పింఛన్‌ కోసం

ABN , First Publish Date - 2022-01-17T05:48:12+05:30 IST

కొడుకు మానసిక వికలాంగుడు.

పింఛన్‌ కోసం

చిటారు కొమ్మపై నిరసన

కొడుకు మానసిక వికలాంగుడు. రెండేళ్లయినా అధికారులు పింఛన్‌ ఇవ్వడం లేదు. దీంతో ఆ తండ్రి  వేప చెట్టు చిటారుకొమ్మ పైకి ఎక్కి  నిరసన ప్రకటించారు.  ఈ ఘటన  చాగలమర్రిలో ఆదివారం జరిగింది. చాగలమర్రిలోని ముత్యాలపాడు బస్టాండు సమీపంలో నివసిస్తున్న అమీర్‌బాషాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు, కుమారుడికి పెళ్లిళ్లయ్యాయి.   అమీర్‌బాషా భార్య 13 ఏళ్ల క్రితం మృతి చెందింది. చిన్న కుమారుడు సద్దాం మానసిక వికలాంగుడు. కొడుక్కి పింఛన్‌ మంజూరు చేయమని అమీర్‌బాషా దరఖాస్తు చేసుకున్నాడు. అయినా అధికారులు స్పందించలేదు. దీంతో ఆయన విసిగిపోయాడు. ఇంటి దగ్గర ఉన్న 100 అడుగుల వేప చెట్టు ఎక్కాడు. ఈ విషయం   తెలుసుకున్న ఎస్‌ఐ మారుతి, పోలీసులు అక్కడికి వచ్చారు. ఎస్‌ఐ స్వయంగా చెట్టుపైకి ఎక్కి అమీర్‌బాషాతో మాట్లాడి సమస్యను  తెలుసుకున్నారు. తన కుమారుడికి సదరం సర్టిఫికెట్‌ ఇవ్వాలని పలుమార్లు  వైద్యశాల చుట్టూ తిరిగినా ఇవ్వలేదని వాపోయారు. విషయం తెలుసుకొని సమస్యను పరిష్కరిస్తామని ఎస్‌ఐ హామీ ఇచ్చి అమీర్‌బాషా చెట్టు దిగేలా చూశారు. అనంతరం ఎస్‌ఐ మాట్లాడుతూ సద్దాంకు పింఛన్‌ ఇచ్చే విషయం సంబంధిత అధికారులకు తెలియజేస్తామని అన్నారు. ఎంపీడీవో షేక్‌. షంషాద్‌బానును వివరణ కోరగా..  ఆధార్‌, ఇతర వివరాలతో సదరం సర్టిఫికెట్‌ ఉంటే వెంటనే పింఛన్‌ వచ్చేలా చేస్తామని అన్నారు.  
                                                            - చాగలమర్రి

Updated Date - 2022-01-17T05:48:12+05:30 IST