శరీరమాద్యం ఖలు ధర్మసాధనం

ABN , First Publish Date - 2020-02-16T09:55:56+05:30 IST

సకల మానవులకు శరీరమే ధర్మసాధక యంత్రం. ఆ శరీరాన్ని రక్షించే దైవం ఆరోగ్యమే. ‘‘శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం’’ అన్నాడు మహాకవి కాళిదాసు. నిశ్చల నిర్మల నిష్ఠాగరిష్ఠతతో మానవుడు జ్ఞాన,

శరీరమాద్యం ఖలు ధర్మసాధనం

సకల మానవులకు శరీరమే ధర్మసాధక యంత్రం. ఆ శరీరాన్ని రక్షించే దైవం ఆరోగ్యమే. ‘‘శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం’’ అన్నాడు మహాకవి కాళిదాసు. నిశ్చల నిర్మల నిష్ఠాగరిష్ఠతతో మానవుడు జ్ఞాన, విజ్ఞానాలు, సముపార్జించాలన్నా శారీరక ఆరోగ్యం కావాలి. శరీర ఆరోగ్యం కలవారే మానసిక ఆరోగ్యం కలిగి ఉంటారు. 

దుఃఖేష్వను ద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః

వీతరాగభయః క్రోధో స్థిత ధీర్ముని రుచ్యతే

కష్టాలు, దుఃఖాలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా, ఐశ్వర్యాలు, సుఖాలు సమకూరినప్పుడు పొంగిపోకుండా మానవుడు స్థిత ప్రజ్ఞుడుగా వుండాలని భగవద్గీత బోధిస్తోంది. అలా వుండటానికి కూడా ఆరోగ్యం కావాలి. తర్కబద్ధత లేని, ఫలితం తెలియని తపస్సులతో, నియమనిష్ఠలతో గౌతమ బుద్ధుడు ఎవరో ఉపదేశిస్తే పుష్ఠిగా ఉన్న శరీరాన్ని ఆరేళ్లపాటు శుష్కింపజేసుకున్నాడు. ఫలితం కానరాలేదు. చివరకు స్పృహ కోల్పోయి ఒక చెట్టు కింద పడి ఉండగా సుజాత అనే యాదవ మహిళ చూసి, నోట్లో పాలు పోసి.. తాగించి బతికించింది.


ప్రయోజనం తెలియని నిష్ఠలతో.. తపస్సులతో.. ఉపవాసాలతో శుష్కీభూతం అయిన శరీరం నుండి శుష్కీభూత ఆలోచనలే వస్తాయని బుద్ధుడు తెలుసుకున్నాడు. తనను బ్రతికించిన మహిళ సుజాత తనకు జీవిత సత్యం చెప్పిన గురువు అయిందని తెలుసుకున్నాడు. స్వయంగా తాను అనుభవించి, తెలుసుకున్న సత్యాన్ని సమాజానికి సందేశంగా అందించాడు. 80 ఏళ్ల వయసు వరకూ పర్యటనలు చేసి, బౌద్ధతత్వశాస్ర్తాన్ని విస్తరింపజేయగల శక్తికి మూలం ఆ మహనీయుని ఆరోగ్యభాగ్యమే! భారతీయ తాత్విక చింతనను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టినవిఉపనిషత్తులు. వందకుపైగా ఉన్న ఉపనిషత్తులలో ముఖ్యమైన కఠోపనిషత్తు మానవ జీవితానికి చక్కని భాష్యం చెప్పింది. ఆరోగ్యకరమైన దేహానికి, అవినాశియైున ఆత్మకి (దేహికి) ఉన్న సంబంఽధాన్ని వివరించింది.


ఆత్మానాం రథినం విద్ది శరీరం రథమేవచ

బుద్ధింతు సారథిం విద్ది మనః ప్రగ్రహమేవచ

ఇంద్రియాణి హయానా హుర్విషయాస్తుషు గోచరాన్‌

మానవ శరీరం రథం! ఆత్మ(దేహి) రథికుడు! ఆ రథికుని బుద్ధి సారథి! మనస్సు పగ్గం! ఇంద్రియాలు (కోరికలు) గుర్రాలు! విషయాలు (అనుభవాలు) మార్గాలు! బుద్ధి అనే సారథి.. మనస్సు అనే పగ్గాన్ని చేతబట్టి, కోరికలు అనే గుర్రాల్ని సరియైున మార్గాల్లో నడిపించాలంటుంది ఈ ఉపనిషత్తు. మానవులు ఇలా వుండాలంటే, శరీరాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యాన్నీ, మేధాశక్తినీ, పెంచుతుంది. అన్ని రకాల భోగభాగ్యాల కన్నా ఆరోగ్య భాగ్యమే మిన్న! అందుకే పెద్దలు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు.


పారుపల్లి వెంకటేశ్వరరావు, 9848161208

Updated Date - 2020-02-16T09:55:56+05:30 IST