రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

ABN , First Publish Date - 2022-05-21T08:35:14+05:30 IST

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) కొత్త రికార్డు నమోదైంది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత్‌ వివిధ రూపాల్లో రికార్డు స్థాయిలో 8,357 కోట్ల డాలర్ల (సుమారు రూ.6.48 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐని ఆకర్షించింది.

రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

2021-22లో రూ.6.48 లక్షల కోట్లు 

న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) కొత్త రికార్డు నమోదైంది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత్‌ వివిధ రూపాల్లో రికార్డు స్థాయిలో 8,357 కోట్ల డాలర్ల (సుమారు రూ.6.48 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐని ఆకర్షించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రెండు శాతం (160  కోట్ల డాలర్లు) ఎక్కువ. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఈ వివరాలు విడుదల చేసింది. కొవిడ్‌, ఉక్రెయిన్‌ సమస్యల నేపథ్యంలోనూ మన దేశానికి ఎఫ్‌డీఐ పోటెత్తడం విశేషం. ఎఫ్‌డీఐ ఆకర్షణలో తయారీ రంగం ముందుంది. 2020-21తో పోలిస్తే 2021-22లో తయారీ రంగం 76 శాతం అధిక ఎఫ్‌డీఐని ఆకర్షించింది. 


సింగపూర్‌ నుంచే ఎక్కువ 

గత ఆర్థిక  సంవత్సరం మన దేశానికి వచ్చిన ఎఫ్‌డీఐలో 27 శాతం సింగపూర్‌ నుంచి, 18 శాతం అమెరికా నుంచి  16 శాతం మారిషస్‌ నుంచి వచ్చింది. భారత్‌ కంటే చిన్న దేశాలైన సింగపూర్‌, మారిష్‌సల నుంచి పెద్ద మొత్తంలో ఎఫ్‌డీఐ రావడం విశేషం. ఇక ఎఫ్‌డీఐ పెట్టుబడుల ఆకర్షణలో కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ మిగతా రాష్ట్రాలతో ముందున్నాయి. విధానపరమైన మార్పులతో పాటు వ్యాపార సౌలభ్యం ఇందుకు దోహదం చేశాయి. 

Updated Date - 2022-05-21T08:35:14+05:30 IST