ఆంక్షలతో అష్టకష్టాలు...

ABN , First Publish Date - 2022-05-26T03:54:53+05:30 IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కవ్వాల టైగర్‌ జోన్‌ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ అడవిపై ఆధారపడ్డ మేదరులు (మహేం ద్రులు), నాయకపోడ్‌ల జీవనోపాధి పూర్తిగా దెబ్బ తినడంతో అష్టకష్టాలు పడుతున్నారు. టైగర్‌ జోన్‌ ఏర్పడడం వల్ల ఆంక్షలు అధికమయ్యాయి. అటవీ చట్టాలు అమలు పర్చడంతో ఇక్కడి అడవిపై ఆధారపడి ఉన్న చేతి వృత్తిదారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దండేపల్లి, జన్నారం, చెన్నూరు, కోటపల్లి, నెన్నెల, బెల్లంపల్లి, మంచిర్యాల, భీమిని, లక్షెట్టిపేట, దేవాపూర్‌లలో 3,842 మంది అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

ఆంక్షలతో అష్టకష్టాలు...
సైకిళ్ల ద్వారా వెదురుబొంగును తీసుకువస్తున్న చేతివృత్తిదారులు

టైగర్‌ జోన్‌ ఏర్పాటుతో అడవిలోకి నో ఎంట్రీ 

వీధిన పడిన మేదరులు, నాయకపోడ్‌లు 

వెదురు దొరక్క దెబ్బతిన్న జీవనోపాధి 

అమలుకాని ప్రభుత్వ హామీలు 

ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు 

జన్నారం, మే 25 : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కవ్వాల టైగర్‌ జోన్‌ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ అడవిపై ఆధారపడ్డ మేదరులు (మహేం ద్రులు), నాయకపోడ్‌ల జీవనోపాధి పూర్తిగా దెబ్బ తినడంతో అష్టకష్టాలు పడుతున్నారు. టైగర్‌ జోన్‌ ఏర్పడడం వల్ల ఆంక్షలు అధికమయ్యాయి. అటవీ చట్టాలు అమలు పర్చడంతో ఇక్కడి అడవిపై ఆధారపడి ఉన్న చేతి వృత్తిదారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దండేపల్లి, జన్నారం, చెన్నూరు, కోటపల్లి, నెన్నెల, బెల్లంపల్లి, మంచిర్యాల, భీమిని, లక్షెట్టిపేట, దేవాపూర్‌లలో 3,842 మంది అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా దండేపల్లి, జన్నారం, లక్షెట్టిపేట ప్రాంతాల్లోని నాయకపోడ్‌ గిరిజనులు సుమారు 3 వేల మంది అడవిలో లభించే వెదురుబొంగులపై ఆధారపడ్డారు. గతంలో అడవిని నమ్ముకుని అడవి నుంచి తీసుకువచ్చే వెదురు బొంగులతో తడకలు, బుట్టలు, చాటలు అల్లి మార్కెట్‌లో విక్రయించి ఉపాధి పొందేవారు. కానీ కవ్వాల టైగర్‌ జోన్‌ ఏర్పడినప్పటి నుంచి ఆంక్షలు అధికం కావడంతో వీరి జీవనోపాధి ఆగమ్య గోచరంగా మారింది. మంచిర్యాల జిల్లాలో 840 మహేంద్ర (మేదరి) కుటుంబాలు అల్లికపై ఆధారపడి ఉండగా  అడవిలోకి వెళ్లకుండా అధికారులు ఆంక్షలు పెట్టడంతో బయట వెదురు బొంగులు దొరక్క, అడవి నుంచి తెచ్చే వీలు లేకపోవడంతో ఎలా జీవించాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. 

టైగర్‌ జోన్‌ ఏర్పాటుతో అడవిలోకి నో ఎంట్రీ ..

టైగర్‌ జోన్‌ ఏర్పాటు కావడం, అటవీ చట్టాలను అమలు పర్చడంతో  అడవిలోకి వెళ్లకుండా అటవీ అధికారులు ఆంక్షలు పెడుతున్నారు. దీంతో జీవనోపాధి లేక అడవిపై ఆధారపడ్డ చేతి వృత్తిదారులు రోడ్డున పడ్డారు. అటవీ చట్టాల నుంచి  చేతి వృత్తిదారులకు మినహాయింపు ఇవ్వాలని పలుమార్లు రాష్ట్ర నాయకులు అటవీశాఖ అధికారులను  వేడుకున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది. 

ఏది ఉపాధి... 

కవ్వాల టైగర్‌ జోన్‌లోని అటవీ ప్రాంతంలో కోర్‌ ఏరియా (అటవీ ప్రాంతం) ఆధారపడ్డ మహేంద్రులకు, నాయకపోడ్‌ కుటుంబాలకు అటవీశాఖ అడవిలోనే ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటా మని గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అటవీ శాఖ అధికారులు అడవిలో ప్రస్తుతానికి ఉపాధి హామీ పనులు కల్పిస్తున్నామని చేతులు దులుపుకుంటున్నారు.  పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించడం లేదని పలువురు మేదరులు పేర్కొంటున్నారు. 

వీధిన పడిన మేదరులు, నాయకపోడ్‌లు 

టైగర్‌ జోన్‌ ఆంక్షలతో చేతి వృత్తిదారులు నష్టపోతున్నారు. అధిక ధరలకు వెదురుబొంగులు సేకరించి జీవనం వెళ్లదీద్దామన్నా ప్లాస్టిక్‌ రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్లాస్టిక్‌ వస్తువులు అటవీ ఉత్పత్తుల కంటే తక్కువ ధరకు రావడంతో ప్రజలు వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో చేతి వృత్తిదారులు ఉపాధి లేక వీధిన పడ్డారు.   వెదురుబొంగులు అందుబాటులో లభిస్తే తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. 

చేతి వృత్తిదారులను ఆదుకోవాలి...

అటవీ శాఖ ఆధ్వర్యంలో చేతి వృత్తిదారులను ఆదుకోవాలని మహేం ద్ర సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తున్నా ఫలితం లేకుండా పోయింది. అడవిపై ఆధారపడిన చేతి వృత్తిదారులకు సంవత్సరానికి 2 వేల వెదురు బొంగు లను ఉచితంగా ఇచ్చి అటవీ శాఖ తరుపున రుణ సౌకర్యం, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే చేతి వృత్తిదారుల జీవితాలు బాగు పడతాయని అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని దేవాపూర్‌, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, తిర్యాణిలలో వెదురు డిపోలు ఉండేవి. ప్రస్తుతం అవి లేకపోవడంతో చేతి వృత్తి దారుల పరిస్థితి దారుణంగా తయారైంది. వాటితో పాటు జన్నారం మండల కేంద్రంలో వెదురు డిపో ఏర్పాటు చేస్తే చేతి వృత్తిదారులకు పని లభిస్తుంది. ప్రభుత్వం మేదరులను ఆదుకుని జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారు.

అటవీ శాఖ ఆదుకోవాలి 

-సూరినేని కిషన్‌,  జిల్లా మహేంద్రసంఘం అధ్యక్షుడు

అడవిలోని వెదురు బొంగులను గతంలో మాదిరిగా దేవాపూర్‌, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, తిర్యాణిలో ఉన్న విధంగా బాంబు (వెదురు )డిపోలను ఏర్పాటు చేసి వెదురు బొంగులను అందించాలి. దీంతో చేతి వృత్తిదారులకు పూర్వ వైభవం వస్తుంది. 

వెదురుబొంగులు లేక పనులు లేవు

రాజేశ్వరి, జన్నారం 

వెదురు బొంగులు లేక చేతిలో పనులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. గతంలో రూ.10 లోపు ఒక వెదురు బొంగు లభించేది. ఇప్పుడు రూ.40 పెట్టినా లభించడం లేదు. దీంతో వెదురు బొంగులు తీసుకువచ్చి తట్టలు, బుట్టలు అమ్మి  జీవించే తాము ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఉపాఽధి చూపించి ఆదుకోవాలి. 

అడవిలో ఉపాధికి చర్యలు

ఎఫ్‌డీవో మాధవరావు

కవ్వాల టైగర్‌జోన్‌లో అడవిలో వన్య ప్రాణులు సురక్షితంగా భయం లేకుండా జీవించాలంటే అడవిలోకి ఎలాంటి వ్యక్తులు వెళ్లకూడదనే ఆంక్షలు ఉన్నాయి. అడవిలో ఉన్న చిన్న వస్తువును కూడా తీసుకువచ్చుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా అడవిలో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రభుత్వ నిర్ణయాల మేరకు పనిచేస్తున్నాం. అడవి, వన్య ప్రాణుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. 

Updated Date - 2022-05-26T03:54:53+05:30 IST