరం అటవీసిబ్బంది పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివాసీ మహిళలు పథకం ప్రకారమే తమపై దాడికి పాల్పడ్డారని బాధిత ఎఫ్‌భీవోలు తెలిపారు. ముందుగానే పచ్చి మోదుగు కర్రలు విరిచి దగ్గర పెట్టుకొని, తాము వెళ్లగానే తమపై దాడి చేశారని, దుర్భాషలాడారన్నారు. సెల్‌ఫోన్లు కూడా లాక్కోవడానికి ప్రయత్నించారని, తాము యూనిఫాంలో ఉన్నా దాడికి వెనుకాడలేదని, ఒకవేళ తాము ఎదురు తిరిగితే మగవాళ్లు కూడా దాడి చేసేందుకు వెనుకాడేవారు కారని, కానీ తాము దెబ్బలకు ఓర్చుకొని సంయమనం పాటించామని ఆవేదన వ్యక్తం చేశారు.  అయితే నెలన్నర రోజులుగా పోడు భూములను చదునుచేస్తుండగా ఎలాంటి ఉద్రిక్తలు జరగలేదు. కానీ సోమవారం జరిగిన ఈ హఠాత్పరిణామం తీవ్ర చర్చనీయాంశమైంది.

విధులను అడ్టుకున్నవారిపై చర్యలు 

భద్రాద్రి అటవీ అధికారి లక్ష్మణ్‌ రంజిత్‌ నాయక్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌: అటవీ అధికారుల విధులకు ఆటంకం కలిగించి, వారిపై మూకుమ్మడి దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని భద్రాద్రి జిల్లా అటవీ అధికారి లక్ష్మణ్‌రంజిత్‌ నాయక్‌ తెలిపారు. దుమ్ముగూడెం మండలంలోని చింతగుప్పలో జరిగిన ఘటన నేపథ్యంలో సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. చింతగుప్ప గ్రామంలో సోమవారం అటవీ అధికారులు హుస్సెన్‌, ఫారెస్టు బీట్‌ అధికారులు రాజేష్‌, విజయ బీట్‌ తనఖీ చేస్తున్న క్రమంలో చింతగుప్పకు చెందినవారు భౌతిక దాడులకు పాల్పడ్డారని, ఇలా సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కొత్తగా పోడు భూముల కోసం ప్రయత్నిస్తున్న వారిపై అటవీ పరిరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.  


Updated Date - 2021-04-13T05:38:35+05:30 IST