అప్పులపాలైన ముంపు బాధితుడి బలవన్మరణం

ABN , First Publish Date - 2021-01-16T05:47:26+05:30 IST

ప్రాజెక్టు నిర్మాణంలో ఇల్లు, భూమి ముంపునకు గురై పూర్తి పరిహారం అందకపోగా, కొత్త ఇంటి కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ యువకుడు పురుగులమందు తాగి బలవన్మరణం చెందాడు.

అప్పులపాలైన ముంపు బాధితుడి బలవన్మరణం

అక్కన్నపేట, జనవరి 15: ప్రాజెక్టు నిర్మాణంలో ఇల్లు, భూమి ముంపునకు గురై పూర్తి పరిహారం అందకపోగా, కొత్త ఇంటి కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ యువకుడు పురుగులమందు తాగి బలవన్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని గూడాటిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తెనుగుపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... తెనుగుపల్లి గ్రామానికి చెందిన  కాగితాల శివకృష్ణ(27)కు ఇల్లు, రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ఇంటితో పాటు భూమి ముంపునకు గురవుతున్నది. వచ్చిన పరిహారం డబ్బులకు తోడు మరో రూ.8 లక్షలు అప్పులు చేసి హుస్నాబాద్‌లో స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేపట్టాడు. కాగా మరో అర ఎకరానికి పరిహారం డబ్బులు రావాల్సి ఉంది. దీంతో ఓవైపు పరిహారం డబ్బులు రాక, మరోవైపు చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురై బుధవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని పైవ్రేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య నందిని, కూతురు, కుమారుడు ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి తెలిపారు. 

Updated Date - 2021-01-16T05:47:26+05:30 IST