Abn logo
May 25 2020 @ 04:50AM

మద్దతు కొసరే..!

 ధాన్యం క్వింటాలు రూ.2500 ఉంటేనే గిట్టుబాటు

సాగు వ్యయంలో సగం ఆదాయం ఉండాలి

పసుపుకు మద్దతు ప్రకటించాలి

ప్రభుత్వమే కొనుగోలు చేపట్టాలి


కడప, మే 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘రైతు రారాజు.. పది మందికి పట్టెడన్నం పెట్టే అన్నదాత. ఎండకు ఎండినా.. వానకు తడిచినా.. కష్టాలెన్నో భరిస్తూ.. చిందే స్వేదంతో రాళ్ల భూముల్లోనూ రతనాలు పండిస్తూ.. తన శ్రేయస్సే దేశ సౌభాగ్యమని భావించే కల్మషం ఎరుగని కష్టజీవి రైతు. కలసిరాని కాలంతో అలసిపోతున్నాడు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా చితికిపోతూ ఏయేటికాయేడు అప్పుల్లో కూరుకుపోతున్నాడు.


రైతు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే సాగు వ్యయంలో సగానికి పైగా ఆదాయం ఉండేలా మద్దతు ధర నిర్ణయించాలని వ్యవసాయ నిపుణులు స్వామినాథన్‌ ఎప్పుడో కేంద్రానికి నివేదించారు. సాగు ముందే ఏ పంటకు ధర ఎంతో ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో చెబుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ, ధర కమిషన్‌ (సీఏసీపీ) ఆయా పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్రానికి సిఫారసు చేసింది. ధాన్యానికి పెంచిన మద్దతు ధర కొసరే..! అని రైతులు అంటున్నారు. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. 


జిల్లా ప్రధాన జీవనాధారం వ్యవసాయం. తొలికరి వర్షాలు ఆరంభం అవుతున్నాయి. జూన్‌ మొదటి వారం నుంచి ఖరీఫ్‌ మొదలవుతుంది. ఖరీ్‌ఫలో సాగు లక్ష్యం.. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, రుణాల పంపిణీ.. తదితర అంశాలపై వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1,08,614 హెక్టార్లు కాగా.. 1,15,836 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయం శాఖ యంత్రాంగం ప్రణాళిక. ఆ దిశగా రైతులను చైతన్యం చేస్తున్నారు. ఖరీ్‌ఫకు ముందే ఏయే పంటకు ఎంత మద్దతు ధర నిర్ణయించాలో వ్యవసాయ వ్యయం, ధరల కమిషన్‌ (సీఏసీపీ) కేంద్రానికి సిఫారసు చేసింది. 18 పంటలకు మద్దతు ధర పెంచింది. కేంద్ర వ్యవసాయ శాఖ అమోదిస్తే పెంచిన మద్దతు ధర ఈ ఖరీఫ్‌ నుంచే అమలులోకి రానుంది. అయితే.. జిల్లాలో అత్యధికంగా సాగు చేసే వరి, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న పంటలకు పెంచిన మద్దతు ధర ఆశాజనకంగా లేదని రైతులు అంటున్నారు. 


ధాన్యం ధర రూ.2500పైన ఉంటేనే..:

జిల్లాలో కేసీ కాలువ, తెలుగుగంగ కాలువతో పాటు ఆయా సాగునీటి వనరుల కింద వరి పంటను అధికంగా సాగు చేస్తున్నారు. 2020-21 ఖరీ్‌ఫలో 40 వేల హెకార్లలో సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. పెరిగిన ఎరువులు, పురుగు మందుల ధరలు, కూలీ రేట్లు, రవాణా చార్జీలు కలిపి ఎకరా వరి సాగుకు సగటున రూ.35 వేలు ఖర్చు వస్తుందని రైతులు వివరించారు. సగటున 25 క్వింటాళ్లకు మించి దిగుబడి రాదని తెలిపారు. అధిక వర్షాలు వచ్చినా.. పంట చివరి దశలో వానలు లేక నీటి తడులు ఆగిపోయినా.. చీడపీడలు వ్యాపించినా అందులో సగం దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉండదు. సీఏసీపీ సిఫారసు ప్రకారం ప్రస్తుతం ఉన్న ధాన్యం మద్దతు రూ.1815లపై రూ.53లు పెంచి రూ.1,869 ఉండేలా సిఫారసు చేసింది.


స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు మేరకు సాగు వ్యయంలో సగం లాభం ఉండాలి. అంటే.. రైతుల వాస్తవ పెట్టుబడి లెక్కల ప్రకారం ఎకరాకు రూ.35 వేలు వ్యయం చేస్తే.. అందులో సగం లాభం రూ.18 వేలు కలిపి రూ.53 వేలు చేతికి రావాలి. ఈ లెక్కన క్వింటాల్‌కు రూ.2120-2250 మద్దతు ధర ఉండాలి. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు వ్యాపిస్తే నష్టం అంచనాలకు అందనిదే. దీంతో క్వింటాలు రూ.2500లు ఉంటేనే ధాన్యం రైతులకు కాస్త లాభం ఉంటుందని వరి రైతులు పేర్కొంటున్నారు. పత్తి, వేరుశనగ, మొక్కజొన్న పంటలకు కూడా లాభసాటిగా ఉండేలా మద్దతు ధర నిర్ణయించాలని రైతుల విన్నపం. 


పసుపుకు మద్దతు ధర ఉండాలి

రాష్ట్రంలో పసుపు ఎక్కువ సాగు చేస్తున్న జిల్లాలో కడప ఒకటి. 3500 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఏటా ఒక పంట మాత్రమే వస్తుంది. ఎకరాకు సగటున రూ.1.25 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు. 25-30 క్వింటాళ్లకు మించి దిగుబడి రాదని రైతులు పేర్కొంటున్నారు. సాగు వ్యయంలో సగం లాభం రావాలంటే కనీస మద్దతు ధర రూ.6500 నుంచి రూ.7 వేలకు పైగా ఉంటే పసుపు రైతుకు లాభం వస్తుంది. లేదంటే కష్టాలు.. అప్పుల బాధలు తప్పవు.


ప్రస్తుతం మార్కెట్లో నాణ్యతను బట్టి రూ.4500-5500లకు మించి పలకడం లేదు. ప్రభుత్వం రూ.6850లకు కొనుగోలు చేస్తుంది. ఇప్పటి వరకు పసుపుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించడం లేదు. పసుపు రైతుల కష్టాలను కేంద్ర ప్రభుత్వానికి వివరించి పసుపు పంటకు కూడా సాగు వ్యయంలో 50 శాతం లాభం వచ్చేలా మద్దతు ధర నిర్ణయించాలని, మార్కెట్లో అంతకన్నా తక్కువ ధర ఉన్నప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పసుపు రైతులు కోరుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వ పెద్దలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. 


2400 ఇస్తే గాని గిట్టుబాటు కాదు ..చింతకుంట వెంకట సుబ్బయ్య, సరస్వతీపేట, మైదుకూరు 

ఎకరాకు 22 బస్తాలే ధాన్యం వచ్చింది. పంట సాగు, తెగుళ్లకు  ఖర్చు  బాగా పెరిగింది. ప్రభుత్వం మద్దతు ధర పెంచుతుందని అలాగే పెట్టుకున్నాం, అయితే ఇప్పుడు పెంచిన ధరతో ఏమాత్రం సరిపోదు. కనీసం రూ. 2300లతో కొనుగోలు చేస్తేగాని కాస్త అయినా మిగలదు. 


వ్యవసాయ వ్యయం, ధరల కమిషన్‌ సిఫారసు మేరకు ప్రధాన పంటల మద్దతు ధర వివరాలు రూ.లలో

పంటలు పాత ధర కొత్త ధర పెరుగుదల

ధాన్యం (సాధారణ) 1,815 1,868 53

ధాన్యం (ఏ-గ్రేడు) 1,835 1,888 53

పత్తి (మీడియం) 5,255 5,515 260

పత్తి (మేలు రకం) 5,550 5,825 275

మొక్కజొన్న 1,840 1,890 50

వేరుశనగ 5,090 5,275 185


Advertisement
Advertisement
Advertisement