కశ్మీరులో 200 మంది యాక్టివ్ టెర్రరిస్టులు!

ABN , First Publish Date - 2021-12-30T22:53:15+05:30 IST

కశ్మీరులో తిరుగుబాట్లు ప్రారంభమైనప్పటి నుంచి పరిశీలిస్తే

కశ్మీరులో 200 మంది యాక్టివ్ టెర్రరిస్టులు!

శ్రీనగర్ : కశ్మీరులో తిరుగుబాట్లు ప్రారంభమైనప్పటి నుంచి పరిశీలిస్తే ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాదుల సంఖ్య బాగా తగ్గిందని జమ్మూ-కశ్మీరు పోలీసులు తెలిపారు. ఈ లోయలో క్రియాశీలక ఉగ్రవాదులు ప్రస్తుతం 200 మంది కన్నా తక్కువగానే ఉంటారని తెలిపారు. ఉగ్రవాదం పట్ల ఆకర్షితులయ్యే యువకుల సంఖ్య కూడా తగ్గిందన్నారు.


దక్షిణ కశ్మీరులోని అనంత్ నాగ్ జిల్లా, కాజీగుండ్ ప్రాంతంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కశ్మీరు ఐజీపీ విజయ్ కుమార్, ఆర్మీ 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే మాట్లాడారు. కశ్మీరు లోయలో భద్రత పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. 


లెఫ్టినెంట్ జనరల్ పాండే మాట్లాడుతూ, ఈ ఏడాది నిర్వహించిన కార్యకలాపాల్లో అత్యధిక కార్యకలాపాలను హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారంగానే నిర్వహించామన్నారు. క్రియాశీలంగా పని చేస్తున్న ఉగ్రవాదుల సంఖ్య 180కి తగ్గిందన్నారు. గడచిన రెండేళ్ళతో పోల్చుకుంటే 2021లో ఉగ్రవాద సంస్థలు యువకులను నియమించుకోవడం కూడా తగ్గినట్లు తెలిపారు. ఉగ్రవాద సంస్థలు గత సంవత్సరం 180 మందిని రిక్రూట్ చేసుకున్నాయని, దీనినిబట్టి పౌర సమాజంలో అవగాహన పెరుగుతున్నట్లు అర్థమవుతోందని చెప్పారు. హింసాత్మక చర్యలకు పాల్పడటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని తెలుసుకున్నారని తెలిపారు. సరిహద్దుల్లో జరుగుతున్నదాన్ని కూడా అర్థం చేసుకుంటున్నారన్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ప్రజలు తమకు సహకరిస్తున్నారని చెప్పారు. వచ్చే సంవత్సరం మరింత ప్రశాంతత నెలకొంటుందని, ఉగ్రవాదంలో చేరే యువత సంఖ్య తగ్గుతుందని తెలిపారు.


కుమార్ మాట్లాడుతూ, కశ్మీరులో తిరుగుబాట్లు ప్రారంభమైనప్పటి నుంచి క్రియాశీలక ఉగ్రవాదుల సంఖ్య 200 కన్నా తక్కువకు పడిపోవడం ఇదే మొదటిసారి అని చెప్పారు. స్థానిక ఉగ్రవాదుల సంఖ్య కూడా దాదాపు 85 లేదా 86కు తగ్గడం తొలిసారి అని వివరించారు. 


Updated Date - 2021-12-30T22:53:15+05:30 IST