ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజ్‌ అధికారిణి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-08-13T07:55:54+05:30 IST

తరచూ ఇద్దరి మధ్య మనస్పర్ధలు, గొడవలు.. దీనికి తోడు భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం

ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజ్‌ అధికారిణి ఆత్మహత్య

  • పురుగుల మందు తాగిన వైనం

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 12 : తరచూ ఇద్దరి మధ్య మనస్పర్ధలు, గొడవలు.. దీనికి తోడు భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం.. పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా ఫలితం లేదు... ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజ్‌ అధికారిణి తాను పని చేస్తున్న కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మహ్మదాబాద్‌లో బుధవారం జరిగింది. మహ్మదాబాద్‌ ఫారెస్ట్‌ రేంజ్‌లో వహీదాబేగం (32) డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఈమె భర్త భానుప్రకాశ్‌ మహబూబ్‌నగర్‌ అటవీ శాఖ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌. బుధవారం ఉదయం వహీదాబేగం కార్యాలయానికి వెళ్లారు. కొద్దిసేపటికే పక్కగదిలోకి వెళ్లి పురుగుల మందుతాగి బయటకు వచ్చి అధికారులు, ఉద్యోగుల ముందు కూర్చున్నారు. కడుపులో నొప్పి మొదలవడంతో తాను విషం తాగిన విషయాన్ని వారికి చెప్పి కింద పడిపోగా, వారు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఆమెకు నాలుగేళ్ళ కూతురు ఆనన్‌ ఉంది. కాగా, ప్రేమ వివాహం చేసుకున్న వహీదాబేగం, భానుప్రకాశ్‌ల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయని, భానుప్రకాశ్‌కు మరో మహిళతో ఉన్న సంబంధమే ఆత్మహత్యకు కారణమని మృతురాలి తల్లి ముబారక్‌ బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లా కేంద్రంలోని ఓ మహిళను పెళ్ళి చేసుకుంటానని చెబుతుండడంతో మనస్థాపానికి గురైన వహీదా ఆత్మహత్య చేసుకున్నట్టు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భానుప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-08-13T07:55:54+05:30 IST