టీటీడీ ఉద్యోగులకు ఫిబ్రవరి నుంచి నగదు రహిత వైద్యం

ABN , First Publish Date - 2022-01-27T08:17:28+05:30 IST

టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు ఫిబ్రవరి ఒకటో తేదీనుంచి వివిధ వైద్యశాలల్లో అందుబాటులోకి రానున్నాయని, దీనికోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్టు ఈవో జవహర్‌రెడ్డి వెల్లడించారు.

టీటీడీ ఉద్యోగులకు   ఫిబ్రవరి నుంచి నగదు రహిత వైద్యం
గౌరవ వందనం అందుకుంటున్న టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి

 ఈవో జవహర్‌రెడ్డి వెల్లడి

తిరుపతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు ఫిబ్రవరి ఒకటో తేదీనుంచి వివిధ వైద్యశాలల్లో అందుబాటులోకి రానున్నాయని, దీనికోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్టు ఈవో జవహర్‌రెడ్డి వెల్లడించారు.టీటీడీ పరిపాలనా భవన ప్రాంగణంలోని మైదానంలో గణతంత్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈవో జాతీయ జెండాను ఎగురవేసి, గౌరవవందనం స్వీకరించారు. అనంతరం టీటీడీ ప్రగతిని ఆయన వివరించారు.భక్తులు శ్రీవారి నామకోటి రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.తిరుమలలో 35 ఎకరాల్లో 16వేల మొక్కలు పెంచుతున్నామని, వీటి ద్వారా వచ్చే పూలను స్వామి కైంకర్యానికి వినియోగిస్తామన్నారు. ఆగస్టు నుంచి ఆర్టీసీ విద్యుత్‌ బస్సులను ఘాట్‌లో నడపనుందని జవహర్‌రెడ్డి వివరించారు. భద్రతా సిబ్బంది కవాతు, ఎస్వీ సంగీత కళాశాల విద్యార్థుల భరతనాట్యం ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా ఉత్తమస్థాయిలో విధులు నిర్వహించిన 25మంది అధికారులకు, 150మంది సిబ్బందికి ఈవో ప్రశంసా పత్రాలు అందజేశారు.అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో గోపీనాథ్‌ జెట్టి, ఎఫ్‌ఏ అండ్‌ సీఏవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-27T08:17:28+05:30 IST