Abn logo
Jul 22 2021 @ 02:18AM

కూల్చివేతలపై ప్రశ్నించినందుకు..కక్షకట్టి కూల్చేశారు

సర్కారును నిలదీసిన మాజీ వలంటీరు ఇల్లు నేలమట్టం

తాడేపల్లిలో అర్ధరాత్రి బీభత్సం

ముందురోజు తేదీతో నోటీసు

తర్వాత కొన్ని గంటలకే కూల్చివేత

సీఎం ఇంటికి భద్రత పేరిట 

కాలనీలోని ఇళ్ల తొలగింపు

ప్రశ్నించిన శివశ్రీకి వేధింపులు

పవన్‌ను కలిశాక మరిన్ని కష్టాలు


తాడేపల్లి టౌన్‌, జూలై21: ముఖ్యమంత్రి నివాసానికి భద్రత పేరుతో ఇళ్ల కూల్చివేతలను ప్రశ్నించి, అర్హులకూ పునరావాసం కల్పించకపోవడాన్ని నిలదీసిన మాజీ వలంటీరు శివశ్రీ ఇంటినీ అధికారులు కూల్చివేశారు. ముందురోజు తేదీతో నోటీసులు అంటించి... ఆ తర్వాత కొన్ని గంటల్లోనే పొక్లెయిన్‌లతో రంగంలోకి దిగారు. కూల్చివేత ఆపాలని శివశ్రీ కుటుంబం ఎంతగా వేడుకొన్నా బలవంతంగా ఇంట్లోని వారినీ, వారి సామాన్లను బయటకు లాగేశారు.  తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసం చుట్టూ ఉన్న నివాసాలను భద్రతా కారణాలతో తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ‘మా కాలనీని కూల్చేస్తుంటే వలంటీరుగా ఉండి ఏమీ చేయలేకపోతున్నాను’ అని వడియం శివశ్రీ ఇటీవల తన వలంటీరు పదవికి రాజీనామా చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిసి కాలనీ కష్టాలను వివరించారు. ఆ తర్వాత ఆమెకు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. 


ఉదయం అరెస్టు..

తాడేపల్లి అమరారెడ్డి కాలనీవాసులతో గతంలో స్థానిక ఎమ్మెల్యేతోపాటు, అధికార పార్టీ నాయకులు సమావేశం నిర్వహించి అందరికీ ప్రత్యామ్నాయ స్థలాలను ఇస్తాం..ఇళ్ల నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారులు మాత్రం కేవలం 321 పేర్లు నమోదు చేసుకుని వారిలో 277 మందిని అర్హులుగా గుర్తించారు. మిగతా 44 మందిని వివిధ కారణాలతో అనర్హులుగా ప్రకటించడాన్ని వలంటీరు శివశ్రీ వ్యతిరేకించారు. అర్హత ఉన్నా ఆమె సొంత అన్నకు కూడా స్థలం రాకపోవడం మరింత కుంగదీయడంతో వలంటీరు ఉద్యోగానికి రాజీనామా చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను ఈ నెల 7వ తేదీన కలిసి అమరారెడ్డి కాలనీవాసుల సమస్యను వివరించారు. అప్పటినుంచి వేధింపులు మొదలయ్యాయి. గత సోమవారం సాయంత్రం తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌కి శివశ్రీని పిలిపించారు. సీఎం ఇల్లు ముట్టడి చేశావంటూ కేసులు పెడతామని  బెదిరించి పంపారు. బుధవారం ఉదయం మరోసారి స్టేషన్‌కు పిలిచి శివశ్రీతోపాటు మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. కాలనీలో పలగాని శివాజీ అనే వ్యక్తిపై శివశ్రీ దాడిచేసినట్టు కేసు పెట్టారు. అరెస్టు వార్త తెలుసుకొని ప్రతిపక్ష నాయకులు, మహిళా నాయకులు స్టేషన్‌ వద్దకు చేరుకొని.. ఆందోళనకు దిగడంతో అరెస్టు చేసినవారిని విడుదల చేశారు. 


సాయంత్రం నోటీసులు.. 

సాయంత్రం ఐదు గంటల సమయంలో శివశ్రీ ఇంటికి అధికారులు వచ్చారు. ఇల్లు ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వబోయారు.  ఆ నోటీసులో 20వ తేదీ (మంగళవారం) ఉండటం గమనించి దాన్ని తీసుకోవడానికి వారు నిరాకరించారు. సాధారణంగా నోటీసు అందిన 24 గంటల లోపు ఇళ్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే, పాత తేదీతో అప్పటికప్పుడు నోటీసు ఇచ్చి ఖాళీ చేయమనటం ఏమిటంటూ శివశ్రీ కుటుంబ సభ్యులు గట్టిగా ప్రతిఘటించారు. దీంతో నోటీసును గోడకు అతికించి అధికారులు వెళ్లిపోయారు. 


అర్ధరాత్రి కూల్చివేత.. 

రాత్రి 10 గంటల సమయంలో అధికారులు తిరిగి వచ్చారు. అధికారులే స్వయంగా ట్రాక్టర్‌ను పిలిపించి ఇంటిలోని సామన్లు ఎక్కిస్తుండగా.. శివశ్రీ అడ్డుకొన్నారు. ఇంటి జోలికొస్తే ఆత్మహత్య చేసుకొంటానని ఆమె ఒకదశలో బెదిరించారు. ఇంట్లోని వారిని పోలీసులు లాక్కువస్తుండగా శివశ్రీ తల్లి స్పృహ తప్పారు. పొక్లెయినర్‌కు అడ్డుగా పడుకొన్న శివశ్రీ సోదరుడు వడిగిన నానిని పోలీసులు లాగివేశారు. దీంతో నాని ఇంట్లోకి వెళ్లి ఉరేసుకునే ప్రయత్నం చేయగా.. శివశ్రీ అడ్డుకొన్నారు. అందరినీ దూరంగా పంపి.. అర్ధరాత్రి 11 గంటలకు ఇన్‌చార్జి కమిషనర్‌ హేమమాలిని సమక్షంలో శివశ్రీ ఇంటిని అధికారులు కూల్చివేశారు.