పెద్దల సభకు వెళ్లేదెవరో?

ABN , First Publish Date - 2022-05-09T15:52:29+05:30 IST

వచ్చే నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు సీట్ల కోసం అధికార డీఎంకేలో పలువురు సీనియర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు...

పెద్దల సభకు వెళ్లేదెవరో?

 డీఎంకేలో అదృష్టం ఎవరికి వరించేనో ?

 కాంగ్రెస్‌ నుంచి రేసులో పి.చిదంబరం


చెన్నై: వచ్చే నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు సీట్ల కోసం అధికార డీఎంకేలో పలువురు సీనియర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఈ నాలుగు సీట్లలో ఒకటి  తమకు కేటాయించాలని కాంగ్రెస్‌ పార్టీ పట్టుబడుతోంది. డీఎంకే రాజ్యసభ సభ్యులు ఆర్‌ఎ్‌స.భారతి, టీకేఎస్‌ ఇలంగోవన్‌, అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యులు ఎస్‌ఆర్‌ బాలసుబ్రమణ్యం,  నవనీత కృష్ణన్‌ సహా ఆరుగురి పదవీ కాలం జూన్‌లో ముగియనుంది. ఈ ఆరు స్థానాలను భర్తీ చేయడానికి ఈ నెలాఖరులో ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. శాసనసభలో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో సభ్యుల మెజారిటీ ప్రకారం డీఎంకే నాలుగు, అన్నాడీఎంకే రెండు స్థానాలను కైవశం చేసుకుంటాయి. రాజ్యసభ సభ్యుడిగా గెలవాలంటే 34 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. డీఎంకే కూటమికి 159 మంది ఉండటంతో నాలుగు రాజ్యసభ స్థానాలను సులువుగా గెలుచుకుంటుంది.


అన్నాడీఎంకే, బీజేపీలకు  70 మంది ఎమ్మెల్యేలున్నారు. దీంతో అన్నాడీఎంకే ఇద్దరిని రాజ్యసభ సభ్యులుగా గెలిపించుకునే అవకాశం ఉంది. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్‌ ఒక రాజ్యసభ సీటు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. రాజ్యసభలో ప్రస్తుతం కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో రాష్ట్రం నుంచి ఒకరిని  ఎంపిక చేయాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం రాజ్యసభ సభ్యత్వం త్వరలో ముగియనుంది. డీఎంకే మద్దతుతో చిదం


బరంను రాజ్యసభకు ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. డీఎంకే కూడా కాంగ్రె్‌సకు ఒక రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉంది. తక్కిన మూడు రాజ్యసభ స్థానాలకు డీఎంకే తరఫున ఎవరు పోటీచేస్తారన్నది తేలాల్చి ఉంది. డీఎంకేలో సీనియర్లు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు సన్నిహితులుగా మెలుగుతున్న ఆర్‌ఎస్‌ భారతి, టీకేఎస్‌ ఇలంగోవన్‌కు మళ్ళీ ఛాన్సు దక్కే అవకాశం ఉంది.  2016లో వీరిద్దరు రాజ్యసభకు ఎన్నికయ్యారు. మళ్ళీ రాజ్యసభ  సీటు కోసం వీరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షాల ఆరోపణలన్నింటికీ సమర్థవంతంగా సమాధానమివ్వడంలో ఆరితేరిన ఆర్‌ఎస్‌ భారతి తనకు మళ్ళీ రాజ్యసభ సీటు  ఖాయమని ధీమాగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరికీ మళ్లీ రాజ్యసభ సీట్లు లభించేనా? పార్టీలో పలువురు నేతలు రాజ్యసభ సీటుకోసం పోటీపడుతున్నారు. తేనికి చెందిన తంగతమిళ్‌ సెల్వన్‌, కోవైలో కార్తికేయ శివసేనాపతి, నాగపట్టినం ఏకేఎస్‌ విజయన్‌ రాజ్యసభ సీటుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఏకేఎస్‌ విజయన్‌ 1999, 2004, 2009లో మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలిచారు. ప్రస్తుతం ఆయన కేబినెట్‌ మంత్రి హోదాలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారు. ఆయన కూడా రాజ్యసభ సీటు కోసం  ప్రయత్నిస్తున్నారు ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత డీఎంకే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుంది. అంతవరకూ ఎవరికి రాజ్యసభ సీట్లు దక్కుతుందో అనే సస్పెన్స్‌ కొనసాగుతుంది.

Read more