రెండో రాక కోసం

ABN , First Publish Date - 2020-12-25T05:55:58+05:30 IST

ప్రపంచమంతా క్రీస్తు జననంతో ముడిపడి ఉంది. కాలం క్రీస్తు పూర్వం లేదా క్రీస్తు శకం అనే రెండు భాగాలుగా ప్రస్తావితం అవుతోంది. శకకర్తగా ఈ ప్రపంచం మీద ఏసు క్రీస్తు వేసిన ముద్ర అపూర్వమైనది.

రెండో రాక కోసం

సిద్దమవుదాం

మానవాళిని చెడు మార్గం నుంచి తప్పించడానికీ, పాపాల నుంచి విముక్తి కలిగించడానికీ ఇలపైకి వచ్చిన దైవ కుమారుడు ఏసు క్రీస్తు. అంతం అనేది లేని ఒక నిత్య జీవనం మరణానంతరం ఉన్నదనీ, అలాంటి జీవనాన్ని పొందాలంటే ఇహలోకంలో పవిత్రంగా జీవించాలనీ ఆయన ప్రబోధించాడు. అందుకు అనుసరించాల్సిన మార్గాన్ని చూపించాడు.


ప్రపంచమంతా క్రీస్తు జననంతో ముడిపడి ఉంది. కాలం క్రీస్తు పూర్వం లేదా క్రీస్తు శకం అనే రెండు భాగాలుగా ప్రస్తావితం అవుతోంది. శకకర్తగా ఈ ప్రపంచం మీద ఏసు క్రీస్తు వేసిన ముద్ర అపూర్వమైనది. ‘ఆది, అంతం నేనే’ అని చెప్పిన దేవుడి కుమారుడు ఏసు. తాను ఎంతో ప్రేమతో సృష్టించిన మానవులు తన మార్గంలో జీవించాలని దేవుడు అభిలషించాడు. కానీ సృష్టికర్తను మరచిపోయి, అజ్ఞానంలో పడి, సాతాను ప్రభావం కారణంగా శరీర వాంఛలకే మానవులు ప్రాధాన్యం ఇవ్వడంతో... వారిని పాపాల నుంచి విముక్తి చేయడం కోసం మానవ రూపంలో ఏసు క్రీస్తును ఈ లోకానికి సృష్టికర్త పంపాడు. ఆ విధంగా తన ఏకైక కుమారుడైన ఏసును లోక రక్షణ కోసం, మానవులందరి పాప పరిహారం కోసం దేవుడు అంకితం చేశాడు. భువిపైకి ఏసు రాక గురించి ఎంతో ముందు నుంచే దైవం స్వయంగా ప్రకటించాడు. పతనమయ్యే మానవుడిని పాపం నుంచి రక్షించడానికి ఏసు వస్తాడని దైవం చెప్పిన ఉదంతాలు పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తాయి. 


జాతి, కులం, మతం, వర్గం, ప్రాంతాలకు దైవం అతీతుడు. సృష్టి యావత్తూ ఆయన చేసినదే. మానవులందరూ మనగలిగేది ఆయన కనుసన్నలలోనే. ప్రజలు పాప మార్గంలో పడినప్పుడు ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తాడు. ఆ ప్రవక్తల ఉపదేశాలను పట్టించుకోనివారు వినాశనం వైపు పయనిస్తారు. నిత్యమైన అంటే శాశ్వతమైన జీవనంలోకి ప్రజలు ప్రవేశించడానికి మార్గం చూపించడానికి ఏసు అవతరించాడు. దైవం ఆదేశించిన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. 


ఏఎందరికో మార్గదర్శకుడై...

ఏసు ప్రభువు జన్మించగానే, ఆయన రాకకోసం కనిపెట్టుకొని ఉన్నవారికి శుభవర్తమానం అందింది. రాత్రి సమయంలో గొర్రెల కాపరులకు కూడా ఈ సమాచారం అందగానే... వారు పరుగుపరుగున వచ్చి, ఊరి వెలుపల పశువుల పాకలో, ఒక తొట్టిలో ఉన్న బాలుణ్ణి సందర్శించారు. పరలోక దూతల సమూహం ప్రత్యక్షమై, ఆ బాలుణ్ణి స్తుతించడం వారు కళ్ళారా చూశారు. అందరికీ తెలియజేశారు. అదే విధంగా జ్ఞానులు ఆ లోక రక్షకుణ్ణి దర్శించి, కానుకలు సమర్పించారు. ఏసు ప్రభువు బాప్తిష్మ సమయంలోనూ, తాచోరు పర్వతంపై ఏసు దివ్య రూపధారణ సమయంలోనూ ‘‘ఇతను నా ప్రియ కుమారుడు. ఇతణ్ణి మీరు తిలకించండి’’ అని దైవం స్వయంగా చెప్పాడు. ఆయనను తను ఏ కార్యం మీద లోకానికి పంపినదీ సర్వ లోకానికీ విదితం చేశాడు.


బోధకునిగా ఏసు ప్రభువు చూపిన ప్రభావం అపారం. ఆయన బోధలు విన్న ఎంతోమంది పాపభూయిష్టమైన పాత జీవన విధానాన్ని మార్చుకున్నారు. పరివర్తన చెందారు. మొదట్లో ఆయనను వ్యతిరేకించిన వారు కూడా ఆయన పవిత్రుడు, నీతిమంతుడు, దైవ కుమారుడని సాక్ష్యం ఇచ్చారు. పవిత్ర గ్రంథమైన బైబిల్‌లో తప్పులు వెతకాలని ప్రయత్నించిన వారెందరో తమ తప్పులు తెలుసుకొని ఏసు మార్గంలోకి వచ్చారు. ఆయన మహిమకు సాక్షులయ్యారు. ఆయన ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందిన శిష్యులు దేశదేశాలకూ వెళ్ళి, ‘ఏసు క్రీస్తు లోక రక్షకుడు’ అని సువార్తను బోధించారు. ఎంతో శ్రమ ఎదురైనా వారు వెనుదీయలేదు. ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడ్డారు తప్ప సువార్త ప్రకటనను ఆపలేదు. 


ఏఈసారి తీర్పరిగా...

ఏసు పుట్టుకతో భూమిపై ఒక నూతన యుగం ఆవిర్భవించింది. ఒక కొత్త జీవాన్ని లోకం సంతరించుకుంది. భూలోకానికి ఏసు రెండో రాకడ గురించి దానియేలు ప్రవక్త గ్రంథంలో ప్రస్తావితమైంది. తాను మళ్ళీ ఈ లోకానికి వస్తాననీ, ఆ సమయానికి హృదయాలు పాపరహితంగా చేసుకొని, పరిశుద్ధులుగా ఉన్నవారిని తన పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాననీ తన బోధలలో ఏసు స్వయంగా తెలిపాడు. పవిత్రంగా జీవించేవారిని తన రాజ్యంలోకి చేర్చుకుంటానని చెప్పాడు. రెండో రాకడలో ఆయన ఒక న్యాయాధిపతిగా వస్తాడు. సమస్త దూతల సమేతంగా, మహిమాన్వితమైన సింహాసనం మీద ఆసీనుడవుతాడనీ, సకల జాతుల వారినీ ఆయన సముఖానికి చేరుతారనీ ‘మత్తయి సువార్త’ చెబుతోంది. ఈసారి రక్షకుడిగా కాకుండా తీర్పరిగా ఏసు ఇక్కడికి వస్తాడు. ఆయన రెండో రాకడ ఎంతో దూరం లేదనే విషయాన్ని గ్రహించాలి. దాన్ని ఆహ్వానించడానికి మనల్ని మనం స్థిరపరచుకోవాలి. పవిత్రపరచుకోవాలి.


జీవన విధానాన్ని మార్చుకోవాలి. దానికోసం దొరికిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలి. కొత్త వ్యక్తిగా మారాలి. అదే నిజమైన క్రిస్మస్‌. మానవుల పాపాలను తనపై వేసుకొని, మనల్ని శిక్షనుంచి తప్పించిన మహాత్ముడు ఏసు ప్రభువు. మన కోసం తన రక్తాన్ని వెలగా ఆయన చెల్లించాడు. కాబట్టి నరజాతి అంతా ఆయన సొంతమే. ఆయన అంగీకరిస్తే రక్షణ దొరుకుతుంది. శిక్ష తప్పుతుంది. రక్తాన్ని ధారపోసి, మరణించి, పునరుత్థానం చెంది నూతన జీవం, జీవనం ఉన్నదనీ, ఈ జీవితం ఈ లోకంతో అంతం కాదనీ, విశ్వాసం ఉంటే పునరుత్థానం పొందగలమనీ ఆయన నిరూపించాడు. ఈ సత్యాన్ని అంగీకరించాలి. దైవాన్ని విశ్వసించాలి. హృదయ పరివర్తన చెందాలి. చెడు మార్గాలను వదిలి పెట్టాలి. ఏసు ప్రభువు మనకోసం చిందించిన రక్తం ద్వారా పాపాలను శుద్ధి చేసుకోవాలి. అప్పుడే దైవ రాజ్యాన్ని చేరగలం. 


క్రీస్తు రెండో  రాకడ ఎంతో దూరం లేదనే విషయాన్ని గ్రహించాలి. దాన్ని ఆహ్వానించడానికి మనల్ని మనం స్థిరపరచుకోవాలి. పవిత్రపరచుకోవాలి. జీవన విధానాన్ని మార్చుకోవాలి. దానికోసం దొరికిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలి. కొత్త వ్యక్తిగా మారాలి. అదే నిజమైన క్రిస్మస్‌.

 బెల్లంకొండ లిల్లీమేరీ

9440170835

Updated Date - 2020-12-25T05:55:58+05:30 IST