కరోనాతో.. క్యాష్‌!

ABN , First Publish Date - 2020-08-08T08:10:01+05:30 IST

కొవిడ్‌ బాధితులను ఉంచి చికిత్స చేసేందుకు జిల్లాలో ఉన్న స్టార్‌ హోటళ్లను ఆస్పత్రులు లీజుకు ..

కరోనాతో.. క్యాష్‌!

ఫీజుల కోసం.. హోటళ్ల లీజు!

 కరోనా బాధితుల నుంచి రోజుకు రూ.10 వేల బిల్లింగ్‌

డీఎంహెచ్‌వో సిఫార్సు చేసినా నాన్‌ ఆరోగ్యశ్రీ కింద చికిత్సకే మొగ్గు

 


గుంటూరు, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి):కొవిడ్‌ బాధితులను ఉంచి చికిత్స చేసేందుకు జిల్లాలో ఉన్న స్టార్‌ హోటళ్లను ఆస్పత్రులు లీజుకు తీసుకుంటున్నాయి. ఇలా తీసుకొంటున్న హోటళ్లలోకి నాన్‌ ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్‌ చేసుకొన్న కొవిడ్‌ బాధితులను క్వారంటైన్‌ చేసి పర్యవేక్షిస్తున్నాయి. ఒక్కో బాధితుడికి రోజుకు రూ.10 వేల వరకు బిల్లులు వేస్తూ ప్రైవేటు ఆస్పత్రులు సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 


జిల్లాలో కొవిడ్‌ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఆస్పత్రుల్లో పడకలు దాదాపుగా నిండిపోయాయి. తీవ్ర లక్షణాలు ఉంటేనే ఆయా ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అసలు లక్షణాలు లేని వారిని హోం ఐసోలేషన్‌లోనే ఉండమంటున్నారు. కొద్ది లక్షణాలు ఉన్న వారిని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌, క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు.  


మరోవైపు ఆరోగ్యశ్రీ నెట్‌వర్కుతో పాటు నాన్‌ ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు కూడా బాధితులకు చికిత్స అందించేందుకు అనుమతులిచ్చారు. దీంతో కాస్త స్తోమత కలిగిన వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్కు కలిగిన ఆస్పత్రులకు నాన్‌ ఆరోగ్యశ్రీ బ్రాంచ్‌లు కూడా ఉన్నాయి. ఇదే అదనుగా డీఎంహెచ్‌వో రిఫరెన్స్‌తో వచ్చిన కొవిడ్‌ బాధితుడికి ఆరోగ్యశ్రీ కింద వెంటనే చేర్చుకోవడం లేదు. బెడ్స్‌ ఖాళీ లేవని చెబుతున్నారు. ఆ తర్వాత నాన్‌ ఆరోగ్యశ్రీ కింద చేరండి... మంచి వైద్య సదుపాయాలు అందిస్తామని ప్రలోభ పెడుతున్నారు.


లక్షణాలు లేని వారికి ఏడు, ఎనిమిది రోజుల్లోనే నెగెటివ్‌ వస్తుంది. అయినప్పటికీ 14 రోజులు, అంతకంటే ఎక్కువే ఆస్పత్రుల్లో ఉంచుతున్నారు. ఒకపక్క కేంద్రం వైరస్‌ సోకిన వారికి ఏడు రోజులు చికిత్స, మరో ఏడు రోజులు హోం క్వారంటైన్‌ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ జిల్లాలో ఈ ఆదేశాలు అమలు కావడం లేదు. ఎక్కువ రోజులు స్టార్‌ హోటల్‌లో ఉంచడం వలన డిశ్చార్జ్‌ అయ్యే రోజుకు బిల్లు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్యన ఉండే అవకాశం లేకపోలేదు. ఇదే సమయంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గడం లేదు. మొదట్లో డిశ్చార్జ్‌ రేటు బాగానే ఉన్నా నేడు 22.02 శాతానికి పడిపోవడానికి ఇది కూడా ఓ కారణం కావొచ్చన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 




Updated Date - 2020-08-08T08:10:01+05:30 IST