Mukesh Ambani : ముకేష్ అంబానీకి బెదిరింపు కాల్స్ .. ప్రాథమిక విచారణలో తెలిసిన వాస్తవం ఇదీ..

ABN , First Publish Date - 2022-08-15T21:54:09+05:30 IST

భారతీయ సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) అధినేత ముకేష్ అంబానీ(Mukesh Ambani), ఆయన కుటుంబానికి సోమవారం ఉదయం బెదిరింపు కాల్స్ వచ్చాయి.

Mukesh Ambani : ముకేష్ అంబానీకి బెదిరింపు కాల్స్ .. ప్రాథమిక విచారణలో తెలిసిన వాస్తవం ఇదీ..

ముంబై : భారతీయ సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) అధినేత ముకేష్ అంబానీ(Mukesh Ambani), ఆయన కుటుంబానికి సోమవారం ఉదయం బెదిరింపు కాల్స్(Threat Calls) వచ్చాయి. ముంబై గిర్గావ్ ప్రాంతంలోని ‘రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌’(reliance Foundation hospital) ల్యాండ్‌లైన్ నంబర్‌కి 3 సార్లు కాల్ చేసిన దుండగుడు హెచ్చరించాడు. హాస్పిటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ముంబై పోలీసులు(Mumbai police)... కాల్ వచ్చిన నంబర్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అఫ్జల్‌గా గుర్తించామని, అతడి మానసిక స్థితి సరిగాలేదని ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు వివరించారు. కేసు నమోదు చేశామని, నిందిత వ్యక్తిని ప్రశ్నిస్తున్నామని వివరించారు.


కాగా ముకేష్ అంబానీ, ఆయన కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను నిరభ్యంతరంగా కొనసాగించొచ్చంటూ గత నెలలో సుప్రీంకోర్ట్ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌‌ను కొట్టివేసింది. అంబానీలకు ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వడం ఏంటంటూ సవాలు చేస్తూ  దాఖలైన పిల్‌ను త్రిపుర హైకోర్ట్ విచారణకు స్వీకరించడంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకెళ్లిన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. భద్రతకు అయ్యే ఖర్చును ముకేష్ అంబానీ కుటుంబమే భరిస్తున్నందున సెక్యూరిటీ కొనసాగించవచ్చునని తెలిపింది. 


కాగా ముకేష్ అంబానీ, ఆయన కుటుంబానికి పొంచివున్న ముప్పును తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. గతేడాది అంబానీ ఇంటి వెలుపల కారులో పేలుడు పదార్థాలను గుర్తించారు. కారుకి సమీపంలోని చేతిరాత లేటర్ కూడా దొరికింది. ముకేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీని ఉద్దేశించి ఈ లేఖ రాశారు. ఈ కుట్ర వెనుక ఓ సీనియర్ పోలీసులు అధికారి కూడా ఉండడం అప్పట్లో కలకలం రేపిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-08-15T21:54:09+05:30 IST