స్వచ్ఛమైన తేనె కోసం... బీ కీపర్‌గా మారి...

ABN , First Publish Date - 2022-05-18T06:39:07+05:30 IST

నాకు చిన్నప్పటి నుంచీ నీళ్లలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగడం అలవాటు. అదే అలవాటు ఆస్ట్రేలియా, అమెరికా వెళ్లినప్పుడు కూడా కొనసాగించాను.

స్వచ్ఛమైన తేనె కోసం... బీ కీపర్‌గా మారి...

తేనె గురించి మనకున్న అవగాహన పరిమితం. బజార్లో దొరికే తేనెలన్నీ తీయగానే ఉంటాయి కాబట్టి అవన్నీ స్వచ్ఛమైనవే అనుకుంటాం. కానీ స్వచ్ఛమైన తేనెను రుచి చూస్తూ పెరిగిన అనూష జూకూరి కల్తీ తేనెలతో సరిపెట్టుకోలేకపోయింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, తేనెటీగల పెంపకంలోకి అడుగుపెట్టిన ఆమె నువ్వులు, వాము, తులసి.. ఇలా ఆరు రకాల తేనెలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ బీ కీపర్‌ నవ్యతో పంచుకున్న తేనె కబుర్లు ఇవి.


నాకు చిన్నప్పటి నుంచీ నీళ్లలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగడం అలవాటు. అదే అలవాటు ఆస్ట్రేలియా, అమెరికా వెళ్లినప్పుడు కూడా కొనసాగించాను. మన దేశంతో పోలిస్తే విదేశాల్లో స్వచ్ఛమైన తేనె దొరుకుతుంది. పైగా అక్కడి తేనెలు ఎన్నో రకాల ఫ్లేవర్లలో ఉంటాయి. కానీ మన దేశంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ఎన్నో రకాల తేనెల బ్రాండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నా, ఆ తేనెను సేకరించిన పూల గురించిన సమాచారం ఉండదు. పైగా అవన్నీ ఎంతో కొంత కల్తీవే అయి ఉంటూ ఉంటాయి. తేనెతో చిన్నప్పటి నుంచీ నాకున్న అనుబంధంకొద్దీ స్వచ్ఛమైన తేనె మన దేశంలో కరువైపోతుందనే బాధ నన్ను తొలిచేయడం మొదలుపెట్టింది. 2014లో ఆస్ట్రేలియా వెళ్లినప్పుడూ, 2016లో అమెరికా వెళ్లినప్పుడూ అక్కడ దొరికే స్వచ్ఛమైన తేనెలను రుచి చూసిన తర్వాత, మన ప్రాంతంలో కూడా అదే తరహా స్వచ్ఛమైన తేనెలను అందుబాటులోకి తీసుకురావాలనే బలమైన సంకల్పం కలిగింది. అలా 2019లో ఇండియాకు తిరిగొచ్చిన నేను, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు వృత్తికి స్వస్థి చెప్పి తేనెటీగల పెంపకంలోకి అడుగు పెట్టాను. 


 మొదలైందిలా...

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌లో తేనెటీగల పెంపకంలో దంపతులిద్దరం ‘అపికల్చర్‌’లో శిక్షణ తీసుకున్నాం. ఆ శిక్షణ సమయంలో తేనెటీగల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. తేనెటీగల పెంపకంతో సకల సద్గుణాలూ కలిగిన తేనెను పొందడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకూ ఆస్కారముంది. అలాగే సేకరించే పూల మకరందం ద్వారా ఆయా మొక్కల ఔషధ గుణాలు కూడా తేనెలోకి చేరతాయి. కాబట్టి తేనెతో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందే వీలుందని తెలుసుకున్నాను. అయితే అందుకోసం పురుగు మందులు వాడని పంటలనే లక్ష్యంగా ఎంచుకున్నాను. అలా కేవలం ఐదు పెట్టెలతో, కొన్ని తేనెటీగలతో నేను తేనెటీగల పెంపకంలోకి అడుగు పెట్టాను. క్రమేపీ పెట్టెల సంఖ్యను పెంచుకుంటూ, నిజామాబాద్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, వికారాబాద్‌, ములుగు అటవీ ప్రాంతాల్లో మొత్తం 1500 పెట్టెలతో తేనెను సేకరించే స్థాయికి ఎదిగాను. ప్రస్తుతం నువ్వులు, పొద్దుతిరుగుడు, మామిడి, వాము, నేరేడు, తులసి, అటవీ ప్రాంతాల్లోని ఔషధ మొక్కల తేనె... ఇలా ఆరు రకాల రుచులను కలిగిన తేనెను తయారుచేస్తున్నాను. వీటితో పాటు హనీ జామ్‌, హనీ జెల్లీ, హనీ చాక్లెట్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాను. వీటి తయారీలో చక్కెరకు బదులుగా పూర్తిగా తేనెనే వాడడం వల్ల పిల్లలకు తేనె సుగుణాలు దక్కుతాయి.  తేనె అద్భుతమైన ప్రిజర్వేటివ్‌ కాబట్టి ఈ ఉత్పత్తుల తయారీలో నేను అదనంగా ఎటువంటి ప్రిజర్వేటివ్స్‌నూ ఉపయోగించలేదు. ఈ ఉత్పత్తులు అమేజాన్‌తో పాటు బీఫ్రెష్‌.కామ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 

 

తేనెటీగలూ మనలాంటివే...

తేనెటీగల పెంపకమంటే ఎవరైనా వెనకడుగు వేస్తారు. అవి కుడతాయనే భయమే ఇందుకు కారణం. కానీ మెలకువలు తెలిస్తే, వీటి పెంపకం ఎంతో తేలిక. తేనె సేకరించే సమయంలో కేవలం హ్యాట్‌, గ్లౌజులు, శరీరమంతా కప్పి ఉంచే దుస్తులు ధరిస్తే సరిపోతుంది. ఇది శాస్త్రీయంగా అనుమతి పొందిన విధానం. తేనెతుట్టెను దులిపి, పిండి, తేనె సేకరించే మొరటు విధానాన్ని ఇక్కడ అమలు చేయం. తేనె సేకరణ కోసం హనీ ఎక్స్‌ట్రాక్టర్‌ అనే పరికరాన్ని ఉపయోగిస్తాం. కాబట్టి తేనెటీగలకు ఎలాంటి హానీ కలగదు. తేనె సేకరించిన తర్వాత, పెట్టెల్లోని తేనెటీగలు తిరిగి ఫ్రేములన్నింటినీ తేనెతో నింపే పనిలో పడిపోతాయి. ఇలా ఒక్కొక పెట్టె నుంచి నెల రోజుల్లో 3 నుంచి 7 కిలోల తేనెను సేకరించవచ్చు. ఈ క్రమంలో తేనెలు వయసుమళ్లి చనిపోతూ ఉంటాయి. కొత్త తేనెటీగలు నిరంతరంగా పుడుతూ ఉంటాయి. కాబట్టి తేనెటీగల సంఖ్య తరిగిపోయే పరిస్థితి ఉండదు. అలాగే తేనెటీగలకూ మనకూ ఎంతో సారూప్యం ఉంటుంది. మనకులాగే తేనెటీగలు కూడా ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండిపోతే, మానసిక కుంగుబాటుకు లోనవుతాయి. అలాగే మనకులాగే అవి జబ్బుపడుతూ ఉంటాయి. ఈ విషయాలన్నీ ప్రారంభంలో అర్థం కాకపోయినా, క్రమేపీ తెలుసుకున్నాను. దాంతో పెట్టెను చూడగానే తేనెటీగల మానసిక పరిస్థితిని గ్రహించగలుగుతున్నాను. మనం ఎలాగైతే వేర్వేరు పదార్థాలను తినడానికి ఇష్టపడతామో అవి కూడా వేర్వేరు పూల మకరందాలను సేకరించడానికి ఆసక్తి కనబరుస్తాయి. కాబట్టి పెట్టెలను తరచూ ప్రదేశాలను మారుస్తూ, అవి చురుగ్గా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటూ ఉంటాను. 


సవాళ్లూ ఉన్నాయి...

పెట్టెలను వేర్వేరు ప్రదేశాలకు మార్చడానికీ, తేనెలను సేకరించడానికీ వర్కర్లు అవసరం అవుతారు. కానీ తేనెటీగలు కుడతాయనే భయంతో ఈ పని చేయడానికి ఎవరూ ముందుకు ముందుకు వచ్చేవాళ్లు కాదు. దాంతో మొదట్లో ఇద్దరు పనివాళ్లను నియమించుకుని, వాళ్లకు శిక్షణ ఇచ్చాం. శ్రీశైలం అడవుల్లోని గిరిజనులకు కూడా నేర్పించి, ఈ పనిలో నియమించుకున్నాం. ఇలా వారికి జీవనభృతిని కల్పించాం. ఒకవేళ ఈ పని నచ్చి, స్వతంత్రంగా ఈ వ్యాపారం చేయాలనుకునేవాళ్లకు పెట్టెలనూ, తేనెటీగలను, అవసరమైన పరికరాలను కూడా విక్రయిస్తాం. 


తేనెలను ఔషఽధాలుగా...

మనకెన్నో ఔషధ మొక్కలు, మూలికలు అందుబాటులో ఉన్నాయి. ఆ మొక్కల దగ్గర పెట్టెలను ఉంచి, ఔషధగుణాలు కలిగిన తేనెను సేకరించాలనే ఆలోచన ఉంది. లెమన్‌ హనీ, స్వీట్‌ ఆరెంజ్‌, దానిమ్మ... వీటన్నిటి నుంచి కూడా తేనెను సేకరించాలని ఉంది. కానీ పురుగుమందుల వాడకం ఎక్కువ. కాబట్టి వాటిని ఉపయోగించని పంటల కోసం అన్వేషిస్తున్నాను. అలాగే సాధారణంగా సౌందర్య సాధనాల తయారీలో ఎక్కువగా పెట్రోలియం జెల్లీని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ తేనెపుట్టు వ్యాక్స్‌, పగుళ్లను నివారించే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ వ్యాక్స్‌తో క్రీమ్స్‌, బాడీ లోషన్లు, తయారుచేయాలనే ఆలోచన ఉంది. అలాగే తేనెటీగల ఉప ఉత్పత్తులైన రాయల్‌ జెల్లీ, ప్రొపోలిస్‌, వెనమ్‌..ఇవన్నీ పలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. రాణి ఈగకు అవసరమైన ఆహారాన్ని తేనెటీగలు ఉత్పత్తి చేస్తాయి. ఆ ఆహారమే రాయల్‌ జెల్లీ. దీంతో యాంటీ ఏజింగ్‌ క్రీమ్స్‌ తయారుచేసుకోవచ్చు. చలికాలం వెచ్చదనం కోసం తేనెటీగలు చెట్ల బెరడు నుంచి ప్రొపొలిస్‌ అనే పదార్థాన్ని తెచ్చుకుంటాయి. దాంతో శరీరం మీద పల్చని పొరలా తయారుచేసుకోవడంతో పాటు ఫ్రేమ్‌లన్నిటినీ అతికించుకుంటాయి. ఈ గమ్మీ ప్రొడక్ట్‌తో వ్యాధినిరోఽధకశక్తిని పెంచుకోవచ్చు. దీనికి ఉండే యాంటీ ఫంగల్‌, యాంటీ మైక్రోబియన్‌ గుణాలతో తత్సంబంధమైన రుగ్మతలను నయం చేసుకోవచ్చు. తేనెటీగల కాటులో ఉండే సూక్ష్మ పరిమాణాల్లోని విషానికి కూడా యాంటీ ఏజింగ్‌ గుణాలుంటాయి. అలాగే బీ వెనమ్‌తో పక్షవాతం, ఆర్థ్రయిటిస్‌ మొదలైన రుగ్మతల చికిత్సలకు ఉపయోగించుకోవచ్చు. 

ఫ గోగుమళ్ల కవిత

ఫొటోలు: లవకుమార్‌.


మాది సూర్యాపేట దగ్గరున్న మర్రికుంట. మిర్యాలగూడాలో చదువు కొనసాగించాను. మా వారు సుమన్‌, నేనూ కలిసి తేనెటీగల పెంపకాన్ని నేర్చుకున్నప్పటికీ, నేను పూర్తిగా తేనెటీగల పెంపకానికి పరిమితమైపోతే, మా వారు సాఫ్ట్‌వేర్‌ వృత్తిని కొనసాగిస్తూనే, ఈ వ్యాపారంలో నాకు సహాయపడుతున్నారు. మాకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం మేం హైదరాబాద్‌లో స్థిరపడ్డాం.

Updated Date - 2022-05-18T06:39:07+05:30 IST