‘పెట్టుబడి’ బతకాలంటే, ‘సంక్షేమం’ సాగాలి!

ABN , First Publish Date - 2022-08-20T05:57:17+05:30 IST

దేశస్వాతంత్ర్యం కొరకు పోరాడుతున్న సందర్భంలో మహాత్మాగాంధీ 1918లో తన సహచరులకు వ్రాసిన ఒక లేఖలో..

‘పెట్టుబడి’ బతకాలంటే, ‘సంక్షేమం’ సాగాలి!

దేశస్వాతంత్ర్యం కొరకు పోరాడుతున్న సందర్భంలో మహాత్మాగాంధీ 1918లో తన సహచరులకు వ్రాసిన ఒక లేఖలో, ప్రజలు ఆర్థిక, విద్యా, వైద్యపరమైన అవకాశాలు, అవసరాలు ఎలాంటి అవరోధాలు లేకుండా పొందగలిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యమని అన్నారు. దేశంలోని దాదాపు 138 కోట్ల ప్రజలందరూ జీఎస్టీ రూపంలో ప్రతి సంవత్సరం 30 లక్షల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ఈ డబ్బు ఖర్చుచేసి దేశ పెట్టుబడిదారుల, పారిశ్రామిక, ఇతర రంగాల అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాలను సమకూర్చడం జరుగుతున్నది. కుబేరులంతా ఎదుగుతున్నది దేశ ప్రజలంతా చెల్లించిన పన్నుల ద్వారానే.


పేదల సంక్షేమ పథకాలపై చేసే ఖర్చు మీదనే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి వుంటుంది. 1930వ దశాబ్దంలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడి ఉపాధి ఉద్యోగాలు హరించుకుపోయాయి. ధరలు పడిపోయి ఉత్పత్తి, -అమ్మకాలు స్తంభించిపోయినాయి. పారిశ్రామిక రంగాలపై తీవ్రమైన ప్రభావం పడి పెట్టుబడిదారులు నష్టాలపాలైనారు. ఆనాటి ఇంగ్లీష్ అర్థశాస్త్రవేత్త ప్రొఫెసర్ జేయం కీన్స్ ప్రభుత్వ వ్యయాన్ని, శ్రామికుల వేతనాలను, పెట్టుబడులను పెంచడం ద్వారానే ఆర్థికమాంద్యాన్ని నివారించవచ్చునని బోధించిన ఫలితంగానే, సంక్షేమ రాజ్య దిశలో అనేక ప్రభుత్వాలు తమ ఆర్థిక విధానాలను రూపొందిస్తున్నాయి. సంక్షేమ ఖర్చు చేయకుండా, పేదవర్గాలకు తగిన కొనుగోలు శక్తిని సమకూర్చకుండా ఉన్నట్లయితే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలు, గుత్త సంస్థలు నిర్వీర్యమైతాయని కీన్స్ హెచ్చరించాడు. కీన్స్ కంటే ముందు ఆడమ్ స్మిత్, మార్షల్, పీగు లాంటి స్వేచ్ఛా ఆర్థిక విధానాల రూపకర్తలు కూడా దేశ సంపద ప్రజలందరి శ్రేయస్సును పెంచేవిధంగా ఉపయోగించబడాలని సిద్ధాంతీకరించారు. ప్రభుత్వ ఖర్చులు, వేతనాలు, సంక్షేమ ఖర్చులు, ప్రభుత్వ పెట్టుబడులు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు సంజీవని లాంటిదని కీన్స్ సిద్ధాంతం తెలియజేస్తున్నది. గత 90సంవత్సరాల నుండి వివిధ దేశాలలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలు ఎదగడానికి, అవి ఆర్థిక సంక్షోభాల నుండి రక్షించబడడానికి సంక్షేమ సిద్ధాంతమే ముఖ్యమైన కారణం.


అభివృద్ధి, సంక్షేమం పరస్పర పూరకాలు తప్ప విరుద్ధం కాదు. గత 75 సంవత్సరాలలో మొదటి 30 సంవత్సరాలు భారత ఆర్థిక వ్యవస్థ పబ్లిక్ రంగ సంస్థల అభివృద్ధి సామాజిక సంక్షేమం లక్ష్యంగా సాగింది. 1980 వరకు నిర్మించుకున్న ఆర్థిక వ్యవస్థను యూటర్న్ తిప్పి క్రమంగా 1991 నుండి వేగాన్ని పెంచి ప్రభుత్వ సంస్థలను విక్రయించడం, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రభుత్వ ఖజానా ద్వారా ప్రైవేటు పెట్టుబడులకు, పరిశ్రమలకు రాయితీలు, రుణాలు కల్పించడం, లక్షల కోట్ల రుణాలు మాఫీ చేయడం ఆరంభమైంది. సంస్కరణల పేరిట సామాజిక న్యాయ విధానాలను కత్తిరిస్తూ, పేద వర్గాల అవసరాలను చిన్న చూపు చూస్తూ వస్తున్నారు విధానకర్తలు. జీఎస్టీ సహా వివిధ పన్నులు, సెస్సులు, వ్యాట్లు మొదలగు పేర్లతో పేదవర్గాలపై భారం మోపి ముక్కుపిండి మరీ వసూలు చేయడం కొనసాగుతున్నది.


ఈ విధానాల వల్ల మధ్యతరగతి, శ్రామికుల ఆదాయాలు వాస్తవ రూపంలో కనిష్ట స్థాయికి దిగజారాయి. పేదవర్గాల కనీస స్థాయి జీవన విధానాన్ని నిర్లక్ష్యం చేసే దివాలాకోరు విధానాలను మరింత కఠినంగా అమలు చేస్తే, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ మనుగడకే సమస్యలు ఏర్పడతాయని నూతన ఆర్థిక విధానకర్తలు గుర్తుంచుకోవాలి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలైన అమెరికా యూరోపులు సామాజిక భద్రతాచర్యలు కొనసాగిస్తుంటే, మనదేశంలో కనీస స్థాయి ఆదాయాన్ని ఇవ్వలేని పరిస్థితులున్నప్పుడు పౌరులకు సామాజిక భద్రత, సంక్షేమం అందించడం ఒక మానవీయ కనీస కర్తవ్యం. సమాజంలో వివక్షకు గురి అయి ఆర్థిక వనరులకు అవకాశాలకు దూరం చేయబడిన వారికి రక్షణ కల్పించేవి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. పేదలకు బియ్యం ఇవ్వడం, సంక్షేమ హాస్టళ్ళు ఏర్పాటు చేయడం, నాణ్యమైన ఉచిత విద్య అందించడం, వైద్య సంస్థలను ఏర్పాటు చేయడం, నివాస గృహాలు కట్టించి ఇవ్వడం, రుణాలు, సబ్సిడీలు అందించడం సమాజ అభివృద్ధిలో భాగమే. వివిధ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి నేరుగా వారికి డబ్బులు అందించడం, వస్తువులు పంపిణీ చేయడం వంటి ఏ ఉత్పాదకతా లేని, అభివృద్ధికి దోహదం చేయనటువంటి ప్రక్రియలను మాత్రం ఉచితాలుగా భావించాల్సి ఉంటుంది. 


పారిశ్రామికవేత్తల కోసం వివిధ రూపాల్లో ప్రభుత్వం చేసే ఖర్చులు ఏ విధంగా సమాజ అభివృద్ధికి దోహదం చేస్తాయో, సంక్షేమ పథకాలు కూడా సమాజ అభివృద్ధికే ఉపయోగపడతాయి. దేశ ఆర్థిక వృద్ధి, ప్రజల సంక్షేమం అభివృద్ధీ లక్ష్యంగా మనం రాజ్యాంగాన్ని రచించుకొని, ప్రజాస్వామ్య వ్యవస్థను ఆమోదించుకున్నాం. కానీ క్రమంగా మన రాజ్యాంగ వ్యవస్థలో పొందుపరచబడిన మౌలిక సూత్రాలను పెడచెవినపెడుతూ, మెజారిటీ ప్రజల ఆర్థిక మూలాలను బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగానే నేడు సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడం, అవహేళన చేయడం జరుగుతున్నది. దేశ సుస్థిర అభివృద్ధికి ఆటంకం కలిగించే ఇలాంటి దురాలోచనలను మొగ్గలోనే తుంచి వేయడం అవసరం.

l ప్రొ. కూరపాటి వెంకట్ నారాయణ

Updated Date - 2022-08-20T05:57:17+05:30 IST