Biden Speech: 245ఏళ్ల అమెరికా చరిత్రలో ప్రప్రథమంగా..!

ABN , First Publish Date - 2021-04-30T01:19:05+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ 100 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా.. 245ఏళ్ల అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని ఘటన చోటు చేసుకుంది. దీనిపట్ల..

Biden Speech: 245ఏళ్ల అమెరికా చరిత్రలో ప్రప్రథమంగా..!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ 100 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా.. 245ఏళ్ల అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని ఘటన చోటు చేసుకుంది. దీనిపట్ల అమెరికన్ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గత ఏడాది నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై జో బైడెన్ ఘన విజయం సాధించారు. జనవరి 20న పదవీబాధ్యతలు స్వీకరించి అగ్రరాజ్య అధినేతగా పీఠాన్ని అదిరోహించిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించారు. తాజాగా 100 రోజుల పదవీకాలాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం కాంగ్రెస్ ఉమ్మడి సమావేశం జరిగింది. 


కాగా.. చారిత్రాత్మక ఘటనకు ఈ సమావేశమే వేదికైంది. అమెరికాలో ఇద్దరు శక్తివంతమైన మహిళలైన కమలా హారిస్, నాన్సీ పెలోసీ.. అగ్రరాజ్య అధినేతతోపాటు వేదికను పంచుకున్నారు. అమెరికా కాంగ్రెస్ ఉమ్మడి సమావేశంలో ఇద్దరు మహిళలు అమెరికా అధ్యక్షడితో వేదికను పంచుకోవడం అమెరికా చరిత్రలోనే ప్రప్రథమం. నాన్సీ పెలోసీ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ హోదాలో.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన భారత సంతతికి చెందిన కమలా హారిస్ సెనేట్ అధ్యక్షురాలి హోదాలో బైడెన్‌తో వేదిక పంచుకున్నారు. అమెరికా చరిత్రలో తొలిసారి మహిళ (కమలా హారిస్) వైస్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టారు. దీంతో 245ఏళ్ల అమెరికాలో చరిత్రలో కాంగ్రెస్ ఉమ్మడి సమావేశంలో ఇద్దరు మహిళలు అగ్రరాజ్య అధినేతతో వేదికను పంచుకునే మహత్తర ఘటన ఆవిష్కృతమైంది. 


కాగా.. ఈ విషయాన్ని ప్రస్తావించిన జో బైడెన్.. మేడం స్పీకర్, మేడం వైస్ ప్రెసిడెంట్ అని గర్వంగా సంభోందించారు. అంతేకాకుండా గతంలో ఏ అధ్యక్షుడికీ ఇలా సంభోదించే అవకాశం లభించలేదని హర్షం వ్యక్తం చేశారు. బైడెన్ ప్రసంగిస్తుండగా వేదికపై ఆయన వెనకాల చెరోవైపు కమలా హారిస్, నాన్సీ పెలోసీ కూర్చున్న దృశ్యాలు మీడియాలో ప్రసారం అయ్యాయి. ఈ దృశ్యాలను టీవీల ద్వారా వీక్షించిన కొందరు చట్టసభ్యులు(మహిళలు) తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్త పరిచారు. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమంలో మాట్లాడిన బైడెన్.. కరోనాపై పోరాటంలో అమెరికా తన పూర్తి శక్తిసామర్థ్యాలను వినియోగించినట్టు వెల్లడించారు. అగ్రరాజ్యం మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తున్నట్టు పేర్కొన్నారు. 


Updated Date - 2021-04-30T01:19:05+05:30 IST