ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో 166 మంది భారతీయులు.. 12 మంది తెలుగువారికి చోటు

ABN , First Publish Date - 2022-04-06T13:19:40+05:30 IST

భారత కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు.

ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో 166 మంది భారతీయులు.. 12 మంది తెలుగువారికి చోటు

ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో 12 మంది తెలుగువారికి స్థానం దక్కింది. అందులో ఫార్మా రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలే అధికం కావడం గమనార్హం. 

న్యూఢిల్లీ: భారత కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ‘ఫోర్బ్స్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌-2022’లో ఆయన 9,070 కోట్ల డాలర్ల (రూ.6.80 లక్షల కోట్లు) వ్యక్తిగత సంపదతో నం.1గా నిలిచారు. అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ 9,000 కోట్ల డాలర్ల (రూ.6.75 లక్షల కోట్లు) ఆస్తితో ద్వితీయ స్థానంలో ఉన్నారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో అంబానీ 10, అదానీ 11వ స్థానాల్లో ఉన్నారు. మార్చి 11 నాటి ఆస్తి వివరాల ఆధారంగా ఫోర్బ్స్‌ ఈ జాబితాను విడుదల చేసింది. అయితే, రోజువారీగా ధనవంతుల సంపదలో హెచ్చుతగ్గులను సూచించే ఫోర్బ్స్‌ రియల్‌ టైం బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. అదానీయే భారత అగ్రకుబేరుడు. ప్రస్తుతం ఆయన ఆస్తి 11,130 కోట్ల డాలర్లు. అంటే, మన కరెన్సీలో సుమారు రూ.8.35 లక్షల కోట్లు. ముకేశ్‌ అంబానీ 10,050 కోట్ల డాలర్ల (రూ.7.54 లక్షల కోట్లు) నెట్‌వర్త్‌తో రెండో స్థానానికి జారుకున్నారు. అంతేకాదు, రియల్‌ టైం ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ అదానీ 9వ స్థానానికి ఎగబాకగా.. అంబానీ 10వ స్థానానికి పరిమితమయ్యారు. మరిన్ని వివరాలు.. 


టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ 21,900 కోట్ల డాలర్ల (రూ.16.43 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. అమెజాన్‌ వ్యవస్థాపకులు జెఫ్‌ బెజోస్‌ (17,100 కోట్ల డాలర్లు), ఎల్‌వీఎంహెచ్‌కు చెందిన బెర్నార్డ్‌ అర్నో కుటుం బం (15,800 కోట్ల డాలర్లు), మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ (12,900 కోట్ల డాలర్లు), బెర్క్‌షైర్‌ హాత్‌వే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ (11,800 కోట్ల డాలర్లు) టాప్‌-5 స్థానాలను దక్కించుకున్నారు. టాప్‌టెన్‌లో చోటు లభించిన ఏకైక భారతీయుడు ముకేశ్‌ అంబానీ. 


ఫోర్బ్స్‌ 36వ వార్షిక ప్రపంచ కుబేరుల జాబితాలో మొత్తం 2,668 మందికి చోటు లభించగా.. వారి మొత్తం సంపద 12.7 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. 2021 జాబితాతో పోలిస్తే మాత్రం ధనవంతుల సంఖ్య 87, సంపద 40,000 కోట్ల డాలర్లు తగ్గింది. అయినప్పటికీ, ఈ ఏడాది 1,000 మందికి పైగా బిలియనీర్ల ఆస్తి వృద్ధిని నమోదు చేసుకోగలిగింది. అంతేకాదు, ఈసారి కొత్తగా 236 మందికి జాబితాలో చోటు దక్కింది. 


ఈ సారీ లిస్ట్‌లో అమెరికన్లదే హవా. ఆ దేశం నుంచి అత్యధికంగా 735 మందికి స్థానం లభించింది. వారి మొత్తం సంపద రూ.4.7 లక్షల కోట్ల డాలర్లు. 607 మంది బిలియనీర్లతో చైనా రెండో స్థానంలో ఉంది. వారి మొత్తం ఆస్తి 2.3 లక్షల కోట్ల డాలర్లు. ఇక భారత్‌ నుంచి 166 మందికి చోటు దక్కింది.




Updated Date - 2022-04-06T13:19:40+05:30 IST