ఇసుక తవ్వకాలకు.. రాజకీయ గ్రహణం!

ABN , First Publish Date - 2021-06-25T05:13:43+05:30 IST

ప్రభుత్వ విధానాలతో ఇసుక తవ్వకాలకు రాజకీయ గ్రహణం వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలను ప్రభుత్వం జేపీ గ్రూప్‌ సంస్థకు అప్పగించింది. దీంతో జిల్లాలో ఇసుక రీచ్‌ల వద్ద కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. గతంలో టీడీపీ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ప్రభుత్వ రంగసంస్థ ఏపీఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు, రీచ్‌ల నిర్వహణ చేపట్టింది. తాజాగా జేపీ సంస్థకు జిల్లాలో 29 ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను అప్పగించడంతో చాలామంది స్థానికులకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో పాటు స్థానిక అధికార పార్టీ నేతల ప్రమేయానికి చెక్‌ పడింది.

ఇసుక తవ్వకాలకు.. రాజకీయ గ్రహణం!

- స్థానిక నేతలకు జేపీ గ్రూప్‌ మొండిచేయి

- రీచ్‌ల నిర్వహణకు అడ్డు తగులుతున్న నాయకులు

- ఉపాధి కోల్పోయామని యువకుల ఆందోళన

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ విధానాలతో ఇసుక తవ్వకాలకు రాజకీయ గ్రహణం వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలను ప్రభుత్వం జేపీ గ్రూప్‌ సంస్థకు అప్పగించింది. దీంతో జిల్లాలో ఇసుక రీచ్‌ల వద్ద కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. గతంలో టీడీపీ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ప్రభుత్వ రంగసంస్థ ఏపీఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు, రీచ్‌ల నిర్వహణ చేపట్టింది. తాజాగా జేపీ సంస్థకు జిల్లాలో 29 ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను అప్పగించడంతో చాలామంది స్థానికులకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో పాటు  స్థానిక అధికార పార్టీ నేతల ప్రమేయానికి చెక్‌ పడింది. గతంలో ఏపీఎండీసీ అధికారులను నయానో భయానో లొంగదీసుకొని స్థానిక నాయకులు రీచ్‌లు నిర్వహించేవారు. ప్రస్తుతం జేపీ గ్రూప్‌ ప్రతినిధులే స్వయంగా ఇసుక రీచ్‌ నిర్వహిస్తామని చెప్పడంతో అధికార పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో రీచ్‌ల వద్ద వివాదాలు చెలరేగుతున్నాయి. వాస్తవానికి జేపీ గ్రూప్‌ జిల్లాలో రెండు వారాల కిందటే రీచ్‌లు ప్రారంభించాల్సి ఉండగా, స్థానిక వైసీపీ నేతలు అడ్డు చెబుతున్నట్టు తెలుస్తోంది. దీంతో కేవలం 9 రీచ్‌లు ప్రారంభించారు. లింగపేట, తిమడాం, పోతయ్యవలస, మడపాం, యరగాంలో మూడుచోట్ల, బుచ్చిపేట, గార, నారాయణపురం, దూసి రీచ్‌లు మాత్రమే పనిచేస్తున్నాయి.  వివాదాల కారణంగా మిగిలిన రీచ్‌ల్లో తవ్వకాలు ప్రారంభించలేదు. 


 సిబ్బంది తొలగింపు...

ఇసుక రీచ్‌ల్లో గతంలో కాంట్రాక్ట్‌ సంస్థ స్థానికంగా యువతకు ఉపాధి కల్పించింది. ప్రతి రీచ్‌ వద్ద పది మంది వరకు ఔట్‌సోర్సింగ్‌పై సిబ్బందిని నియమించింది. ప్రస్తుతం జేపీ గ్రూప్‌ వీరిని తొలగించింది. రాయలసీమ ప్రాంతం నుంచి కొత్తవారిని రప్పించి ఉద్యోగాల్లో నియమించింది. అంతేకాకుండా స్థానికంగా ట్రాక్టర్లు, వ్యానుల ఆపరేటర్లకు లోడ్‌లు ఇవ్వకుండా ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫోర్టు కాంట్రాక్టర్‌ను నియమించి ఇసుక రవాణా చేస్తోంది. దీంతో తాము ఉపాధి కోల్పోయామంటూ స్థానిక యువకులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు స్థానిక నేతల అక్రమ వ్యాపార లావాదేవీలకు బ్రేక్‌ పడడంతో వారు సతమతమవుతున్నారు. దీంతో కొంతమంది నాయకులు స్థానిక ఎమ్మెల్యేలను ఆశ్రయించి తమ గోడు వినిపించినట్లు తెలిసింది. 


 ఎప్పటికి ప్రారంభమయ్యేనో?

జూలై మొదటి వారం నుంచి వర్షాలు విరివిగా కురవనున్నాయి. దీంతో నదుల్లో నీటి ప్రవాహం పెరిగి ఇసుక తవ్వకాలకు వీలుండదు. ఈ నేపథ్యంలో జిల్లాలో జేపీ గ్రూప్‌ ద్వారా 29 ఇసుక ర్యాంపులలో ఇప్పటి నుంచే సేకరించి యార్డుల్లో నిల్వ చేయాలని అధికారులు భావించారు. స్థానిక వివాదాల కారణంగా లక్ష్యాలను చేరుకొనే పరిస్థితులు కానరావడం లేదు. పురుషోత్తపురం, హిరమండలం, తునివాడ, కరజాడ, ఆకులతంపర, అంధవరం, కల్లేపల్లి రీచ్‌ల వద్ద నీరు ప్రవహిస్తుండడంతో తవ్వకాలు ప్రారంభించలేదు. కందివలస రీచ్‌లో అసలు ఇసుక నిల్వలే లేవు. వారం రోజుల్లో రీచ్‌లన్నీ ప్రారంభించి.. ప్రభుత్వ, ప్రైవేటు అవసరాలకు ఇసుక సేకరణ పూర్తిచేయాలని ఇటీవల జేపీ గ్రూప్‌, గనుల శాఖ అధికారులతో కలెక్టర్‌ నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేపీ గ్రూప్‌ రీచ్‌లు ఎప్పటికి ప్రారంభిస్తుందో? స్థానిక అవసరాలకు సరిపడా ఇసుక నిల్వలు అందించగలదో? లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

Updated Date - 2021-06-25T05:13:43+05:30 IST