ప్రజాప్రతినిధుల ప్రయత్నానికి..అధికారుల మోకాలడ్డు

ABN , First Publish Date - 2020-06-05T10:10:07+05:30 IST

మురుగునీరు పోయేందుకు డ్రెయినేజీ నిర్మాణానికి అనుమతి కోసం అధికారులు మీనమేషాలు లెక్క పెడుతున్నారు. దీంతో ఏళ్ల తరబడి సమస్య అలాగే ఉంటున్నది.

ప్రజాప్రతినిధుల ప్రయత్నానికి..అధికారుల మోకాలడ్డు

డ్రెయినేజీ నిర్మాణాన్ని పట్టించుకోని వైనం

మురుగు కారణంగా రైల్వేట్రాక్‌, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

అధికారులు పట్టించుకోవటం లేదు: కార్పొరేటర్‌ నాగండ్ల


ఖమ్మం కార్పొరేషన్‌, జూన్‌4: మురుగునీరు పోయేందుకు డ్రెయినేజీ నిర్మాణానికి అనుమతి కోసం అధికారులు మీనమేషాలు లెక్క పెడుతున్నారు. దీంతో ఏళ్ల తరబడి సమస్య అలాగే ఉంటున్నది. డ్రెయినేజీ నిర్మాణానికి అనుమతి ఇవ్వండంటూ స్థానిక కార్పొరేటర్‌ నాగండ్ల దీపక్‌చౌదరి అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు మాటలతోనే కాలాయాపన చేస్తున్నారు. మురుగునీటితో ప్రజలు నరకం చవిచూస్తున్నా, కేవలం అనుమతి ఇవ్వటంకోసం కాలాయాపన చేయటం విమర్శలకు తావిస్తోంది. నగరంలోని 36వ డివిజన్‌ మామిళ్లగూడెంలో రైల్వేట్రాక్‌ సమీపంలో మురుగు నిలుస్తున్నది. కమాన్‌బజార్‌, వైరారోడ్‌ నుంచి మురుగునీరు ఇక్కడికి చేరుతుంది.


వాస్తవంగా ఈ ప్రాంతం నుండి సదరు మురుగునీరు గోళ్లపాడు ఛానెల్‌లోకి వెళ్లాలి.. అయితే డ్రెయినేజీ నిర్మాణం లేకపోవటంతో మురుగునీరు పెద్దఎత్తున అక్కడ నిలుస్తోంది. దీనివల్ల విపరీతంగా దోమలు వస్తుంటాయి. ఇక వర్షాకాలం వస్తే ఆ మురుగునీరంతా స్థానికంగా ఉంటున్న వారి ఇళ్లలోకి చేరుతోంది. అంతే  కాకుండా మురుగునీరు దీర్ఘకాలంగా నిల్వ ఉండటం వల్ల రైల్వేట్రాక్‌కు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.


అనుమతి కోసం అగచాట్లు

రైల్వేట్రాక్‌ వద్ద మురుగునీరు వెళ్లేలా డ్రెయినేజీ నిర్మాణానికి నగరపాలక సంస్థ డివిజన్‌కు ఇచ్చే సాధారణ నిధులు కేటాయించేందుకు కార్పొరేటర్‌ నాగండ్ల దీపక్‌చౌదరి సిద్ధంగా ఉన్నా. అనుమతి కోసం నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. ఈ నిర్మాణానికి రైల్వే అధికారులు అనుమతి ఇవ్వాలి. కాకపోతే నగర పాలక సంస్థనుంచి అనుమతి కోరితే ఇస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు, కార్పొరేటర్‌ కలెక్టర్‌ను, నగరపాలక కమిషనర్‌ను కలిసినా, ఇంతవరకు స్పందనలేదు.


అధికారులు స్పందించటం లేదు: కార్పొరేటర్‌ నాగండ్ల దీపక్‌ చౌదరి 

ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు పని చేస్తున్నా.. అధికారులు మాత్రం స్పందించటం లేదు. స్వయంగా రైల్వే అధికారులను తీసుకువచ్చి సమస్యను వివరించా. కలెక్టర్‌ను, నగరపాలక సంస్థ కమిషనర్‌ను కలిశా. ట్విట్టర్‌ ద్వారా సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లా. అయినా ఎక్కడవేసిన గొంగడి.. అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారయింది.  

Updated Date - 2020-06-05T10:10:07+05:30 IST