టీకా కోసం..

ABN , First Publish Date - 2021-05-09T09:08:37+05:30 IST

జిల్లాలకు వారం, రెండు వారాల తర్వాత కొవిడ్‌ వ్యాక్సిన్‌ రావడం.. అదీ తక్కువ సంఖ్యలో డోసులు పంపిణీ చేయడంతో జనం ఎగబడ్డారు. చాలాచోట్ల గుంపులుగా కనిపించారు

టీకా కోసం..

రెండో డోసు కోసం ఎగబడ్డ జనం 

శ్రీకాళహసి,ఒంగోలులో తోపులాట


(ఆంధ్రజ్యోతి నూస్‌ నెట్‌వర్క్‌)

జిల్లాలకు వారం, రెండు వారాల తర్వాత కొవిడ్‌ వ్యాక్సిన్‌ రావడం.. అదీ తక్కువ సంఖ్యలో డోసులు పంపిణీ చేయడంతో జనం ఎగబడ్డారు. చాలాచోట్ల గుంపులుగా కనిపించారు. కొన్నిచోట్ల తోపులాట కూడా జరిగింది. చాలా కేంద్రాల్లో రెండో డోసు వేయించుకోకుండానే జనం నిరాశతో వెనుదిరిగారు. ప్రకాశం జిల్లాలో వారం నుంచి కొవాగ్జిన్‌ అందుబాటులో లేదు. శుక్రవారం 13వేల డోసులు జిల్లాకు వచ్చాయి. శనివారం ఒంగోలులోని ఐదు కేంద్రాల వద్ద సెకండ్‌ డోసు వేసే ప్రక్రియను చేపట్టారు. జిల్లాలోని వివిధ పీహెచ్‌సీలలో అందుబాటులో ఉంచారు. సెకండ్‌ డోసు కోసం ఉదయం 7గంటల నుంచే జనం వందలాదిగా తరలివచ్చారు. మొదటి డోసును సచివాలయాల్లో వేసిన శాఖాధికారులు రెండో డోసు పరిమిత కేంద్రాల్లో చేపట్టారు. వ్యాక్సిన్‌ అయిపోతే మళ్లీ రాదేమోనన్న ఆందోళనతో ప్రజలు భారీగా తరలివచ్చారు. రిమ్స్‌ కేంద్రంలో ఓ దశలో పరిస్థితి చేయిదాటి తోపులాట చోటుచేసుకుంది. కర్నూలు జిల్లాలో కొవాగ్జిన్‌ డోసులు గంటలోపే అయిపోయాయి. దీంతో వేలాది మంది వ్యాక్సిన్‌ వేయించుకోకుండానే వెనుదిరిగారు. 


జిల్లాకు 16 రోజుల తర్వాత డోసులు రావడంతో జనం భారీగా తరలివచ్చారు. 17 కేంద్రాల్లో టీకాలు వేస్తున్నట్లు అధికారులు ముందే ప్రకటించారు. రెండో డోసు కోసం 20వేల మంది ఎదురు చూస్తుండగా 6వేల డోసులు మాత్రమే వచ్చాయి. ఉదయం 9గంటలకు ప్రారంభమైన ప్రక్రియ 10గంటలకే అయిపోయింది. కర్నూలు కంటి ఆసుపత్రికి 600 డోసులు కేటాయించగా.. దాదాపు 2వేల మంది వచ్చారు. చిత్తూరు జిల్లాలో ఏ వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద చూసినా జనం గుంపులుగుంపులుగా కనిపించారు. జిల్లా వ్యాప్తంగా 127 కేంద్రాల్లో కొవాగ్జిన్‌ రెండో డోసు వేశారు. అవసరమైనన్ని డోసులు రాకపోవడంతో వందలమంది నిరాశతో వెనుదిరిగారు. కొవాగ్జిన్‌ తక్కువ డోసులు రావడంతో ఎంపిక చేసిన కొన్ని కేంద్రాల్లో మాత్రమే అందించారు. సుమారు 2.30 లక్షల మందికి రెండో డోసు వేయాల్సి ఉండగా, 13,714 మందికి మాత్రమే వేశారు. శ్రీకాకుళం జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగింది. కొన్నిచోట్ల ఒకేసారి జనాలు చొచ్చుకురావడంతో స్వల్ప తోపులాటలు చోటుచేసుకున్నాయి. విజయనగరం జిల్లాలో టీకా కోసం కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు నానాయాతన పడ్డారు. 

Updated Date - 2021-05-09T09:08:37+05:30 IST