Advertisement
Advertisement
Abn logo
Advertisement

దృఢమైన ఎముకల కోసం...

ఆంధ్రజ్యోతి(26-05-2021)

మనం శరీరంతో చేసే ప్రతి పనికీ ఎముకలే ఆధారం. ఏ కారణం వల్లనైనా ఎముకలు బలహీనపడితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఎముకల దారుఢ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యకరమైన, పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఎముకలను దృఢంగా ఉంచుకోవచ్చు.


ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం సమృద్ధిగా ఉన్న పదార్థాలు తినాలనే విషయం చాలామందికి తెలిసిందే. పాలు, పెరుగు లాంటి డెయిరీ ఉత్పత్తులు, పాలకూర, నారింజ, నువ్వులు, గుడ్లు, సోయా, క్యాబేజీ తదితరాల ద్వారా తగినంత కాల్షియంను సమృద్ధిగా శరీరానికి అందించవచ్చు.

ఆరోగ్యవంతమైన ఎముకలకు ప్రోటీన్లు ఎంతో ముఖ్యం. ప్రోటీన్ల లోపం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. గుడ్లు, చికెన్‌, సోయా, పన్నీర్‌, బాదం, వేరు శనగ, పప్పు దినుసుల ద్వారా ప్రోటీన్‌ పుష్కలంగా లభిస్తుంది.

ఎముకల ఆరోగ్యంలో విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. మనం తీసుకొనే ఆహారంలో ఉండే కాల్షియంను శరీరం చక్కగా గ్రహించడానికీ, ఎముకల్లో ఉన్న కాల్షియం తగ్గిపోకుండా నివారించడానికీ ‘విటమిన్‌-డి’, ‘విటమిన్‌-కె’ దోహదపడతాయి. ‘విటమిన్‌- డి’... చేపలు, లివర్‌, ఛీజ్‌ తదితరాల్లో లభిస్తుంది. లివర్‌, గుడ్లు, కూరగాయలు, ఆకు కూరలు, కివీ, క్యాబేజీ, బచ్చలి, గ్రీన్‌ పీస్‌ ద్వారా విటమిన్‌-కె అందుతుంది. 

రోజువారీ ఆహారంలో ‘విటమిన్‌ సి’ని భాగంగా చేసుకోవాలి. ఇది కూరగాయలు, పండ్ల ద్వారా లభిస్తుంది. ఎముకల నిర్మాణానికి దోహదపడే కణాల వృద్ధికి ‘విటమిన్‌ సి’ కీలకం. అలాగే ఆ కణజాలం దెబ్బతినకుండా దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు దోహదపడతాయి. 

ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటుంది. ఒమెగా-3 ప్రధానంగా ఆహారం ద్వారానే లభ్యమవుతుంది. ఎముకల ఎదుగుదలకూ, పరిరక్షణకూ సాయపడే ఒమెగా-3 చేపల్లో ఎక్కువగా లభిస్తుంది. అలాగే అవిసె గింజలు, గుమ్మడి, ఆక్రోట్‌, తాజా ఆకుకూరలు తదితరాల ద్వారా కూడా దీన్ని పొందవచ్చు.

Advertisement
Advertisement