హార్మోన్స్‌ బ్యాలెన్స్‌ కోసం...

ABN , First Publish Date - 2020-08-29T05:30:00+05:30 IST

నా వయసు 45 సంవత్సరాలు. కొద్దిగా బరువు ఉన్నాను. బీపీ, షుగర్‌ లేవు. మెన్సస్‌ సరిగా కావడం లేదు. మెనోపాజ్‌ ఏమో అని డాక్టర్‌ను సంప్రదిస్తే పెరిమెనోపాజ్‌ ..

హార్మోన్స్‌  బ్యాలెన్స్‌ కోసం...

నా వయసు 45 సంవత్సరాలు. కొద్దిగా బరువు ఉన్నాను. బీపీ, షుగర్‌ లేవు. మెన్సస్‌ సరిగా కావడం లేదు. మెనోపాజ్‌ ఏమో అని డాక్టర్‌ను సంప్రదిస్తే పెరిమెనోపాజ్‌ అన్నారు. బలానికి మందులు ఇచ్చారు. నేను ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? ఏ విటమిన్స్‌ తీసుకోవాలి? పెరిమెనోపాజ్‌ అంటే ఏమిటి? వివరించండి. 

- రామలక్ష్మి, హైదరాబాద్‌. 


పెరిమెనోపాజ్‌ అంటే కొన్ని హార్మోన్స్‌ తక్కువగా ఉండడం. ఇది మెనోపాజ్‌కి ముందు కొంతమందిలో ఉంటుంది. హార్మోన్స్‌ తగ్గడం వల్ల బరువు పెరగడం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, ఎక్కువగా చెమటలు పట్టడం, ముఖ్యంగా రాత్రిపూట చిరాకు ఎక్కువ అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హార్మోన్స్‌ తక్కువ ఉన్నా, వాటి పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ ఉండాలంటే, మనం కూడా ఒక పద్ధతి పాటించాలి. ముఖ్యంగా టైమ్‌కు నిద్రపోవడం, మాంసకృత్తులు ఉన్న ఆహారం తినడం, వ్యాయామం చెయ్యడం. వీటి వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. హార్మోన్స్‌ కూడా సవ్యంగా పనిచేస్తాయి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

 ప్రతిరోజు నిద్రపోయే ముందు వేడి పాలు లేదా సోయా పాలలో కొద్దిగా బెల్లం లేదా గుల్కండ్‌ (గులాబీ రేకులతో చేసిన స్వీట్‌)కలుపుకొని తాగండి.

 ఆహారంలో బొబ్బర్లు తప్పకుండా ఉండేట్టు చూసుకోండి. ఇవి కలుపు కూరగా లేదా మొలకలుగా తినవచ్చు.

 ఒక్కపూటైన పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి.

 గుమ్మడి గింజలు, నువ్వులను స్నాక్స్‌గా తీసుకోవాలి. పోషకాహార నిపుణులను సంప్రదించి గింజల చట్నీ ఎలా చేయాలో తెలుసుకోండి. దీనివల్ల మీ హార్మోన్స్‌ బ్యాలెన్స్‌ చెదరకుండా ఉంటుంది.

 పండ్లు, కూరగాయలు తరచుగా తీసుకుంటూ ఉండండి.



 ప్రతిరోజు కొంత సమయం ఎండలో గడపండి. వయసు పెరిగే కొద్దీ హార్మోన్‌ బ్యాలెన్స్‌ లేకపోవడం వల్ల విటమిన్‌ డి లోపం ఏర్పడుతుంది. పాలు, ఆకుకూరలు సూర్యరశ్మి, కాల్షియం లోపం తలెత్తకుండా చూస్తాయి. దీంతో విటమిన్‌ డి పెంపొందుతుంది.

 ప్రతిరోజు నాలుగు వాల్‌నట్స్‌ తీసుకోండి. ఇవి హార్మోన్స్‌ బ్యాలెన్స్‌కు తోడ్పడతాయి.


 డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌

drjanakibadugu@gmail.com 


Updated Date - 2020-08-29T05:30:00+05:30 IST