వారి కోసం... స్వర్గంలో ఒక చెట్టు

ABN , First Publish Date - 2022-07-29T07:40:46+05:30 IST

అల్లాహ్‌ సృష్టిలో వృక్షాలకు అత్యున్నత స్థానం ఉంది, పోషణా గుణానికి అవి మంచి తార్కాణాలు.

వారి కోసం... స్వర్గంలో ఒక చెట్టు

ల్లాహ్‌ సృష్టిలో వృక్షాలకు అత్యున్నత స్థానం ఉంది, పోషణా గుణానికి అవి మంచి తార్కాణాలు. వృక్షాలు జీవితాంతం తోడు నీడగా ఉంటాయనీ, వాటిని నాశనం చెయ్యడం అంటే మనిషి తన వినాశనాన్ని తానే కొనితెచ్చుకున్నట్టేననీ అంతిమ దైవప్రవక్త మహమ్మద్‌ బోధించారు. 


ఇది పూర్వకాలంలో జరిగిన కథ. అబ్దుల్‌ రషీద్‌ అనే బాలుడు ఉండేవాడు. రోజూ అతను బడి నుంచి ఇంటికి వస్తూ... మార్గమధ్యంలో ఉన్న మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళేవాడు. కొమ్మలు పట్టుకొని ఊగేవాడు. చెట్టెక్కి... ఒక కొమ్మ నుంచి మరో కొమ్మ మీదకు దూకేవాడు. మామిడి పండ్లు తినేవాడు. ఎండిపోయిన ఆకులను ఏరి దూరంగా పడేసేవాడు. మంచి ఆకులతో దండ చేసేవాడు. ఆడి ఆడి అలసిపోతే... చెట్టు నీడన హాయిగా నిద్రపోయేవాడు. రోజూ చెట్టుకు నీరు పోసేవాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని పండ్లను తెంపి తీసుకుపోయేవాడు. ఇలా ఆ చెట్టుకూ, అతనికీ మధ్య చక్కటి స్నేహం కుదిరింది. కొన్ని సంవత్సరాలవరకూ చెక్కు చెదరకుండా కొనసాగింది.


కాలం గడిచిపోయింది. అబ్దుల్‌ రషీద్‌ చదువు అయిపోయింది. ఉద్యోగం కోసం పట్టణానికి వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తల్లితండ్రులను కూడా ఒప్పించాడు. కొత్త దుస్తులు కుట్టించుకున్నాడు. సర్వం సిద్ధం చేసుకొని బయలుదేరాడు. దారిలో పెద్ద నది పొంగి పొరలుతోంది. అటువైపు వెళ్ళాలంటే కష్టమైన పని. పడవలు కూడా లేవు. నీరు తగ్గితేనే రాకపోకలు సాగుతాయి. లేకపోతే ఎక్కడివాళ్లు అక్కడే ఉండాల్సిందే. దీనివల్ల ఊరి ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు.ఆ సమయంలో రషీద్‌కు ఒక ఆలోచన వచ్చింది. వెనుతిరిగి మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. తన సమస్యను ఆ చెట్టుకు వివరించాడు. 


చెట్టు ఎంతో బాధపడింది. ‘‘సరే మిత్రమా! నువ్వు, ఊరి ప్రజలు బాధ పడవలసిన అవసరం లేదు. వెంటనే నా కొమ్మలను నరికి, పడవ తయారు చేసుకొని, నది దాటు. తరువాత ఆ పడవను ఊరి ప్రజలకు ఇవ్వు. సంతోషంగా, క్షేమంగా పట్టణం చేరుకో’’ అని చెప్పింది. రషీద్‌ అలాగే చేశాడు. పట్టణంలో మంచి ఉద్యోగంలో చేరాడు. బాగా డబ్బు సంపాదించాడు. కొన్నాళ్ళ తరువాత సొంత ఊరికి వచ్చేశాడు. తదనంతరం అతను ఆ ఇంట్లో హాయిగా జీవితం గడిపాడు. చాలాకాలం గడిచింది. రషీద్‌ వృద్ధుడయ్యాడు. చలితో వణుకుతూ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అతణ్ణి గమనించిన చెట్టు ‘‘మిత్రమా! నా ఎండిన కొమ్మలను మండించి చలి కాచుకో’’ అంది. అతను మొత్తం ఆకులను ఏరి, మంట పెట్టి, చలిని తగ్గించుకున్నాడు.


ఆ తరువాత తుపానుకి అతని ఇల్లు పడిపోయింది. నివసించడానికి వీలు లేకుండా ఉంది. అతను వెంటనే చెట్టు దగ్గరకు వెళ్ళి, పరిస్థితి చెప్పాడు. చెట్టు విచారించింది. ‘‘ఓ మిత్రమా! నా కాండాన్ని నరికి, నీ ఇంటిని చక్కగా కట్టుకో’’ అని చెప్పింది. అతను చెట్టు చెప్పినట్టే చేశాడు. ఈ విధంగా ఆ చెట్టు నిజమైన స్నేహధర్మం పాటించింది. తన సర్వస్వాన్నీ దానం చేసింది. గొప్ప స్నేహితుణ్ణి పోగొట్టుకున్న రషీద్‌ చాలా దుఃఖించాడు. మరిన్ని చెట్లను నాటాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ‘ఎవరైతే ఓ మొక్కను నాటి, అది పెద్దదయ్యేవరకూ సంరక్షిస్తారో... వారికోసం స్వర్గంలో అల్లాహ్‌ ఒక చెట్టు నాటుతార’ని దైవప్రవక్త చెప్పారు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2022-07-29T07:40:46+05:30 IST