‘వెయిటింగ్‌’ వ్యధ

ABN , First Publish Date - 2021-03-04T05:30:00+05:30 IST

‘వెయిటింగ్‌’ వ్యధ

‘వెయిటింగ్‌’ వ్యధ
కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్థులకు రక్తశుద్ధి చేస్తున్న దృశ్యం

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ సంబంధ వ్యాధి బాధితులు 

రెండు కేంద్రాల్లో రోజూ 102మందికి డయాలసిస్‌ 

పాల్వంచలో అందుబాటులోకి రానున్న మరో కేంద్రం 

ఇంకా చికిత్స కోసం ఎదురుచూస్తున్న 80మంది  

కొత్తగూడెం కలెక్టరేట్‌, మార్చి 4: పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిడ్నీ సంబంధ వ్యాధి బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటికే భద్రాచలం, కొత్తగూడెం ఏరియా ఆసుపత్రుల ద్వారా కిడ్నీ వ్యాధి బాధితులకు ఉచితంగా రక్తశుద్ధి(డయాలసిస్‌) సేవలు అందిస్తున్నా ఇంకా 80మంది వెయింటిగ్‌ జాబితాలో ఉన్నారంటే వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కొత్తగూడెంలో 65, భద్రాచలంలో  25మంది వెయింటింగ్‌ జాబితాలో ఉన్నారు. దీంతో జిల్లాలో డయాల్‌సిస్‌ కేంద్రాలు సరిపోవడంలేదని భావించిన అధికారులు కొత్తగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ మరో రక్తశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అది మరో నెల రోజుల్లో వినియోగంలోకి రానుంది. గతంలో కిడ్నీ బాధితులు డయాలిసిస్‌ కోసం విజయవాడ, హైదరాబాద్‌, ఖమ్మం వెళ్లేవారు. దీంతో వ్యయా ప్రయాసలు అధికంగా ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత వైద్యశాలల్లో నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం, గిరిజన ప్రాంతమైన భద్రాచలం ఏరియా ఆసుపత్రుల్లో డయాల్‌సిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు కేంద్రాల్లో ఇప్పటి వరకు 32,808 మందికి రక్తశుద్ధి చేశారు. ప్రస్తుతం  కొత్తగూడెంలో 50 మంది, భద్రాచలంలో 52మంది ఉచిత డయాలిసిస్‌ పొందుతున్నారు. కొత్తగూడెంలో 5, భద్రాలచంలో 5 బెడ్లు మొత్తం 10పడకలున్నాయి. వాటిలో నాలుగు పాజిటివ్‌, 6నెగెటివ్‌ రోగులకు రక్తశుద్ధి చేయడానికి వినియోగిస్తున్నారు. వాటిద్వారా ప్రస్తుతం రోజుకు 100మందికి రక్తశుద్ధి జరుగుతోంది. రోగి వ్యాధి తీవ్రతను బట్టి వారానికి రెండు, మూడుసార్లు రక్తం శుద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సామర్థం ప్రకారం  వెయింటిగ్‌లో ఉన్నవారికి రక్తశుద్ధి చేయాలంటే ఇప్పుడు చికిత్స పొందుతున్నవారిలో ఎవరైనా మరణిస్తేనే వారిస్థానంలో ఇతరులకు అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనేకమంది భారీ ఖర్చును భరిస్తూ ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటుగా చేయించాలంటే ఒక్కసారికి రూ.3వేల వరకు ఖర్చవుతుంది. అంటే రోగి తీవ్రతను బట్టి నెలకు ఒక్కరికి రూ.36వేలు ఖర్చవుతుంది. దీనికి ప్రయాణ ఖర్చులు అదనంగా ఉంటాయి. ప్రభుత్వం ఉచితంగా డయాలసిస్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నా అవి సరిపోవడం లేదు. కొత్త డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటుతో పాటు బెడ్స్‌ను, టెక్నీషియన్లను పెంచాల్సిన ఉంది. ప్రస్తుతం పాల్వంచలో మరో కేంద్ర నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరో నెలరోజుల్లో అది వినియోగంలోకి వచ్చే అవకాశముంది.  

తాగేందుకు అనువుగా లేని నీరు 

భద్రాద్రి జిల్లాలోని ఆసుపత్రుల్లో రోగుల అవసరాలకు అనుగునంగా తాగునీరు లభించడం లేదు. ప్రతి ఆసుపత్రిలో బోరుబావులు ఉన్నా వాటిల్లోంచి వచ్చే నీరు తాగడానికి అనువుగా లేదు. ఆర్‌వో ప్లాంట్స్‌ ఉన్నా అవి రోగుల దాహార్తిని తీర్చలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లే బాధితులు బయటి నుంచి ఫ్యూరిఫైడ్‌ వాటర్‌ కొనుగోలుచేసి తాగుతున్నారు. 

తీరని జనరేటర్‌ సమస్య 

కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాల్‌సిస్‌ కేంద్రానికి ప్రత్యేకంగా జనరేటర్‌ ఏర్పాటు చేయాలని కేంద్రం ఏర్పాటైనప్పటినుంచి నిర్వాహకులు కోరుతున్నా నేటికీ అది ఆచరణలోకి రాలేదు. ఆసుపత్రిలో ఉన్న జనరేటర్‌నే ప్రస్తుతం వినియోగిస్గున్నారు. అనుకోకుండా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే డయాల్‌సిస్‌ విధానంలో ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-03-04T05:30:00+05:30 IST