రష్యా, ఇరాన్‌ నేతలతో జైశంకర్ చర్చలు

ABN , First Publish Date - 2021-09-17T20:45:07+05:30 IST

షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సు

రష్యా, ఇరాన్‌ నేతలతో జైశంకర్ చర్చలు

దుషాంబే : షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సు నేపథ్యంలో రష్యా, ఇరాన్‌లతో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ శుక్రవారం చర్చలు జరిపారు. రష్యా మంత్రి సెర్గీ లవ్‌రోవ్‌తో ఆఫ్ఘనిస్థాన్ సహా సమకాలిక అంశాలపై చర్చించారు. ఇరాన్ ప్రెసిడెంట్ ఎబ్రహీం రైసీతో అంతర్జాతీయ వ్యవహారాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. వీరిద్దరితోనూ జైశంకర్ వేర్వేరుగా చర్చలు జరిపారు. 


ఎస్‌సీఓ సదస్సు తజకిస్థాన్ రాజధాని నగరం దుషాంబేలో జరుగుతోంది. ఈ సమావేశానికి ముందు తాను రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్‌తో చర్చలు జరిపానని జైశంకర్ శుక్రవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో తెలిపారు. సెర్గీని కలవడం ఎప్పుడూ బాగుంటుందని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ సహా సమకాలిక సమస్యలపై ప్రయోజనకరమైన చర్చ జరిగిందన్నారు. వీరిద్దరూ జూలైలో కూడా మాస్కోలో సమావేశమైన సంగతి తెలిసిందే. 


ఇరాన్ ప్రెసిడెంట్ రైసీతో గౌరవపూర్వకంగా మాట్లాడినట్లు జైశంకర్ మరో ట్వీట్‌లో తెలిపారు. ఇరువురం అభిప్రాయాలను పంచుకున్నామని తెలిపారు. రైసీ, జైశంకర్ జూలై, ఆగస్టు నెలల్లో సమావేశమైన సంగతి తెలిసిందే. రైసీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత దేశ ప్రతినిధిగా జైశంకర్ హాజరయ్యారు. 


ఎస్‌సీఓను 2001లో ఏర్పాటు చేశారు. రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్థాన్, తజకిస్థాన్, ఉబ్జెకిస్థాన్ దేశాల అధ్యక్షులు దీనిని ఏర్పాటు చేశారు. 2017లో భారత్, పాకిస్థాన్ శాశ్వత సభ్య దేశాలుగా దీనిలో చేరాయి. 


Updated Date - 2021-09-17T20:45:07+05:30 IST