ముందుచూపేది?

ABN , First Publish Date - 2022-05-13T05:06:00+05:30 IST

వర్షాకాలం సమీపిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగానికి ముందుచూపు కొరవడింది. గతేడాది వరదలకు కోతకు గురైన రహదారులు, ధ్వంసమైన కల్వర్టులు, దెబ్బతిన్న కాజ్‌వేల మరమ్మతులు అంతంతమాత్రంగానే జరిగాయి. కొన్నేళ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. దీంతో చిన్నపాటి వరదలకే మళ్లీ రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితులు దాపురించాయి.

ముందుచూపేది?
దూళిమిట్ట మండలం లింగాపూర్‌ కాజ్‌ వే పరిస్థితి ఇది

మరమ్మతులకు నోచుకోని కల్వర్టులు

వాగులపై ప్రమాదకరంగా కాజ్‌వేలు, వంతెనలు 

వరదలతో కోతకు గురైన రోడ్లపై పర్యవేక్షణ కరువు

సమీపిస్తున్న వానాకాలం.. మళ్లీ తప్పని అంతరాయం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 12 : వర్షాకాలం సమీపిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగానికి ముందుచూపు కొరవడింది. గతేడాది వరదలకు కోతకు గురైన రహదారులు, ధ్వంసమైన కల్వర్టులు, దెబ్బతిన్న కాజ్‌వేల మరమ్మతులు అంతంతమాత్రంగానే జరిగాయి. కొన్నేళ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. దీంతో చిన్నపాటి వరదలకే మళ్లీ రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితులు దాపురించాయి. 

జిల్లాలో వాగులపై ఉన్న రహదారులు, కల్వర్టులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. ఇవి తీవ్రరూపం దాల్చితే వరదకు దారి తీస్తుంది. ముఖ్యంగా వాగుల్లో ప్రవాహాలు ఉప్పొంగినపుడు ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆ ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. భారీ వాహనాలను సైతం  నీళ్లు ముంచెత్తుతున్నాయి. ప్రాణ నష్టం సంభవిస్తున్నది. 


బస్వాపూర్‌లో మళ్లీ అంతరాయం

కోహెడ మండలం బస్వాపూర్‌లో లో-లెవల్‌ వంతెనతో ప్రతీ వర్షాకాలంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. వరద ప్రవాహంతో ఈ వంతెన రోజుల తరబడి నీళ్లలో ముంపునకు గురవుతోంది. సిద్దిపేట నుంచి హుస్నాబాద్‌, హన్మకొండకు వెళ్లే ప్రధాన రహదారిపైనే ఈ వంతెన ఉండడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారీ వాహనాలు రోజుల కొద్దీ ఇక్కడ నిలిచిపోతున్నాయి. చిన్న వాహనాలు, బస్సులను దారి మళ్లిస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదు. పైగా వంతెన శిథిలావస్థకు చేరింది. రహదారి కోతకు గురై అధ్వానంగా మారింది. ఈసారి మళ్లీ వరదలు తలెత్తితే ఈ రోడ్డుకు ముప్పు తప్పదని భావిస్తున్నారు. ఇక్కడ హైలెవల్‌ వంతెన నిర్మించాలనే డిమాండ్‌ దశాబ్దాల కాలంగా ఉన్నప్పటికీ పరిష్కారం కావడం లేదు. ఎన్నికల హామీగానే మిగిలిపోతున్నది. ఫలితంగా ఈ వర్షాకాలంలోనూ బస్వాపూర్‌లో వాహనాలకు అంతరాయం తప్పేలా లేదు. 


జిల్లాలోని కల్వర్టులు ఇలా.. 

- దూళిమిట్ట మండలంలోని లింగాపూర్‌, దూళిమిట్ట గ్రామాల్లో చెక్‌డ్యాం కాజ్‌ వేలు గత 4 ఏళ్ల క్రితం కురిసిన వర్షాలకు ధ్వంసమయ్యాయి. నేటికీ మరమ్మతులకు నోచుకోలేదు. లింగాపూర్‌ కాజ్‌ వేకు రూ.కోటి 50లక్షలు మంజూరైనా నిధులు సరిపోకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. 

- చిన్నకోడూరు మండలం అల్లీపూర్‌లోని ఉమ్మెర్ల వాగుపై కల్వర్టు తక్కువ ఎత్తులో ఉండడంతో గత వర్షాకాలంలో నీటి ప్రవాహానికి కల్వర్టు పక్కన రోడ్డు కోతకు గురై రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇంకా మరమ్మతు చేయలేదు. 

- తొగుట మండలం వెంకట్రావుపేట వాగుగడ్డ వద్ద కూడవెళ్లి వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం కల్వర్టుపై నుంచే వరద ప్రవాహం ఉంటుంది. ఆ సమయంలో ఈ రహదారి మునిగి ఉండడం వల్ల మరో ప్రత్యామ్నాయ దారి గుండా రాకపోకలు సాగుతాయి. 

- నారాయణరావుపేట నుంచి బంజేరుపల్లి, లక్ష్మీదేవిపల్లి వెళ్లే దారుల్లో వర్షాకాలంలో వరద ముప్పు పొంచి ఉదిఇ. లక్ష్మీదేవిపల్లి రోడ్డు నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ నుండి నిధులు మంజూరు అయినప్పటికీ అగ్రిమెంట్‌ సమయం ముగిసి పోవడంతో బీటీ రోడ్డు రెన్యూవల్‌ పనులు చేసి ముగించారు. మళ్లీ వర్షాలకు వరదలు వస్తే రాకపోకలు నిలిచిపోవడం తథ్యం. 

- మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలోని వంతెన వద్ద అధిక వర్షాలతో కూడవెల్లి వాగు ఉప్పొంగితే మిరుదొడ్డి నుంచి తొగుట, సిద్దిపేటకు రాకపోకలు నిలిచిపోతుంటాయి. అంతేకాకుండా కల్వర్టులన్నీ శిథిలావస్థకు చేరాయి. 




Read more