Abn logo
Sep 22 2021 @ 23:16PM

మహిళలకు అండగా..

మంచిర్యాలలో మహిళలకు షీటీం క్యూఆర్‌కోడ్‌పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

- అందుబాటులో క్యూఆర్‌ కోడ్‌

- ఎక్కడి నుంచైనా బాధితులు షీటీంకు ఫిర్యాదు చేసుకునే అవకాశం 

-  మంచిర్యాల జిల్లాలో అవగాహన కల్పిస్తున్న పోలీసులు

 బెల్లంపల్లి, సెప్టెంబరు 22: మహిళలకు భద్రతకు జిల్లా పోలీసు యంత్రాంగం షీటీం ద్వారా అండగా నిలుస్తోంది. వారికి మరింత రక్షణ కల్పించేందుకు స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు షీటీం క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నాలుగు నెలలుగా  జిల్లాలో క్యూఆర్‌ కోడ్‌ను  మహిళల భద్రత కోసం జిల్లా పోలీసులు అందుబాటులోకి తీసుకు వచ్చారు.  క్యూఆర్‌ కోడ్‌ పోస్టర్లను ప్రధాన చౌరస్తాల్లో, కళాశాలల వద్ద, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ల వద్ద అంటించారు. బాధిత మహిళలు తమ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ ఉపయోగించి జిల్లా వ్యాప్తంగా 26  మంది ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి పరిష్కార చర్యలు చేపడుతున్నారు. 

-మరింత భద్రత కోసం....

చిన్నారులు, యువతులు, మహిళలపై అత్యాచారాలు, వేధింపులు జిల్లాలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి అనుభవనాలు ఎదరైనా చాలా మంది బాధితులు పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లడం లేదు. వేధించే ఘటనలతో మానసికంగా కృంగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు పూర్తిస్ధాయి రక్షణ నినాదంతో షీటీం బృందాలు జిల్లాలో  6 ఏళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చాయి ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేసేందుకు షీటీం క్యూఆర్‌ కోడ్‌ను జిల్లా పోలీసులు అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి సబ్‌ డివిజన్‌ల పరిధిలో షీటీం బృందాలు పనిచేస్తున్నాయి. జిల్లాలో అందుబాటులోకి వచ్చిన షీటీం క్యూఆర్‌ కోడ్‌ అతివలకు మనోధైర్యం నింపనుంది. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు పడే బాధితులు తమ స్మార్ట్‌ఫోన్‌ నుంచి ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. మహిళలకు ఏ ఆపద వచ్చినా ఒక్కసారి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి నేరుగా సమస్యను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లవచ్చు. 

ప్రధాన కూడళ్లలో..

జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు మండలాల్లో , చౌరస్తాల్లో, బస్‌, రైల్వేస్టేషన్‌లలో, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, కూరగాయల మార్కెట్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో షీటీం క్యూఆర్‌ కోడ్‌  పోస్టర్లను జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు. విద్యార్థినులకు , యువతులకు , మహిళలకు క్యూఆర్‌ కోడ్‌ పోస్టర్లను అందుబాటులో ఉంచుతున్నారు. క్యూఆర్‌ కోడ్‌ అందుబాటులోకి వచ్చాక జిల్లా వ్యాప్తంగా పలువురు బాధిత మహిళలు తమ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన 26 ఫిర్యాదులను పోలీసులు స్వీకరించి పరిష్కార చర్యలు సైతం చేపట్టారు. ఫిర్యాదులపై సంబంధిత పరిధిలోని పోలీసులు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా అందే ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, సమస్యల పరిష్కారానికి పట్టిన సమయం..,అధికారుల ప్రవర్తన, తదితర విషయాలు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా బాధితులు సైతం పోలీసులు ఏ విధంగా స్పందించారనే ఫీడ్‌ బ్యాక్‌ను సైతం తెలుపవచ్చు. 

-క్యూఆర్‌ కోడ్‌తో ఫిర్యాదు ఇలా...

పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నేరుగా తమ సమస్య చెప్పుకోలేని బాధిత మహిళలకు షీటీం క్యూఆర్‌ కోడ్‌ ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. బాధిత మహిళలు తప్పనిసరిగా తమ స్మార్ట్‌ఫోన్‌లో క్యూఆర్‌ కోడ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.  క్యూఆర్‌ కోడ్‌ను స్కానింగ్‌ చేయగానే హెచ్‌టీటీపీఎస్‌ క్యూఆర్‌ టీఎస్‌పోలీస్‌.జీవోవి.ఇన్‌ అనే లింకు వస్తుంది. ఆ లింకును క్లిక్‌ చేయగానే ఫిర్యాదు ఫోరం ఓపెన్‌ అవుతుంది. గోప్యంగా ఉండబడే ఈ ఫోరంలో  బాధితురాలు పేరు, వారు ఉన్న లొకేషన్‌ మొదలైన అంశాలను చేర్చి సబ్మిట్‌ చేయాలి. ఇలా చేసిన వెంటనే ఇబ్బందులు ఎదుర్కొనే బాధిత మహిళ వివరాలు జిల్లా పోలీసు కంట్రోల్‌ రూంలోని షీటీం, సాప్ట్‌వేర్‌ ఐటీ విభాగానికి చేరుతాయి. వెంటనే పోలీసు అధికారులు సమస్యను పరిష్కరించి బాధ్యులపై చర్యలు తీసుకుని బాధిత మహిళలకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది.

 ఫిర్యాదు చేయడం సులువు..

- భార్గవి , బెల్లంపల్లి

ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే ప్రస్తుతం పోలీసులకు షీటీం క్యూర్‌ కోడ్‌ ద్వారా సులువుగా ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి వద్ద స్మార్ట్‌ ఫోన్‌ ఉండడంతో ఏదైనా ఆపద వచ్చినప్పుడు తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది. ఈ యాప్‌తో మహిళలు, యువతులకు దైర్యం ఏర్పడనుంది. నాతో పాటు నా స్నేహితులందరు క్యూ ఆర్‌ కోడ్‌ గురించి పూర్తిగా తెలుసుకున్నారు. 

మహిళలకు మరింత భద్రత..

- మానస, బెల్లంపల్లి డివిజన్‌ షీటీం ఇన్‌చార్జి

మహిళలకు భద్రత కల్పించేందుకు షీటీం బృందాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. మహిళలకు మరింత రక్షణ కల్పించే దిశగా షీటీం క్యూఆర్‌ కోడ్‌ను ప్రవేశపెట్టాం. మహిళలు, యువతులు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ధైర్యంగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. మహిళలను వేధింపులకు గురి చేసే వారిపై క్రిమినల్‌కేసులు నమోదు చేసి జైలుకు పంపుతాం.