చినుకు కోసం

ABN , First Publish Date - 2022-06-30T06:41:44+05:30 IST

నీలి మేఘం ఉసూరుమనిపిస్తోంది. కొన్ని రోజులుగా కరిమబ్బులు కమ్మేస్తున్నా.. పదును వర్షం పడటం లేదు.

చినుకు కోసం
రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి సమీపంలో దుక్కులు దున్ని విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాలు

వేరుశనగ విత్తనాలు సిద్ధం

పదును అయితే విత్తడమే..!

సాగు విస్తీర్ణం 3.76 లక్షల హెక్టార్లు

ఇప్పటిదాకా 11 వేల హెక్టార్లలో సాగు 


అనంతపురం అర్బన, జూన 29: నీలి మేఘం ఉసూరుమనిపిస్తోంది. కొన్ని రోజులుగా కరిమబ్బులు కమ్మేస్తున్నా.. పదును వర్షం పడటం లేదు. ఖరీఫ్‌ ఆరంభమై నెల అవుతోంది. సీజనకు ముందు పడిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా మెట్ట పొలాల్లో దుక్కులు దున్నారు. మరో మారు పదును వర్షం పడితే విత్తనం వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ చాలా ప్రాంతాల్లో చిరుజల్లులకే పరిమితమవుతోంది. జూన 13న జిల్లాలోకి నైరుతి  రుతు పవనాలు ప్రవేశించాయి. అప్పటి నుంచి ఒక్క రోజు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో పదును వర్షం పడింది. అక్కడ మాత్రమే విత్తనం వేశారు. మరికొన్ని ప్రాంతాల్లో అరకొర పదునుకే విత్తనం వేయడం మొదలు పెట్టారు. 


ఇప్పటి దాకా.. 

జిల్లాలో ఎక్కువ శాతం వేరుశనగ సాగు చేస్తారు. ఈ ఏడాది జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 3.76 లక్షల హెక్టార్లుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 2.43 లక్షల హెక్టార్లల్లో వేరుశనగ, మిగతా విస్తీర్ణంలో కంది, జొన్న, వరి, మొక్కజొన్న, కొర్ర, పెసలు, ఉలవలు, ఆముదం, పొద్దుతిరుగుడు తదితర పంటలు సాగు అవుతాయి. ఇప్పటి దాకా 11 వేల హెక్టార్లల్లో మాత్రమే పంటలు సాగు చేశారు. ఇందులో 6 వేల హెక్టార్లల్లో వేరుశనగ ఉంది. గత ఏడాది కూడా జిల్లాలో ఇదే పరిస్థితి. రెండేళ్ల క్రితం జూనలో ఆశించిన స్థాయిలో పంటలు సాగయ్యాయి. జూలై 15 వరకు వేరుశనగ సాగుకు అదును సమయమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఆలోగా పదును వర్షం కురిస్తేనే వేరుశనగ సాగు సత్ఫలితాలను ఇస్తుంది. లేదంటే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సి ఉంటుంది.


పదును ఏదీ..?

ఖరీఫ్‌ సీజనలో విత్తుకు సరిపడే పదును వర్షం కరువైంది. జూన నెల జిల్లా సగటు వర్షపాతం 61 మి.మీ. కాగా, గతేడాది ఇదే సమయానికి 91.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది 79.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సీజన ఆరంభంలో కురిసిన వర్షమే. దుక్కులు దున్నుకునేందుకు మాత్రమే ఉపయోగపడింది. ఆ తర్వాత  మేఘం కరగలేదు. పంటల సాగు ముందుకు కదలడం లేదు. మరో ఐదు రోజుల్లో చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అప్పుడైనా పదునైతే రైతులకు మేలు జరుగుతుంది. 


ఎదురుచూస్తున్నాం..

సీజన ఆరంభంలో పడిన వర్షాలకు దుక్కి దున్నుకున్నాం. మరో సారి పదును వర్షం పడితే విత్తనం వేస్తాం. పదును వాన కోసం ఎదురుచూస్తున్నాం. గత ఏడాది ఇదే సమయానికి ఐదు ఎకరాల్లో కంది సాగు చేశాను. ఈ సారి ఇంకా విత్తనం  వేయలేదు. 

విత్తనాలు సిద్ధం చేసుకున్నాం. వర్షం పడితే విత్తుకుంటాం. 

- బాలు, గొందిరెడ్డిపల్లి, రాప్తాడు మండలం


దుక్కి దున్నేశాం..

పొలాల్లో దుక్కి దున్నేశాం. పదును వర్షం పడితే విత్తనం వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. నాకున్న నాలుగెకరాల్లో వేరుశనగ, కంది సాగు చేయాలని నిర్ణయించు కున్నాను.  విత్తనాలు సిద్ధంగా  ఉంచుకున్నాను.

- నల్లప్ప దొర, నాగులగుడ్డం, శింగనమల మండలం 


Updated Date - 2022-06-30T06:41:44+05:30 IST