ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ABN , First Publish Date - 2022-06-19T05:19:45+05:30 IST

రేషన్‌ కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

  • రేషన్‌ కార్డుల్లో అదనపు సభ్యుల పేర్లు నమోదుకు అవకాశం 
  •  మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచన

వికారాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రేషన్‌ కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. రేషన్‌ కార్డుల్లో నమోదైన కుటుంబాల్లో కొత్త సభ్యులను చేర్చడానికి అనుమతించాలని రేషన్‌కార్డుదారులు చాలా కాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.  ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం రేషన్‌ కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్ల నమోదుకు అనుమతించింది. రేషన్‌ కార్డు ఉండి కుటుంబ సభ్యుల పేర్లు ఆకార్డులో లేకపోయినా నమోదు చేసుకోవచ్చు. కొత్తగా వివాహమై కోడళ్లుగా వచ్చిన యువతులు, జన్మించిన చిన్నారుల పేర్లు రేషన్‌ కార్డులో నమోదు చేసుకునేందుకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. పాత లేదా కొత్త రేషన్‌ కార్డు నంబర్‌, రేషన్‌ కార్డులో నమోదు చేసుకునే వారి ఆధార్‌ కార్డు, గ్యాస్‌ కనెక్షన్‌ పుస్తకం వివరాలను తమ దరఖాస్తులో నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో కొత్త కార్డుల కోసం 7,424 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 6,693 మందికి గత ఏడాది కొత్తగా ఆహార భద్రతా కార్డులు జారీ చేశారు. కుటుంబాల్లో కొత్తగా చేరిన సభ్యుల పేర్లు రేషన్‌ కార్డుల్లో లేకపోవడంతో నెలనెలా వచ్చే బియ్యానికి వారు నోచుకోవడం లేదు. మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు బియ్యానికి నోచుకోలేదు. ఆ ప్రక్రియ నిలిపివేయడంతో కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా వారికి బియ్యం అందలేదు.  దీంతో రేషన్‌ కార్డు ఉన్న వారు  అందులో కొత్తగా సభ్యుల నమోదుకు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్‌ తెలిపారు. 

Updated Date - 2022-06-19T05:19:45+05:30 IST