మెరిసే కళ్ల కోసం...

ABN , First Publish Date - 2021-05-06T17:15:21+05:30 IST

ఎక్కువసేపు మేలుకోవడం, కంప్యూటర్ల ముందూ, లాప్‌టాప్‌ల ముందూ ఎక్కువ సమయం కూర్చోవడం ఆధునిక జీవనంలో సర్వసాధారణమైపోయింది. దీనివల్ల కళ్ళు పొడిబారిపోతాయి.

మెరిసే కళ్ల కోసం...

ఆంధ్రజ్యోతి(06-05-2021)

ఎక్కువసేపు మేలుకోవడం, కంప్యూటర్ల ముందూ, లాప్‌టాప్‌ల ముందూ ఎక్కువ సమయం కూర్చోవడం ఆధునిక జీవనంలో సర్వసాధారణమైపోయింది. దీనివల్ల కళ్ళు పొడిబారిపోతాయి. జీవం కోల్పోతాయి. ఈ పరిస్థితిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే కళ్ళు మిలమిలా మెరిసేలా చెయ్యొచ్చు.


నీరు ఎక్కువ తాగండి: శరీరం ఉత్తేజితం కావాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా తగినంత నీరు తాగాల్సిందే. మీ కళ్ళు వెలుగులీనుతూ ఉండాలంటే రోజూ కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగండి.


రోజ్‌ వాటర్‌తో: కొంచెం రోజ్‌ వాటర్‌ తీసుకోండి. దూదిని దానిలో ముంచండి, మీ కళ్ళ మీద పెట్టుకోండి. జీవం కోల్పోయిట్టుండే కళ్ళని మెరిపించడానికి రోజ్‌ వాటర్‌ చక్కని పరిష్కారం.


టీబ్యాగ్స్‌ తో: టీ తాగిన తరువాత... బ్యాగ్‌లను విసిరి పారేయకండి. సాధారణ లేదా గ్రీన్‌ టీ బ్యాగ్‌లను ఫ్రిజ్‌లో ఉంచండి. అవి చల్లబడ్డాక బయటకు తియ్యండి. కళ్ళు మూసుకొని, వాటి మీద చల్లటి టీ బ్యాగ్స్‌ పెట్టుకోండి. కొన్ని నిమిషాల తరువాత తీసేయండి. తేడా మీకే తెలుస్తుంది.


కీరతో: కీరదోస ముక్కలను కళ్ళ మీద పెట్టుకోండి. పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోండి. ఇలా తరచూ చేస్తే కళ్ళు కాంతిమంతంగా మారుతాయి.


స్ట్రాబెర్రీలతో: స్ట్రాబెర్రీలను బాగా చల్లబడే వరకూ ఫ్రిజ్‌లో పెట్టండి. తరువాత వాటి పై పొరను తీసేసి, ముక్కలుగా కట్‌ చెయ్యండి. మీ కళ్ళ కింద వాటిని పెట్టుకోండి. అయిదు నిమిషాలు వదిలెయ్యండి. అలసటగా, ఉబ్బిపోయినట్టుండే కళ్ళను ఇవి చక్కగా మెరిపిస్తాయి. 


వీటితోపాటు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం, తగినంత సమయం నిద్రపోవడం మరచిపోకండి. టీవీ చూసే సమయం తగ్గించండి. కంప్యూటర్ల దగ్గర పనిచేసేవారు మధ్యలో కాస్త విరామం తీసుకోండి. వీటిని పాటించడం వల్ల మీ కళ్ళను సురక్షితంగా ఉంచుకోవచ్చు. మెరిసేలా చేసుకోవచ్చు.



Updated Date - 2021-05-06T17:15:21+05:30 IST