బానిస బతుకుల విముక్తి కోసం

ABN , First Publish Date - 2021-09-17T05:23:32+05:30 IST

బానీస బతుకుల విముక్తి కోసం రజాకార్ల అకృత్యాలకు విసిగి వేసారిన ప్రజలు నిజాం ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల చరిత్ర ఎంతో ఘనమైనది.

బానిస బతుకుల విముక్తి కోసం
సాయుధ పోరాటంలో శిక్షణ పొందుతున్న మహిళలు (ఫైల్‌)

- సాయుధ పోరాటంలో ఉమ్మడి జిల్లాల ప్రముఖులు
- నిజాంను ఎదురించిన పోరాట యోధులు
- కామారెడ్డిలో ఫణిహారం రంగాచారి
- కుప్రియాల్‌లో గోపాల్‌రెడ్డి
- ఎర్రాపహాడ్‌లో బొక్క గుండారెడ్డి
- నేడు తెలంగాణ విమోచన దినం


కామారెడ్డి, సెప్టెంబరు 16: బానీస బతుకుల విముక్తి కోసం రజాకార్ల అకృత్యాలకు విసిగి వేసారిన ప్రజలు నిజాం ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల చరిత్ర ఎంతో ఘనమైనది. ఎంతో మంది సాయుధ పోరాట యోధులు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. కలంతో దాశరథి కృష్ణామాచార్య నిజామాబాద్‌ ఖిల్లా జైలులో ఉద్యమ గళం విప్పారు. కత్తి పోటును సైతం లెక్క చేయకుండా జాగో ప్రజా.. భాగో నిజాం.. అన్న రాధాకృష్ణ మోదాని నిజామాబాద్‌ జిల్లా వాడే. కన్న వారిని.. పుట్టిన ఊరిని వదిలి నిజాంను ఎదురించిన నర్సింహారెడ్డి, సర్దార్‌ ప్రేమ్‌సింగ్‌, ఫణిహారం రంగాచారి, రాజారెడ్డి, కుప్రియాల్‌ గోపాల్‌రెడ్డి, ఎర్రాపహాడ్‌కు చెందిన బొక్క గుండారెడ్డి వంటి ఎందరో ఉద్యమ వీరులు పోరాట స్ఫూర్తిని నింపి ఉమ్మడి జిల్లాకే గర్వకారణంగా మారారు. 1947 ఆగస్టు 15న భారతావనికి స్వాతంత్య్రం లభించినా నిజాం నిరంకుశ పాలనలో ఉన్న హైదరాబాద్‌ సంస్థానానికి మాత్రం విముక్తి లభించలేదు. భారతదేశంలో తన రాష్ర్టాన్ని విలీనం చేయడానికి నిజాం ఒప్పు కోలేదు. ఫలితంగా ఈ ప్రాంత విముక్తి కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన ఫణిహారం రంగాచారి సాయుధ పోరాట యోధులలో ఒకరు. 1946 నుంచి 1951 వరకు హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం నవాబు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రజాకార్ల రాక్షసత్వం, భూస్వాముల దోపిడీపై, వెట్టి చాకిరి చట్ట విరుద్ధ పనులకు వ్యతిరేకంగా భూమి కోసం బానీస బతుకుల విముక్తి కోసం సాగిన పోరాటాన్ని చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మన దేశ చరిత్రలోనే అసమానమైనవి. 10 లక్షల ఎకరాల భూములు ఆనాడు పేదలకు పంచడం జరిగింది. ఈ చారిత్రక పోరాటంలో సుమారు 4వేల మంది పోరాటవీరులు అమరులైనట్లు చరిత్ర చెబుతోంది. కామారెడ్డి పట్టణానికి చెందిన ఫణిహారం రంగాచారి మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి లక్ష్మణాచారి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేశారు. అదే పాఠశాలలో చదువుతున్న రంగాచారి చిత్రలేఖనంలో మంచి ప్రావీణ్యం సాధించారు. ఆ పాఠశాలలో ఉన్న చిత్రలేఖనం ఉపాధ్యాయుడు బషీరొద్దీన్‌ రంగాచారితో పాటు అతని మిత్రుడు విఠల్‌రావును మరింత ప్రావీణ్యం సాధించడానికి హైదరాబాద్‌లోని ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో చేర్పించారు. 1943వ సంవత్సరంలో రంగాచారి తండ్రి లక్ష్మణాచారి అనారోగ్యంతో మృతి చెందడంతో రంగాచారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అతని మిత్రుడు విఠల్‌రావు సహాయంతో ట్యూషన్స్‌ చెబుతూ మెరిట్‌ స్కాలర్‌షిప్‌తో అతని చదువును కొనసాగించారు. రంగాచారి కళాశాలల్లో చదివే రోజుల్లోనే రజాకార్ల కార్యకలాపాలు ఉధృతంగా ఉండేవి. రజాకార్ల కార్యకలాపాలకు దీటుగా ఆర్య సమాజ్‌ తీవ్రంగా పోరాడుతుండేది. దీంతో రాంగాచారి విఠల్‌రావులు ఆర్య సమాజం పట్ల ఆకర్షితులై అందులో చేరారు. కానీ ఆర్య సమాజ్‌ కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిథ్యం వహించడంతో రంగాచారి, విఠల్‌రావులు అందులో నుంచి బయటకు వచ్చి హైదరాబాద్‌ స్టూడెంట్‌ యూనియన్‌లో చేరి విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అదే సమయంలో కామ్రెడ్‌ అసోసియేషన్‌ నాయకుడైన డాక్టర్‌ రాజ్‌ బహదూర్‌గౌడ్‌,  మఖ్దూం మొహియోద్దీన్‌, రావి నారాయణరెడ్డిలతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని హైదరాబాద్‌ సంస్థానంలో ప్రజలు జరుపుతున్న ఉద్యమాలపై సామాజిక సమస్యలపై చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. భూస్వాముల దోపిడీపై నిర్బంధ పన్నుల వసూళ్లపై రంగాచారి ఎన్నో తైలవర్ణ చిత్రాలు వేసేవారు. 1946లో భారత కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్‌ సంస్థానంలో నిషేధానికి గురికావడం, ఆ పార్టీ కార్యదర్శి రాజ్‌బహదూర్‌ గౌడ్‌ అరెస్టు కావడం జరిగింది. దీంతో రంగాచారితో పాటు మరికొందరు నాయకులు పార్టీ దళితుల కోసం వివిధ వర్గాల నుంచి ఆయుధాలను సేకరించి తెలంగాణ పోరాట ప్రాంతం నుంచి రహస్యంగా ఆయుధాలను చేరవేసేవారు. ఆయుధాలను చేరవేస్తుండగా జరిగిన ప్రమాదంలో గాయపడ్డ డాక్టర్‌ రాజ్‌ బహదూర్‌గౌడ్‌ను పోలీసు కస్టడీలో ఉన్నప్పటికీ ఉస్మానియా ఆస్పత్రి నుంచి ఆయన్ను తప్పించడంలో రంగాచారి కీలకపాత్ర వహించారు. అంతే కాకుండా నాటి విద్యార్థి నాయకుడు చెన్నమనేని రాజేశ్వర్‌రావును సైతం మతోన్మాద గుండాల నుంచి రక్షించినట్లు చరిత్ర చెబుతోంది. రహస్య స్థావరాల్లో ఉన్న కార్యకర్తలను అనేక విధాలుగా రక్షణ కల్పిస్తూ ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలను రంగాచారి ఇచ్చేవారు. తెలంగాణ సాయుధ పోరాటానికి చెందిన పి. రాంచంద్రారెడ్డిని ఆనాడు ఎలుగు బంటి దాడి చేయడంతో అతన్ని చికిత్స నిమిత్తం రంగాచారి రహస్య స్థావరానికి తీసుకెళ్లారు. రక్తం మరకలతో స్థావరాన్ని కనుగొన్న పోలీసులు 1949 జూలై 23న రంగాచారితో పాటు అక్కడే ఉన్న వెదిరే రాజిరెడ్డిలను అరెస్టు చేసి చంచల్‌గూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. చిత్రహింసలు పెట్టినా కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించిన విషయాలను రంగాచారి పోలీసులకు ఏమి చెప్పకపోవడంతో వారిని వరంగల్‌లోని మామునూర్‌ కాన్సెట్రేషన్‌ (ముళ్లకంచె కలిగిన బహిరంగ నిర్బంధ ప్రదేశం) క్యాంపునకు తరలించారు. అ యినప్పటికీ రంగాచారి రహస్యాలు ఏమి చెప్పకపోవడంతో 1949 అక్టోబరు 29న రంగాచారితో పాటు వెదిరే రాజిరెడ్డిలను పోలీసులు అత్యంత క్రూరంగా కాల్చి చంపారు. తెలంగాణ మకుటంలో ఫణిహారం రంగాచారి మకుటం లేని మహరాజుగా వెలుగొందాడు. కామారెడ్డి పట్టణంలోని పెద్దబజార్‌ ప్రాంతంలో రంగాచారితో పాటు అతని మిత్రుడు విఠల్‌రావు నివాసం ఉండేవారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన ఫణిహారం రంగాచారి పేరును మర్చిపోకుండా ఉండేందుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దర్శన్‌ థియేటర్‌ ఏరియాలో గల రెండో వార్డులోని ఓ కాలనీకి రంగాచారి కాలనీ అని కామారెడ్డి కమ్యూనిస్టు నాయకులు నామకరణం చేశారు. కాగా రహస్యాలు రాబట్టలేకపోయిన పోలీసులు రంగాచారి కస్టడీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడనే సాకుతో అన్యాయంగా కాల్చి చంపారని ఆనాటి కమ్యూనిస్టు నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను అప్పట్లో నిర్వహించారు. రంగాచారి వేసిన తైలవర్ణం చిత్రాలు నేటికి హైదారాబాద్‌లోని మగ్దుం భవన్‌లో ఉండటం గమనార్థం.
కుప్రియాల్‌ గోపాల్‌రెడ్డిది గొప్ప చరిత్ర
సాయుధ పోరాటంలో కామారెడ్డి జిల్లాలో రజకార్ల ఆగడాలను ఎదిరించిన యోధుల్లో సదాశివనగర్‌ మండలం కుప్రియాల్‌ గోపాల్‌రెడ్డి ఒకరు. మల్లన్నగుట్టపై రజాకార్లను ఎదిరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు తలమడ్లలో, మద్దికుంటలో గల రైస్‌డిపోలపై దాడి చేసి బియ్యాన్ని కొల్లగొట్టి గ్రామాల్లో పంచారు. అంతే కాకుండా భూమి లేని నిరుపేదలకు భూమిని పంచి రజాకార్ల గుండెల్లో గుబులు పుట్టించారు. మారువేశంలో గ్రామాల్లో రాత్రి వేళ్లలో సమావేశాలు నిర్వహించి రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చారు. అలాగే తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌కు చెందిన బొక్క గుండారెడ్డి, బొక్క గంగారెడ్డి, బద్దం రాజిరెడ్డి, చాకలి ఎల్లయ్య, గొల్ల లచ్చయ్య, దండు రాజన్న, లింగంగౌడ్‌తో పాటు మరో ఎంతో మంది కామారెడ్డి డివిజన్‌లోని గ్రామాల్లో కూడా రజాకార్ల చర్యలను వ్యతిరేకించి సాయుధ పోరాటంలో పాల్గొన్న వారి చరిత్రలు ఉన్నాయి.

Updated Date - 2021-09-17T05:23:32+05:30 IST