అన్‌రాక్‌కు లైన్‌ క్లియర్‌ ?

ABN , First Publish Date - 2021-09-03T06:24:02+05:30 IST

అన్‌రాక్‌ అల్యూమినియం రిఫైనరీ..

అన్‌రాక్‌కు లైన్‌ క్లియర్‌ ?
అన్‌రాక్‌ కంపెనీకి రైల్వే ట్రాక్‌ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో రోణంకి గోవిందరావు, ఇతర అధికారులు

అల్యూమినియం రిఫైనరీ ప్రారంభానికి ఏర్పాట్లు 

ఒడిశా నుంచి బాక్సైట్‌ దిగుమతి చేసుకునేందుకు యాజమాన్యం యోచన 

కశింకోట మండలం బయ్యవరం నుంచి కంపెనీ వరకు ప్రత్యేక రైల్వే లైన్‌

ఏలేరు కాల్వ గట్టు మీదుగా ట్రాక్‌ నిర్మాణం 

సాధ్యాసాధ్యాలపై నర్సీపట్నం ఆర్డీవో పరిశీలన


మాకవరపాలెం(విశాఖపట్నం): అన్‌రాక్‌ అల్యూమినియం రిఫైనరీ పునఃప్రారంభానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఉత్పత్తికి అవసరమైన ముడిసరకును ఒడిశా నుంచి తీసుకువచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రోడ్డు మార్గంలో తరలించేందుకు అధిక వ్యయం కానుండడంతో రైల్వే వ్యాగన్ల ద్వారా బాక్సైట్‌ తేవాలని నిర్ణయించారు. ఇందుకోసం కశింకోట మండలం బయ్యవరం నుంచి రిఫైనరీ వరకు ప్రత్యేకంగా ఏలేరు కాల్వ గట్టుపై రైల్వే లైను వేయనున్నారు. ఈ ప్రక్రియ సాధ్యాసాధ్యాలపై నర్సీపట్నం ఆర్డీవో రోణంకి గోవిందరావు గురువారం ఏలేరు కాల్వ గట్టు, పరిసరాలను పరిశీలించారు. 


మాకవరపాలెం మండలంలో అన్‌రాక్‌ అల్యూమినియం రిఫైనరీ ఏర్పాటుచేసిన తరువాత ముడి సరకు సమస్య ఎదురైంది. కంపెనీ మూతపడింది. దీంతో కంపెనీ యాజమాన్యం అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసును పరిష్కరించే చర్యల్లో భాగంగా ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భేటీ అయ్యారు. వివాద పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. కేంద్ర గనుల శాఖ అధికారులతో పాటు న్యాయవాదులతోనూ చర్చించారు. పరిశ్రమకు అవసరమైన బాక్సైట్‌ను విశాఖ ఏజెన్సీలో తవ్వి తీసేందుకు సాధ్యం కానందున, ఒడిశా నుంచి తీసుకువచ్చేలా అక్కడి ప్రభుత్వంతో చర్చించినట్టు తెలిసింది. రోడ్డు మార్గం కంటే రైల్వే ద్వారా గిట్టుబాటు అవుతుందని భావిస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లా బయ్యవరం నుంచి కంపెనీ వరకు ట్రాక్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇందుకోసం ఏలేరు కాల్వ గట్టును వినియోగించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితమే కశింకోట, మాకవరపాలెం మండల సర్వేయర్ల ద్వారా 30 కిలోమీటర్ల పొడవునా రైల్వే ట్రాక్‌ నిర్మాణం కోసం ఏలేరు కాలువ గట్టును రిఫైనరీ యాజమాన్యం సర్వే చేయించి, హద్దులు కూడా వేయించింది. 


అధికారుల పరిశీలన

కాగా ట్రాక్‌ నిర్మాణంపై ఫీజిబిలిటీ రిపోర్టు కోసం నర్సీపట్నం, అనకాపల్లి ఆర్డీవోలను జిల్లా యంత్రాంగం ఆదేశించింది. కశింకోట మండలంలోని సాగర్‌ సిమెంట్స్‌ సమీపంలో బయ్యవరం నుంచి రిఫైనరీ వరకు సుమారు 30 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్‌ నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం సగం వరకు ఏలేరు కాల్వ గట్టు అనువుగా వుంటుందని అంచనా వేస్తున్నారు. మరో 15 కి.మీ.ల లైన్‌ కోసం ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంటుంది.


ట్రాక్‌ నిర్మాణానికి అవసరమైన నిధులను అన్‌రాక్‌ యాజమాన్యం చెల్లిస్తుంది. ఈ నేపథ్యంలో నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు, ఏలేరు ప్రాజెక్టు డీఈ వసంత గురువారం జెడ్‌.గంగవరం నుంచి అన్‌రాక్‌ కంపెనీ వరకు ఏలేరు కాలువ గట్టును పరిశీంచారు. ఏలేరు స్ధలం ఎంత ఉంది, రైల్వే ట్రాక్‌ నిర్మాణం ఎంతలో చేపట్టాలి?, ఈ స్థలం రెవెన్యూ భూమిలోకి వస్తుందా అనేది తెలుసుకున్నారు. మాకవరపాలెం మండలం పరిధిలో ఏలేరు కాల్వను సర్వే చేసి, రెవెన్యూ భూమికి హద్దులు నిర్ణయించి నివేదిక ఇవ్వాలని మండల సర్వేయర్‌ను ఆదేశించారు. సర్వేలో తహసీల్దార్‌ రాణి అమ్మాజీ, సర్వేయర్‌ గోవిందరావు, అన్‌రాక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌.ఎస్‌.రావు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T06:24:02+05:30 IST