పిల్లల కోసం... పర్యావరణహితం

ABN , First Publish Date - 2022-06-30T09:44:00+05:30 IST

‘‘అది 2009. అప్పుడు నేను గర్భవతిని. పుట్టబోయే బిడ్డ కోసం చాలా కలలు కన్నాం. తనను ఎలా పెంచాలో..

పిల్లల కోసం... పర్యావరణహితం

పదహారేళ్ల తరువాత పిల్లల కోసం భర్తతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చారు వాణి కన్నన్‌. తమ బిడ్డలకు కాలుష్యం లేని ‘పచ్చని’ జీవితాన్ని అందివ్వాలని మట్టితో చక్కని ఇంటిని కట్టుకున్నారు. ఆ ఇంట్లో దీపాలు వెలుగుతాయి... కానీ విద్యుత్‌ బిల్లులు ఉండవు. చల్లదనం ఉంటుంది... కానీ ఏసీల అమరికలు కనిపించవు. పర్యావరణహితమైన తమ కలల ఇంటి గురించి వాణి ఇలా చెప్పుకొచ్చారు... 


‘‘ది 2009. అప్పుడు నేను గర్భవతిని. పుట్టబోయే బిడ్డ కోసం చాలా కలలు కన్నాం. తనను ఎలా పెంచాలో... ఎలాంటి వాతావరణంలో ఉంచాలో... అన్నీ మాట్లాడుకున్నాం. అప్పుడు మా నివాసం బ్రిటన్‌లో. తమిళనాడులోని కోయంబత్తూర్‌ సొంతూరు. పెళ్లి తరువాత మావారు బాలాజీతో కలిసి బ్రిటన్‌లో స్థిరపడ్డాం. మా అమ్మాయి నా కడుపులో పడ్డ ఆ సమయంలో... నేపీలు, ప్లాస్టిక్‌ బాటిళ్లు, పర్యావరణానికి హానికరమైన ఇంకా ఎన్నో వస్తువులు మా షాపింగ్‌ లిస్టులో వచ్చి చేరాయి. బిడ్డను ఈ నేలపైకి తెస్తున్నామన్న కారణంతో వీటన్నిటినీ పోగేసి ప్రకృతికి విరుద్ధంగా వెళుతున్నామని అనిపించింది. బదులుగా పర్యావరణహితమైనవి, పునర్వినియోగించగలిగే ప్రత్యామ్నాయాలు ఏమున్నాయని పరిశోధించి, వాటినే ఉపయోగించడం ప్రారంభించాం.  


అదొక్కటే సరిపోదని... 

2010లో మా అమ్మాయి పుట్టే సమయానికి మాకు మరింత స్పష్టత వచ్చింది. పాపకు కావల్సిన ఫుడ్‌ ఇంట్లోనే తయారు చేసుకుని, పునర్వినియోగ నేపీల వంటివి వాడినంత మాత్రాన పర్యావరణానికి పెద్దగా ప్రయోజనం ఒనగూరదు. పుడమి పచ్చగా ఉండాలంటే చేయాల్సింది చాలా ఉందని అర్థమైంది. దాంతోపాటే మా పిల్లలను భారతీయ సంస్కృతి మూలాలతో, స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో పెంచాలనుకున్నాం. అందుకే మాకు రెండో సంతానం కలిగిన తరువాత, 2018లో కొయంబత్తూర్‌కు తిరిగి వెళ్లాం. కానీ అక్కడి ‘ఆల్టర్నేట్‌ స్కూల్స్‌’ కూడా సంప్రదాయ బడుల లాగానే ఉన్నాయి. నా పిల్లలకు లైఫ్‌ స్కిల్స్‌ నేర్పాలంటే ఇంట్లోనే బోధించాల్సిన పరిస్థితి. దీంతో ఇతర సబ్జెక్టులతో పాటు హౌస్‌ బిల్డింగ్‌పై కూడా వారికి అవగాహన కల్పించాను. నేను బ్రిటన్‌లో బిజినెస్‌ అనలి్‌స్టగా చేసేదాన్ని. ఇక్కడకు వచ్చాక యోగ టీచర్‌గా మారిపోయాను. ఆయన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. 


కల నెరవేరింది...  

బెంగళూరుకు వెళ్లాక చూస్తే... ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మేం కోరుకున్న తరహాలో ఆ ఇళ్లు లేవు. దీంతో బెంగళూరులోని ‘మహీజా’ అనే సంస్థను సంప్రతించాం. సహజ వనరులతో, పర్యావరణహితమైన ఇళ్లు కట్టి ఇచ్చే సంస్థ అది. దానికి తగ్గట్టుగానే సంస్థ చక్కని ప్లాన్‌ ఇచ్చింది. సిమెంట్‌తో కాకుండా మట్టితో నిర్మాణం చేపట్టింది. ఏడు శాతం సిమెంట్‌, మట్టి, స్టీల్‌ బ్లాస్ట్‌, లైమ్‌స్టోన్‌తో ఇటుకలు ఇంటి వద్దే తయారు చేశారు. సంప్రదాయ శ్లాబ్‌కు బదులు మట్టి బ్లాక్‌లతో పై కప్పు నిర్మించారు. పనికిరాని కీబోర్డ్స్‌, కొబ్బరి టెంకలు తదితరాలతో బేస్‌ వేసి, ఆ ఖాళీలను మట్టితో ఫిల్‌ చేసి, ఈ బ్లాక్స్‌ రూపొందించారు. దీనివల్ల  కప్పు రూఫ్‌ దృఢంగానూ ఉంటుంది. 


ఇంటి పంట... 

మా అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఎకో ఫ్రెండ్లీ జీవన శైలి వైపు అడుగులు వేస్తూ వచ్చాం. కిచెన్‌ గార్డెన్‌లో మెంతు, కరివేపాకు, కొత్తిమీర లాంటి మొక్కలెన్నో పెంచుతున్నాం.  మా ఇంట్లో ఉపయోగించే కుర్చీలు, సోఫాలు, బల్లలు కూడా పాత ఫర్నీచర్‌తో చేసినవే.


చలచల్లగా... 

మా ఇంట్లోకి అడుగుపెడితే... ప్రతి గదిలో స్వచ్ఛమైన గాలి పలుకరిస్తుంది. మీకు ఎక్కడా ఎయిర్‌ కండిషనర్లన్నవి కనిపించవు. కానీ మండుటెండల్లో కూడా ఇంట్లో ఎంతో చల్లగా ఉంటుంది. అలంకారానికే అన్నట్లు ఫ్యాన్లు రూఫ్‌కు వేలాడుతుంటాయి. చాలా అరుదుగా అవి తిరుగుతుంటాయి. ప్రతి గదిలో సన్‌రూఫ్స్‌ వల్ల సాయంత్రం ఆరున్నర వరకు లైట్స్‌ వేసే అవసరమే ఉండదు. మూల మూలలకూ గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా ఇంటిని డిజైన్‌ చేశారు. సౌర విద్యుత్‌తోనే అన్నీ నడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్క రూపాయి విద్యుత్‌ బిల్లు కట్టింది లేదు. నీళ్లకూ ఇబ్బంది లేదు. మా ఇంటి సమీపంలోని రెండు బావులు వర్షాకాలంలో నిండుతాయి. వాటి ద్వారా కమ్యూనిటీలోని 30 ఇళ్లకు నీటి సరఫరా జరుగుతోంది. ఏదిఏమైనా ఇంటిని కట్టడమంటే... ఒక బిడ్డను బయటకు తెచ్చినట్టు. గోడలకు నీళ్లు పోయడం, చిన్న చిన్న పనుల్లో కార్పెంటర్‌కు సహకరించి ఇంటి నిర్మాణంలో పిల్లలు భాగస్వాములైనందుకు సంతోషంగా ఉంది.’’ 

Updated Date - 2022-06-30T09:44:00+05:30 IST