అరవై నిండిన ఖైదీలకు ‌ వృద్ధాశ్రమ జైలు

ABN , First Publish Date - 2021-07-23T09:33:02+05:30 IST

నేరం చేస్తే ఎంతటి వారినైనా శిక్షించవలసిందే. కాని నేరం, అభియోగంగా ఉన్న స్థాయి నుంచి శిక్షకు గురయ్యేవరకు ఆ వ్యక్తి నిరపరాధే....

అరవై నిండిన ఖైదీలకు ‌ వృద్ధాశ్రమ జైలు

నేరం చేస్తే ఎంతటి వారినైనా శిక్షించవలసిందే. కాని నేరం, అభియోగంగా ఉన్న స్థాయి నుంచి శిక్షకు గురయ్యేవరకు ఆ వ్యక్తి నిరపరాధే. మరి అలాంటి వ్యక్తులు జైళ్ళలో విచారణ ఖైదీలుగా, అందునా వృద్ధులుగా మరణించటం మన న్యాయవ్యవస్ధకే సిగ్గుచేటు. ‘వందమంది నేరస్థులు శిక్ష నుంచి తప్పించుకున్నా ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అని చెప్పే మన న్యాయవ్యవస్థ మౌలిక సూత్రానికి ఇది విరుద్ధం. 


‘చట్టం గురించి తెలియకపోవడం న్యాయారోపణకు సమాధానం కాదు, చట్టరీత్యా నేరం చేసిన వ్యక్తి చట్టం గురించి తెలియదంటూ వాదించి చేసి శిక్ష నుంచి తప్పించుకోలేడు.’ అనేది న్యాయవ్యవస్ధలోని మరో మౌలిక సూత్రం, మరి జైళ్ళలో విచారణ ఖైదీలుగా వున్న వృద్ధులపై ఎటువంటి అభియోగాలు మోపకుండానే, శిక్షలు వేయకుండానే వారు మరణించటానికి ఎవరు కారణం? న్యాయవ్యవస్థే కదా! మరి ఆ వ్యవస్ధను ఎవరు శిక్షించాలి? చట్టం గురించి నాకు తెలియదు అని వాదించి ‘న్యాయవ్యవస్ధ’ శిక్ష నుంచి తప్పించుకోవడం ఏమిటి ? పౌరులకు ఒక న్యాయం, న్యాయవ్యవస్ధకు ఒక న్యాయమా? న్యాయవ్యవస్ధకు ఒక ‘అప్రకటిత చట్టం’ పౌరులకు ఒక ‘ప్రకటిత’ చట్టమా? చట్టం ముందు అందరూ సమానమే అనే మన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కు ఇది విరుద్ధం.


వృద్ధులను సుదీర్ఘకాలం విచారణ ఖైదీలుగా జైళ్ళలో ఉంచి వారికి కల్పించిన బెయిల్‌ హక్కును నిరాకరించటం చట్టాలు వారికి వేసే మొదటి శిక్ష. ఆ శిక్ష వల్ల నేర నిరూపణ కాకుండానే ఆ వృద్ధ ఖైదీలు ఆనారోగ్యానికి గురై సరైన వైద్యం అందక మరణించటం వారికి చట్టాలు వేసిన రెండవ శిక్ష. ఒక నేరానికి ఒకే శిక్ష విధించాలి అని చెప్పే రాజ్యాంగం ఆర్టికల్‌ 20 కి ఇది విరుద్ధం. అలానే జైళ్ళలో విచారణ ఖైదీలుగా ఉన్న వృద్ధులు సరైన వైద్యం అందక మరణించడమంటే ఆర్టికల్‌ 21 ప్రసాదించిన జీవించే హక్కును కాలరాయడమే! ఆర్టికల్‌ 41 వృద్ధులకు, ఆశక్తులకు తగు సహాయం చేయమని చెబుతోంది. అలాంటప్పుడు వృద్ధులు జైళ్ళలో విచారణ ఖైదీలుగా మరణించడం చట్టాలు చేసిన హాత్యే అవుతుంది.


60 సంవత్సరాలు నిండిన వృద్దులకు బెయిల్‌ ఇవ్వటం తప్పనిసరి చేస్తూ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 437 సవరించాలి. ప్రత్యేక పరిస్థితులలో బెయిల్‌ ఇవ్వలేకపోతే వారిని ‘వృద్ధాశ్రమ జైళ్ళ’కు పంపేటట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చట్టం చేయాలి. లేని పక్షంలో జైళ్ళలో విచారణ ఖైదీలుగా ఉన్న వృద్ధుల మరణాలు అంతర్జాతీయ సమాజం ముందు మన న్యాయవ్యవస్థను తలదించుకునేలా చేస్తాయి. 

పిల్లి ప్రసన్నకుమార్‌ 

పిడుగురాళ్ళ

Updated Date - 2021-07-23T09:33:02+05:30 IST