మమ్మల్ని ఇంకెంతకాలం దూరం పెడతారు..మోదీ సూటి ప్రశ్న

ABN , First Publish Date - 2020-09-27T01:13:14+05:30 IST

అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌ను నిర్ణాయాధికారాలున్న ఐక్యరాజ్య సమితి వ్యవస్థల్లో భాగం చేయాలని ప్రధాని మోదీ డిమాండ్ చేశారు. ఇకెంతకాలం..భారత్‌ దూరంగా ఉండాలి అంటూ ఆయన సూటి ప్రశ్న సంధించారు.

మమ్మల్ని ఇంకెంతకాలం దూరం పెడతారు..మోదీ సూటి ప్రశ్న

న్యూఢిల్లీ: అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌ను నిర్ణాయాధికారాలున్న ఐక్యరాజ్య సమితి(యూఎన్) వ్యవస్థల్లో భాగం చేయాలని ప్రధాని మోదీ డిమాండ్ చేశారు. ఇకెంతకాలం..భారత్‌ దూరంగా ఉండాలి అంటూ ఆయన సూటి ప్రశ్న సంధించారు. శనివారం నాడు జరిగిన ఐక్యరాజ్య సమితి 75వ సెషన్ సందర్భంగా జరిగిన జనరల్ డిబేట్‌లో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆయన ఐక్యరాజ్యసమితి వ్యవస్థల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. 


భద్రతా మండలిని విస్తరిస్తూ యూఎన్‌లో సంస్కరణలు తీసుకురావాల్సిన సమయమిదేనని మోదీ స్పష్టం చేశారు. ‘నిర్ణాయాధికారాలున్న ఐక్యరాజ్య వ్యవస్థల నుంచి భారత్‌ను ఎంతకాలం దూరం పెడతారు. ఓ దేశం ఎంతకాలం వేచి చూడాలి’ అని మోదీ సూటిగా ప్రశ్నించారు. భారత్‌లో చోటుచేసుకునే ఏ మార్పైనా ప్రపంచంపై ప్రభావం చూపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.


‘1.3 బిలియన్ జనాభా కలిగిన భారత్‌కు ఐక్యరాజ్యసమితిపై ఎంతో గౌరవం, నమ్మకం ఉన్నాయి. అదే సమయంలో.. యూఎన్‌లో సంస్కరణలో కోసం భారత దేశ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ సంస్కరణల ప్రక్రియ ముగింపుకు చేరుకుంటుందా లేదా అనే ఆందోళన వారిలో నేడు వ్యక్తమవుతోంది. యూఎన్ ప్రక్రియలు, ప్రతిస్పందనలు..అసలు ఐక్యారాజ్యసమితి స్వభావంలోనే మార్పు రావాలి.. ఇది ప్రస్తుతం ఎంతో ఆవశ్యకం’ అని ఆయన అన్నారు. యూఎన్ బలోపేతం కావడం, సుస్థిరత సాధించడం ప్రపంచ శ్రేయస్సుకు ఎంతో ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-27T01:13:14+05:30 IST