నమ్మినవారికి అండ

ABN , First Publish Date - 2022-02-11T05:30:00+05:30 IST

ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దైవం పట్ల విశ్వాసం వీడని వారిని... ఆ దైవం ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడనడానికి ఉదాహరణ బైబిల్‌లోని దానియేలు కథ. బాబిలోనుకు రాజుగా బాధ్యతలు స్వీకరించిన దర్యావేషు తన రాజ్యంలో వ్యవహారాల్ని చూడడానికి ..

నమ్మినవారికి అండ

ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దైవం పట్ల విశ్వాసం వీడని వారిని... ఆ దైవం ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడనడానికి ఉదాహరణ బైబిల్‌లోని దానియేలు కథ. బాబిలోనుకు రాజుగా బాధ్యతలు స్వీకరించిన దర్యావేషు తన రాజ్యంలో వ్యవహారాల్ని చూడడానికి 120 మందిని అధికారులుగానూ, వారి మీద పర్యవేక్షణ కోసం మరో ముగ్గురిని నియమించాడు. ఈ ఉన్నతాధికారుల్లో దానియేలు ఒకరు. జెరూసలేమ్‌లో పుట్టిన దానియేలు బానిసగా బాబిలోనుకు వచ్చాడు. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగాడు. దానియేలు సామర్థ్యాన్ని చూసి అతన్ని ప్రధానమంత్రిగా నియమించాలని దర్యావేషు భావించాడు. ఇది చాలామందికి అసూయ కలిగించింది.


దానియేలు నిత్యం యెహోవాను ప్రార్థిస్తూ ఉండేవాడు. అతన్ని ఎలాగైనా దెబ్బతీయాలన్న ఆలోచనతో... రాజు దగ్గరకు అతని వ్యతిరేకులు వెళ్ళి, దేశంలోని ప్రజలెవరూ 30 రోజుల పాటు రాజును తప్ప మరెవరినీ ప్రార్థించకూడదనీ, దీన్ని ఉల్లంఘించినవారిని సింహాల గుహలో పడెయ్యాలనీ శాసనం చేసేలా ఒప్పించారు. దానియేలు యథాప్రకారం యెహోవానే ప్రార్థించడంతో... రాజాజ్ఞను ధిక్కరించాడంటూ అతనిపై చర్యకు ఆ అసూయాపరులు రాజును ప్రేరేపించారు. దానియేలుపై ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ... రాజు నిస్సహాయుడయ్యాడు. దానియేలును సింహాలు ఉన్న గుహలో పడేశారు. 


ఆ రాత్రంతా నిద్రలేకుండా గడిపిన రాజు దర్యావేషు... మరునాడు ఉదయం సింహాల గుహ దగ్గరకు వెళ్ళి, దానియేలు చెక్కుచెదరకుండా సజీవంగా ఉండడం చూసి ఆనందించాడు. ఏం జరిగిందని దానియేలును అడిగాడు. ‘‘నేను నమ్మిన దేవుడు తన దూతలను పంపించాడు, సింహాల నోళ్ళు మూయించాడు. అవి నాకెలాంటి హానీ చెయ్యలేదు’’ అని దానియేలు బదులిచ్చాడు. అతనిపై కుట్ర చేసిన వారిని సింహాల గుహలో పడేయించిన రాజు... దానియేలు ప్రార్థించే దేవుడి పట్ల విశ్వాసం ప్రకటించాలనీ, భయం కలిగి ఉండాలనీ ఆజ్ఞ ఇచ్చాడు. ‘బయటపడడం అసాధ్యం’ అనుకున్న అపాయాలను తప్పించే శక్తి దైవానికి మాత్రమే ఉంది. ఏ విధమైన ఒత్తిడికీ లొంగకుండా... నమ్మిన విశ్వాసాన్ని ఆచరించేవారికి ఆయన ఎల్లప్పుడూ అండగా నిలుస్తాడు.

Updated Date - 2022-02-11T05:30:00+05:30 IST