స్వేచ్ఛ కోసం..

ABN , First Publish Date - 2022-08-11T06:00:43+05:30 IST

భరతమాత సంకెళ్లను తెంచడానికి భారత ప్రజలు నాడు జరిపిన పోరాటంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా కూడా ప్రముఖ పాత్ర పోషించింది. అటు స్వాతంత్రోద్యమం, ఇటు హైదరాబాద్‌ రాష్ట్ర విమోచనోద్యమం ఏకకాలంలో రెండు ఉద్యమాలను పటిష్టంగా నిర్వహించిన ఉద్యమ చరిత్ర కలిగిన పోరు గడ్డ ఇది.

స్వేచ్ఛ కోసం..

స్వాతంత్య్ర పోరాటంలో ఓరుగల్లు తనదైన పాత్ర
క్విట్‌ ఇండియా తొలి స్పందన ఇక్కడే..
ఖిలాఫత్‌ ఉద్యమంతో ప్రారంభం
నిజాం రాజును కూల్చే వరకు పోరు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్కా ఉద్యమం
గాంధీజీ రాకతో కొత్త చైతన్యం
సర్వస్వం త్యాగం చేసిన ఎందరో యోధులు
1920 -1948 మధ్య పోరాట ఘట్టాలెన్నో..


హనుమకొండ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): భరతమాత సంకెళ్లను తెంచడానికి భారత ప్రజలు నాడు జరిపిన పోరాటంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా కూడా ప్రముఖ పాత్ర పోషించింది. అటు స్వాతంత్రోద్యమం, ఇటు హైదరాబాద్‌ రాష్ట్ర విమోచనోద్యమం ఏకకాలంలో రెండు ఉద్యమాలను పటిష్టంగా నిర్వహించిన ఉద్యమ చరిత్ర కలిగిన పోరు గడ్డ ఇది.  బ్రిటీ్‌షవారిని ఈ దేశం నుంచి తరమికొట్టేందుకు మహాత్మాగాంధీ ఇచ్చిన అన్ని పిలుపును ఇక్కడి ప్రజలు అందిపుచ్చుకున్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచారు. భారత దేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ప్రధాన ఘట్టంగా నిలిచిన 1920నాటి ఖిలాఫత్‌ ఉద్యమం నుంచి ప్రారంభమైన ఇక్కడి ప్రజల పోరాటం.. 1948లో నిజాం ప్రభువును గద్దెదించే  వరకూ కొనసాగింది. ఆజాదికా అమృతోత్సవం పేరుతో జరుపుకుంటున్న 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సాగిన స్వాతంత్రోద్యమ ప్రధాన ఘట్టాలను ఒక సారి అవలోకిద్దాం...

ఖిలాఫత్‌
1920లో జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో ప్రారంభమైన ఖిలాఫత్‌ ఉద్యమం.. దేశవ్యాప్తంగా ప్రజల్లో రగిల్చిన చైతన్యాన్ని వరంగల్‌  జిల్లా ప్రజలు కూడా అందుకొని విదేశీ పాలనపై సమరశంఖం పూరించారు. అదే వరంగల్‌ జిల్లా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మొదటి ఘట్టం ఖిలాఫత్‌ ఉద్యమం... జిల్లాలో 1920 మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో తీవ్రంగా జరిగింది. జనగామ ప్రాంతంలో పెద్దఎత్తున సాగింది. ఈ ఉద్యమంలో భాగంగా గాంధీజీ ఆశయాలైన ఖద్దర్‌ దుస్తుల వాడకం, మద్యపాన నిషేధ కార్యక్రమాలను ఆయన పిలుపు మేరకు జిల్లా స్వాతంత్య్ర సమర పోరాట యోధులు నలుమూలల ప్రచారం చేశారు.

ప్రజలంతా ఉద్యమంలో పెద్దఎత్తున పాల్గొనేట్టు దేశభక్తి భావనలను వ్యాప్తిచేశారు. ఆచరణలో ఆయా కార్యక్రమాలను సఫలం చేసేందుకుగాను స్వదేశీ ఉద్యమానికి ఊపునిచ్చేందుకు వరంగల్‌ ఖద్దర్‌ నూలు వడికే చరఖాలను తయారు చేసే ఖార్కానాలను స్థాపించి, వాటిని జిల్లాలోని మారుమూల పల్లెలకు సైతం పంపిణీ అయ్యేట్టు చూశారు. మద్యపాన వ్యతిరేక ప్రచారంలో భాగంగా పూల్‌పాడ్‌ గ్రామంలో వందలాది మంది ప్రజలు తాము మద్యం ముట్టబోమని ప్రమాణం చేశారు. ఆ విధంగా స్వాతంత్రోద్యమంలో భాగంగా మద్యపాన నిషేధ కార్యక్రమానికి ఆ రోజుల్లోనే వరంగల్‌ జిల్లాలో బీజాలు పడ్డాయి. ప్రజల్లో ఒకవైపు చైతన్యం వెల్లివిరుస్తుంటే మరోవైపు హైదరాబాద్‌ ప్రభుత్వ నిజాంరాజు బెంబేలెత్తిపోయాడు. దీంతో స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేయడానికి పూనుకున్నాడు. స్వాతంత్య్ర పోరాట యోధులపై ఆనేక ఆంక్షలు విధించాడు. అడుగడుగునా నిర్బంధాలు సృష్టించాడు.

గాంధీజీ రాక
1945 ఫిబ్రవరి 5న గాంధీజీ వరంగల్‌కు వచ్చారు. గాంధీజీ వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో దిగారు. స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఘట్టం వరంగల్‌ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది. మహాత్ముడి రాకతో వరంగల్‌ జిల్లాలో స్వాతంత్రోద్యమ కాంక్ష ద్విగుణీకృతమైంది. తండోపతండాలుగా వచ్చిన ప్రజలు, నాయకులు అక్కడికక్కడే రూ.12వేలను సమీకరించి స్వాతంత్రోద్యమ నిధిగా బాపూజీకి సమర్పించారు.

ఆంధ్రజన సంఘం సభ

1920వ దశకంలో స్వాతంత్ర్యోద్యమ జ్వాలలు వీస్తున్న తరుణంలో నిజాం రాజ్యంలోని తెలంగాణ ప్రాంతంలో నిజాం రాష్ట్ర అంధ్రజన సంఘం, ఆంధ్ర జన కేంద్ర సంఘం వంటివి ఏర్పడి ప్రజల్లో విద్యావికాసానికి కృషి చేస్తుండేవి. 1924 ఏప్రిల్‌ 1న ఆంధ్రజన సంఘం హనుమకొండలో మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించింది. ఆంధ్రజన సంఘానికి బలీయమైన రాజకీయ ఉద్దేశాలు లేకపోయినప్పటికీ నిజాం నిరంకుశ పాలనను ఎదిరించే దిశగా ప్రజలను విద్యావంతులను చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. నాడు ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలు స్వాతంత్య్ర పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియచేశారు. వారిని మరింత ఉత్తేజితులను చేశారు.

స్వదేశీ ఉద్యమం
1933లో స్వదేశీ ఉద్యమాన్ని విజయవంతం చేసే దిశగా వరంగల్‌ మూక్కుమ్మడిగా ముందుకు కదలిలింది. స్వదేశీ ఉద్యమాన్ని పట్టణ, గ్రామ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ముఖ్యంగా చర్కాలను హైదరాబాద్‌ నుంచి తెప్పించి శిక్షణ ఇప్పించారు. స్వదేశీ పత్రిల ముద్రణ, స్వదేశీ పుస్తక విక్రయశాలలను నెలకొల్పటం, ప్రజలకు చౌకగా పుస్తకాలను విక్రయించడం, ఖాదీధారణ, ప్రచారం మొదలైనవాటిని చేపట్టారు. ఎం.ఎస్‌. రాజలింగం, బండారు వీరమల్లు ప్రసాద్‌, ఏటూరి వెంకటేశ్వర్‌రావు మొదలైనవారు 1932 నుంచి వరంగల్‌లో ఖాదీ ప్రచారాన్ని ఉక ఉద్యమంలో సాగించారు. ఎం.ఎస్‌. రాజలింగం స్వయంగా శిక్షణ పొందడానికి 1941లో గాందీజీ సేవాగ్రామ్‌లో చేరాడు. రామా చంద్రమౌళి, రంగనాయకులు, దుగ్గిశెట్టి వెంకటయ్య, గొడిశాల శంకరయ్య, మద్ది జనార్దన్‌, కొమరగిరి నారాయణ మొదలైనవారు ఊరూరా తిరిగి ఖాదీని స్వదేశీ భావాలను ప్రచారం చేశారు.

ఆంధ్ర మహాసభలు

స్వాతంత్య్ర పోరాటాన్ని నిర్వహిస్తున్న సంస్థల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతున్న  తరుణంలో వరంగల్‌ జిల్లా నాయకులు మౌలికమైన నిర్ణయాలు తీసుకునేందుకు తొమ్మిదో మహాసభను 1942లో వరంగల్‌ జిల్లా ధర్మారం గ్రామంలో నిర్వహించారు. అంతకుముందు ఏడో సదస్సును వరంగల్‌ జిల్లాలోని ధర్మసాగర్‌ మండలంలోని మల్కాపూర్‌ గ్రామంలో నిర్వహించారు. స్వాతంత్యపోరాటంలో ప్రజలను మరింత భాగస్వాములను చేయడానికి ఆంధ్రసారస్వత పరిషత్‌ మహాసభలను వరంగల్‌ కోటలో నిర్వహించారు.

జాయిన్‌ ఇండియా
రామానంద తీర్ధ ఇచ్చిన జాయిన్‌ ఇండియన్‌ యూనియన్‌ అన్న పిలుపు మేరకు 1947 ఆగస్టు 7 నుంచి  వరంగల్‌ జిల్లాలో హర్తాళ్లు, పాఠశాలల బహిష్కరణ వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. మల్కాపూర్‌లో నిర్వహించిన ఆంధ్రమహాసభల తర్వాత ఉద్యమం నుంచి కమ్యూనిస్టులు వేరయ్యారు. తత్ఫలితంగా ఆంధ్ర జాతీయ పక్షం నిర్మాణమైంది. బూర్గుల రామక్రిష్ణారావు, కుందుముల నర్సింహారావు, జమలాపురం కేశవరావు, కొండా వెంకటర రంగారెడ్డి, గెల్ల కేశవరావు, మాడపాటి హనుమంతరావు, పీవీ నర్సింహారావు, టి.హయగ్రీవాచారిలు తెలంగాణ అంతటికి ఉద్యమ సారథులుగా నిలిచారు. ఎట్టకేలకు 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. దేశ ప్రజలంతా స్వేచ్ఛావాయువులను పీలుస్తుండగా నిజాం ప్రభుత్వ పరిధిలోని ప్రాంత ప్రజలకు మాత్రం ఆ ఆనందం దక్కలేదు. ఎలాంటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపురాదని, భారతదేశ జాతీయ పతాకాన్ని ఎగుర వేయరాదని నిజాం ప్రభుత్వం ప్రజలపై ఉక్కుపాదం మోపింది. ఆ తర్వాత జరిగిన నిజాం వ్యతిరేక పోరాటంలో కూడా వరంగల్‌ జిల్లా ప్రజలు వీరోచితంగా పాల్గొన్నారు. 1948 సెప్టెంబర్‌ 13న పోలీసు చర్యతో జిల్లా ప్రజలు అసలైన స్వేఛ్చాపలాన్ని ఆస్వాదించారు.


సత్యాగ్రహాలు
1938లో హైదరాబాద్‌ రాష్ట్ర కాంగ్రె్‌సను ప్రారంభించినప్పుడు నిజాం ప్రభుత్వం దానిని నిషేధించింది. ప్రభుత్వ నిరంకుశ  ధోరణులను ఎండగడుతూ వరంగల్‌ నుంచి తిరువరంగం హయగ్రీవచారి, ఇటికాల మధుసూదన్‌రావు, పొట్లపల్లి రామారావు, బొలుగొడ్డు రంగనాయకులు వంటి పలువురు స్వాతంత్య్ర సమరయోధులు సత్యాగ్రహంలో పాల్గొని జైలు పాలయ్యారు. నిజాం ప్రభుత్వం హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రె్‌సపై నిషేధం ఎత్తివేయకపోవడంతో జిల్లా నాయకులు ప్రత్యామ్నాయంగా ఆర్య సమాజాన్ని వేదికగా ఎంచుకున్నారు.


క్విట్‌ ఇండియా
 1942లోనే మహాత్మాగాంధీ పిలుపునిచ్చిన క్విట్‌ ఇండియా ఉద్యమానికి వరంగల్‌ జిల్లాయే ప్రప్రథమంగా స్పందించింది. క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఎం.ఎస్‌. రాజలింగం, శ్రీరాం చంద్రమౌళి, దుగ్గిశెట్టి వెంకటయ్య, ఆరెల్లి బుచ్చయ్య, బొలుగొడ్డు రంగనాయకులు, గొడిశాల కొమురయ్య, ఎలగందుల వైకుంఠం తదితర నాయకులను నిజాం ప్రభుత్వం 1942 అక్టోబర్‌ 8న అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఆ కాలంలోనే మహాత్మాగాంధీ ఓరుగల్లు గడ్డపై అడుగుమోపారు.

Updated Date - 2022-08-11T06:00:43+05:30 IST